-తక్షణం రావులపాలెం దళిత యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి
-మేనమామలంటే అర్థం ఇదేనా…
-ప్రభుత్వ జంగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ బాధ్యత తీసుకోవాలి
-అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
రావులపాలెంలో డిస్పోజల్ ప్లేట్స్ పై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించిన అనాగరిక చర్యను ప్రశ్నించినందుకు ఏకంగా 18 మంది దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ‘మాలలు నాకు మేనమామలు’ అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నం పున్నెం ఎరుగని మాల కులానికి చెందిన 17 మంది యువకులను, మాదిగ కులానికి చెందిన మరొకరిని జైలుకు పంపారని చెప్పారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే జగిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించి చలో రావులపాలెం పిలుపు ఇచ్చిన దళిత నాయకులను అరెస్టులు చేస్తున్నట్లు చెప్పారు.
వైకాపా చెబుతున్న బూటకపు సామాజిక న్యాయాన్ని వైకాపా లోని దళిత ప్రజా ప్రతినిధులు ప్రశ్నించాలని కోరారు. దళిత యువకుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించి,విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మేనమామల సత్తా ఏంటో చూపుతాం అని బాలకోటయ్య హెచ్చరించారు.