-డర్టీ రాజకీయం ముసుగు తొడిగి ఎంపీని కాపాడలేరు
-ఎంపీని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం గుడ్డలు విప్పదీసుకోవద్దు
-ఫిర్యాదు లేకుండా, ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా ఎలా ఫోరెన్సిక్ నివేదికను తెస్తారు
-సిఐడి ఎడిజి పీవీ సునీల్ కుమార్ మార్క్ రాజకీయంపై బహుజన జెఎసి బాలకోటయ్య కౌంటర్
చదువు లేనివాడు ఒక చోట రాసుకుంటే,చదువు ఉన్న వాడు పది చోట్ల రాసుకున్నట్లు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వీడియో వ్యవహారంలో తప్పిదాన్ని అంగీకరించే ధైర్యం లేక ప్రభుత్వం కొత్త తప్పులు చేస్తుందని, నన్ను చూడు నా పాలనా అందం చూడు అన్నట్లు గల్లీ పిక్చర్ ను ఏపీ నుంచి అమెరికా వరకు తీసుకెళ్లారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు.
శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులపై అనైతిక ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే వారికి వారే నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేయాలని, లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేయించాలని గుర్తు చేశారు. అలాంటి ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి గుడ్డలు లేని ఎంపీని కాపాడేందుకు ప్రభుత్వం కూడా గుడ్డలు విప్పదీసు కొని మాట్లాడటం హేయమైన చర్య అని పేర్కొన్నారు.ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సుమోటుగా సిఐడి డీఐజీ సునీల్ కుమార్ అమెరికాలోని ఫోరెన్సీక్ నివేదిక కోసం ఎలా ప్రయత్నించాలని ప్రశ్నించారు.
దళితులపై దారుణమైన హత్యలు, అత్యాచారాల సంఘటనలలో ఎన్ని కేసులను సుమోటోగా స్వీకరించారో సునీల్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ల్యాబ్ నివేదికను పరిగణలోకి తీసుకోమంటూనే, ప్రైవేటు రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలపై అశ్లీల దాడి దేనికి? అని పేర్కొన్నారు. పోయిన ప్రభుత్వ పరువును కాపాడేందుకు, ముఖ్యమంత్రి దగ్గర ఆశీర్వచనాలు పొందేందుకు, ప్రతిపక్షాలపై బూతు రాజకీయం అంటగట్టి ఎంపీని కాపాడేందుకు సునీల్ కుమార్ చేసే ప్రయత్నం వృధా ప్రయాస అన్నారు.
బొమ్మ లేకుండా దాని ప్రతి బొమ్మ ఉండదని, ప్రతి బొమ్మ నిజం అయినప్పడు బొమ్మ కూడా నిజమేనన్న సంగతి తెలియదా? అన్నారు. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అది ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో అనే చెప్తారని తెలిపారు. ఇప్పటికే గోరంట్ల వ్యవహారం పార్లమెంట్ స్పీకర్ దృష్టికి వెళ్లిందని,తక్షణ ఎంపీగా తొలగించి పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలని బాలకోటయ్య కోరారు. రాష్ట్రంలో మహిళా లోకం కేంద్రంపై ఒత్తిడి చేయడమే ఉత్తమమైన పోరాట మార్గమని సూచించారు.