Suryaa.co.in

Telangana

బివ‌రేజ్ కార్పోరేష‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల ఎక్సైజ్ శాఖకు చెడ్డ‌పేరు

-కీల‌క‌మైన బాధ్య‌తల్లో ఉన్న‌వారు ప్ర‌భుత్వం ఇచ్చే ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాలి
-స్వంత నిర్ణ‌యాల వ‌ల్ల ప్రభుత్వానికి ఇబ్బంది
-ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయి
-విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తే స‌హించేది లేదు
-ప్ర‌భుత్వ దృష్టికి తీసుకురాకుండా విధివిధానాల‌ను ఎలా ఖ‌రారు చేస్తారు?
-ఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్ణ‌య తీసుకున్నారు?
-విచార‌ణ జ‌రిపి నివేదిక స‌మ‌ర్పించండి
-ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశం
-నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన‌ అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు
-ఎక్సైజ్ శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు సుధీర్ఘ స‌మీక్ష‌

తెలంగాణ బివ‌రేజ్ కార్పోరేష‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల ప్ర‌భుత్వానికి, ఎక్సైజ్ శాఖ‌కు చెడ్డ పేరు వ‌స్తుంద‌ని, కీల‌క‌మైన బాధ్య‌తల్లో ఉన్న‌వారు ప్ర‌భుత్వం ఇచ్చే ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్ప‌ష్టం చేశారు.

నాంప‌ల్లిలోని ఎక్సైజ్ కార్యాల‌యంలో అబ్కారీ శాఖపై సుధీర్ఘంగా నాలుగు గంట‌ల పాటు మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఇటీవ‌ల ఎక్సైజ్ శాఖ‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలపై మంత్రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారుల స్వంత నిర్ణ‌యాల వ‌ల్ల ఎక్సైజ్ శాఖ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగింద‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.

మ‌ద్యం కంప‌నీల అనుమ‌తుల వ్య‌వ‌హ‌రంలో ప్ర‌భుత్వ దృష్టికి తీసుకురాకుండా బివ‌రేజ్ కార్పోరేష‌న్ అధికారులు ఎలా విధివిధానాలు ఖ‌రారు చేస్తార‌ని మండిప‌డ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాల‌ని, విచార‌ణ జ‌రిపి స‌మ‌గ్ర నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఎక్సైజ్ శాఖ కమిషన‌ర్ & ఎండీ శ్రీధ‌ర్, బ్రూవ‌రీస్ కార్పోరేష‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అబ్ర‌హంను మంత్రి జూప‌ల్లి ఆదేశించారు. నివేదిక‌ను బ‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం సరఫరా, క‌ల్తీ క‌ల్లు, గుడుంబా, గంజాయి తదితర తయారీ, సరఫరా, అమ్మకాలపై నిరంత‌ర‌ నిఘాను పెట్టాల‌ని, ఉక్కుపాదంతో డ్ర‌గ్ మాఫియాను అణిచివేయాల‌నే కృత‌నిశ్చ‌యంతో సీయం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంద‌ని, దీనిపై సీయం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేశారు.

స‌ర‌ఫ‌రాదారులు, విక్రేత‌లు, స‌ప్ల‌య‌ర్ నెట్ వ‌ర్క్ జాబితా త‌యారు చేసి డాటా బేస్ త‌యారు చేయాల‌ని దిశానిర్ధేశం చేశారు. త‌ర‌చుగా ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డే వారిపై ఉక్కుపాదం మోపాల‌న్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసు శాఖ స‌మ‌న్వ‌యంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ప‌ని చేయాల‌ని, ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాకారం ఉంటుంద‌ని చెప్పారు. సాంకేతిక‌ను కూడా ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

మాద‌క‌ద్ర‌వ్యాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై స‌మాజంలో అవగాహన కల్పించేందుకు మీడియా, సోష‌ల్ మీడియా, దియేట‌ర్ల‌లో ఆడియో, వీడియోలో రూపంలో విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని చెప్పారు. విద్యార్థుల త‌ల్లిదండ్రులు, అధ్యాప‌కుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని వారిలో అవేర్నెస్ తీసుకురావాల‌ని వెల్ల‌డించారు. మాద‌క ద్ర‌వ్యాల స‌ర‌ఫరాను అరిక‌ట్టేందుకు మ‌రింత నిఘా పెట్టాల‌న్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ అని , ఉద్యోగులు, సిబ్బంది స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే నేరుగా త‌న దృష్టికి తీసుకురావ‌చ్చ‌ని సూచించారు. స‌మ‌ర్ద‌వంతంగా విధులు నిర్వ‌ర్తించే ఉద్యోగులు, సిబ్బందికి ప్రోత్స‌హాకాలు ఇవ్వాల‌ని చెప్పారు. అధికారుల ప‌ని తీరును బ‌ట్టి ఇంక్రిమెంట్లు, రివార్డులు, బ‌దిలీల్లో ప్రాధ‌న్య‌తనివ్వాల‌ని అన్నారు.

ఈ స‌మావేశంలో ఎక్సైజ్ శాఖ క‌మిష‌న‌ర్ & ఎండీ ఇ.శ్రీధ‌ర్, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అజ‌య్ రావు, బ్రూవ‌రీస్ కార్పోరేష‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అబ్ర‌హం, ఉమ్మ‌డి జిల్లాల డిఫ్యూటీ క‌మిష‌న‌ర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE