Suryaa.co.in

Andhra Pradesh

కాపురాల ఏర్పాటుపై దేశంలో ఎలాంటి నిషేధం లేదు

సీఎంకు బహుజన ఐకాస బాలకోటయ్య హితవు

కాపురాల ఏర్పాటుపై దేశంలో ఎలాంటి నిషేధం లేదని, ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కాపురాలు పెట్టుకోవచ్చని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలో తాను కాపురం పెట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాలారిష్ట చేష్టలుగా కొట్టి పడేశారు. ఇలాంటి మాయ కబుర్లు నాలుగేళ్ళలో 151 సార్లు చేసినట్లు చెప్పారు.

మూడు రాజధానుల గూర్చి పదే పదే ఉపన్యాసాలు చేసిన ముఖ్యమంత్రి తాజాగా కాపురాల గూర్చి ఉపన్యాసం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు.కోర్టు ధిక్కారాల గూర్చి భయపడ్డారా? లేకపోతే గెలుపు పై ధైర్యం సన్నగిల్లిందా? అంటూ ప్రశ్నించారు. ఉన్న రాజధాని అమరావతి ని నాశనం చేసిన సిఎం కు రాజధాని గూర్చి కానీ, మూడు రాజధానుల గూర్చి కానీ మాట్లాడే నైతికత లేదు అన్నారు. రాజధాని అంటే ఏమిటో సీఎంకి తెలియదు అని చెప్పారు. ఇలాంటి సీఎంలకు రాజధానులతో పనిలేదని, వందలు, వేల కోట్లు ఉంటే చాలు అన్నారు.

2019 ఎన్నికల ముందు రాజధాని రైతులకు, విజయవాడ , గుంటూరు జంట నగరాల ప్రజలకు తాడేపల్లిలోనే నా కాపురం అని, అక్కడే ఇల్లు కట్టుకున్నాను చెప్పిన విషయాన్ని విశాఖపట్నం ప్రజలు మరువకూడదు అని గుర్తు చేశారు. ఆయన అనుచర గణం కూడా సీఎం చెప్పిన మాటలను వల్లె వేశారు అని పేర్కొన్నారు. ఏరు దాటే దాకా ఏటి మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న మాటలు ముఖ్యమంత్రి కాపురం అనే వ్యాఖ్యలు రెండూ ఒకటే అని అభివర్ణించారు.

LEAVE A RESPONSE