Suryaa.co.in

Editorial

షుబ్బారావ్..ఇంకా తత్వం తెలుసుకోకపోతే ఎట్లబ్బాయ్?

– మతిస్ధిమితం లేనివాడు బాలినేని ఇంటికెట్లా వెళ్లాడబ్బా?
– మొన్న హాటు గుద్దులు.. నిన్న స్వీటు కేకులా?
– వైసీపీ వైశ్య రత్నాలు మాట్లాడరేం?
– జగన్, మంత్రులు క్లారిటీతో ఉన్నా… లేనిది వైసీపీ నేతలే
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏంటి షుబ్బారావ్.. ఇంత వయసొచ్చీ, జగనన్న పార్టీలో తిరుగుతూ ఇంకా క్లారిటీ లేకపోతే ఎట్లా? అప్పటికీ జగనన్న ఎన్నికల ముందు ‘ఖులం ఛూడం.. మతం ఛూడం’ అన్నారు కదా? అంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా సరే.. చివరాఖరకు సొంత పార్టీ వారి ఖులమైనా, మతమైనా ఛూడమన్న విషయం తన్నులు తింటే గానీ తెలుసుకోలేకపోతే ఎలా? అంటే సుభానీతో తన్నులు తింటే గానీ గుప్తాజీకి తత్వం బోధపడలేదు పాపం! ‘వాసన్న.. వాటీజ్ దిస్ అన్నా’ ప్రశ్నించినందుకు బాలినేని శీనన్న మనిషి సుభానీ, చిన్నప్పుడు సుబ్బారావు గుప్తా తిన్న బిర్యానీ కూడా కక్కించినందుకు కోమట్లు కళ్లెర్ర చేస్తున్నా, ఇంకో రెండేళ్ల వరకూ చింతామణిలో సుబ్బిశెట్టి చెప్పినట్లు.. నువ్వు ఉరిమి చూసినా ఒకటే నేను ఊరక చూసినా ఒకటే. అంటే జగనన్న సర్కారును ఏమీ చేయలేరన్నమాట. దిసీజ్ వాస్తవం!

subbarao-1ఓకే.. ఓకే.. మంత్రి బాలినేని వాసన్న చెప్పినట్లు గుప్తా ఓ పిచ్చోడే. అలా అని కాసేపు అనుకుందాం. మరి పిచ్చోడికి అంతసేపు మైకిచ్చి మాట్లాడే చాన్సు ఎలా ఇచ్చారు? సరే ఇచ్చారు పో. అక్కడ షుబ్బారావ్ మామూలు మనుషుల కంటే బాగా మాట్లాడారు కదా? జగనన్నకు సుద్దులు చెప్పాడు కదా? సరే బాగానే మాట్లాడాడే అనుకుందాం. అక్కడ క్లారిటీతో

మాట్లాడిన షుబ్బారావ్‌ను వైసీపేయులంతా తెగ మెచ్చుకున్నారు కదా? మా మనసులో మాట, మేం చెప్పలేని మాటలను సుబ్బారావు గుప్తాజీ ధైర్యంగా చెప్పాడని చప్పట్టు కొట్టారు కదా? మరి మెచ్చుకున్న ఆ బాపతుగాళ్లంతా పిచ్చోళ్లేనా? ఏమో.. బాలినేని వాసన్న మాటల్లో పిచ్చోళ్లే కామోసు!

సరే దాన్నీ కాసేపు పక్కనపెడదాం. సుభానీ అండ్ కో బెదిరింపులకు భయపడిన పిచ్చోడు షుబ్బారావ్, లాడ్జిలో ఆధార్ నెంబరు ఇచ్చి మరీ రూము బుక్ చేసుకుంటాడా? పిచ్చోళ్లకు అన్ని తెలివితేటలుంటాయా? బాలినేని వాసన్న వీరాభిమాని సుభానీ.. లైవ్ టెలికాస్టు చేసి మరీ తంతుంటే, షుబ్బారావ్ తెలివిగానే మాట్లాడిండు కదా? దాన్నీ కాసేపు పక్కనపెడితే.. ఇంత జరిగినా, మళ్లీ షుబ్బారావ్ బాలినేని వాసన్న అడ్రసు గుర్తు పెట్టుకున్న పిచ్చి షుబ్బారావ్ కరెక్టుగా వాసన్న ఇంటికే వెళ్లడం, జగనన్న బర్త్‌డే కేకును పిచ్చి షుబ్బారావ్ వాసన్నకు తినిపించడం కామెడీగా లేదూ? మతిస్థిమితం లేని వారి కేక్ తిన్న బాలినేని

వాసన్న హృదయం హిమాలయాల కంటే ఎత్తయినదే. షుబ్బారావ్‌ను కొడుతుంటే నేను అడ్డుపడ్డానని బాలినేని వాసన్న చె ప్పడం ఇంకో డబుల్ కామెడీ.

సుబ్బారావ్ తన్నులాటను లైవ్‌లో చూపించి మరీ తన్నిన సుభానీసాబ్‌ను, పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేయకపోవడం ఇంకోకామెడీ . జగనన్నమీద ఎవరె వరో పోస్టింగులు పెట్టారనో, లేక సాయంత్రం ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు హైదరాబాద్ బయల్దేరి.. అర్ధరాత్రి తలుపులు పగలకొట్టి మరీ బీభత్సకాండ సృష్టించే సీఐడీ సార్లు, ఇప్పటివరకూ సుభానీ సాబ్ ఇంటి తలుపులు తట్టకపోవడం వీటన్నిటికంటే పెద్ద కామెడీ. వెనకటికి ముతకసామెత చెప్పినట్లు, …..‘పుర్రచేయి లోకువ’ మాదిరిగా, నోరూ వాయీ లేని కోమట్లను కొట్టినా అడిగే దిక్కుండదన్న ధీమానే, బహుశా బాలినేని ఫ్యాన్స్ ధీమాకు కారణమేమో? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్లారిటీతోనే ఉన్నారు. ఎటొచ్చీ వైసీపీ అభిమానులే క్లారిటీతో లేరన్నది సుబ్బారావు ఎపిసోడ్ చెప్పింది.

అయినా సుబ్బారావ్ పిచ్చికాకపోతే… జగనన్నకు సలహాలివ్వలేక పివి రమేషన్నలు, అజయ్ కల్లమన్నలూ, ఎల్వీ సుబ్రమణ్యమన్నలే వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. బతికున్నప్పుడు

సోమయాజులు గారు చెప్పీ చెప్పీ విసిగిపోయారు. రిజర్వుబ్యాంకు రెడ్డిగారే సైలెంటయిపోయారు. మధ్యలో పార్టీ జెండాలమ్ముకునే ఆఫ్టరాల్ కార్యకర్త, సుబ్బారావ్ చెబితే జగనన్న చెవికెక్కుతుందా ఏంటి? గుప్తా చాదస్తం కాకపోతే?!

కోటి రూపాయలు ఇచ్చయినా సరే కోమటితో స్నేహం చేయాలని అప్పుడెప్పుడో కేసీఆర్ చెప్పారు. సరే.. ఆయనంటే కింద నుంచి పైకొచ్చినాయన కాబట్టి అనుభవంతో చెప్పాడు. పాపం గోల్డు స్పూన్‌తో పుట్టిన జగనబ్బాయి, ఆయన వీరాభిమానులకు అవేమీ తెలియవు కాబట్టి వారినలా వదిలేయండి. జగన్‌బాబు అండ్ కో సంగతంటే వదిలేయండి. వారికి ఈ వికటాట్టహాసాలు, హాహాకారాలు, హితైషుల హితోక్తులు వినబడవు. సరే. మరి వైశ్య కులానికే చెందిన మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ వీరులు.. సుబ్బారావు గుప్తాను కొట్టినప్పుడు నోర్లెందుకు పడిపోయాయి? నవరంధ్రాలూ మూసుకుని మౌనదీక్ష ఎందుకు చేస్తున్నారన్నదే ఆశ్చర్యం.

అప్పటికీ పాపం మంత్రి వెల్లంపల్లి సుబ్బారావ్‌పై దయదలచి నీకేం భయలేదు. నేనున్నా అని ఫోన్ నెంబరు కూడా ఇచ్చారట. బాగానే ఉంది. కానీ ఇప్పటిదాకా తనను కొట్టిన సుభానీ సాబ్‌ను అరెస్టు చేయకపోవడం, తన వద్దకు కనీసం హోంగార్డు కూడా రాలేదని సుబ్బారావు వాపోవడం చూస్తే.. సుబ్బారావుకు ఇంకా తత్వం బోధపడలేదన్నమాట.

అయినా ఈ దిక్కుమాలిన తాలిబన్ల కల్చరేమిటంట? శత్రువును కొడుతుంటే అతగాడి హాహాకారాలను వీడియో తీసి, వాటిని సోషల్‌మీడియాకు వదిలి వికటాట్టహాసం చేసే ఈ తాలిబనిజం కల్చర్ ఆంధ్రాలో అడుగుపెట్టడమే కాదు, అది గ్రామాలకూ విస్తరించడం మాయదారి సంకేతమే. ఐఎస్‌ఐఎస్ ముఠాలు ఎవరినైనా చంపేముందు, అతగాడిని ఎలా చంపారని ప్రపంచ వీక్షకులు తెలుసుకునే వెసులుబాటు కోసం ఆ హత్యాకాండను 70ఎంఎంలో తీసి, సోషల్‌మీడియాలో పెడుతుంటారు.

అంటే తమకు ఎవరు ఎదురుచెప్పినా, ప్రశ్నించినా, తమ ఆదేశాలు పాటించకపోయినా అందరికీ అదే గతి పడుతుందన్నది తీవ్రవాదుల కవి హృదయం. అలాగే ఆంధ్రాలో కూడా అంత సీరియస్‌గా కాకపోయినా, ఈ సుబ్బారావు గుప్తా లాంటివాళ్ల తోలు వలిచే సుందర-సుమధుర-కమనీయ హాహాకార ఘట్టాలను వైసీపేయులు తాలిబన్ల నుంచి అరువుతెచ్చుకుంటున్నా, వారిపై చర్యల కొరడా ఝళిపించకపోవడం అరాచాలకు పరోక్షంగా సెల్యూట్ కొట్టినట్లేనన్నది జనవాక్కు.

ఏతావతా అఖిలాండకోటి జగన్నాయకుడి భక్తులు, అభిమానులకు చెప్పొచ్చేదేమిటంటే.. జగనన్న జనరంజక పాలన గురించి ఊరూ వాడా తిరిగి టముకేయాలి. పాలన లోటుపాట్ల గురించి దిక్కుమాలిన సలహాలివ్వకండి. ‘వాసన్నా.. వాటీజ్ దిస్ అన్నా’ అని సుబ్బారావ్ బాలినేనిని అడిగన మాదిరిగా, ‘జగనన్నా వాటీజ్ దిస్ అన్నా’ అని పొరపాటున టంగ్ స్లిప్పయ్యారనుకోండి. సుభానీ సాబ్ సుబ్బారావును ఊరకనే కొట్టి వదిలేశారు. అదే జగనన్నకు అట్లా ఎవరైనా సలహాలిచ్చారే అనుకోండి. ‘సీమ సింహాలు’ మీదపడి మింగేస్తాయి. కాబట్టి మీ ఇళ్లు, ఒళ్లూ, కళ్లు, కాళ్లూ అక్కడే ఉండాలనుకుంటే మంగ్లీ పాడిన ‘రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న’ సాంగేసుకోవడం అందరి ఆరోగ్యాలకూ శ్రేయస్కరం. దిసీజ్ వాస్తవం!

LEAVE A RESPONSE