బాలినేని శ్రీనివాస్ రెడ్డి… ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేరు.ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుండి ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు.వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, సన్నిహిత బంధువు అయినప్పటికీ… యూత్ కాంగ్రెస్ లో చురుకైన నాయకుడిగా ఎదిగి, తెలుగుదేశం గాలిని తట్టుకొని సైతం 1999 లో మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత వరుసగా…2004,2009 సాధారణ ఎన్నికలలో గెలిచి, హ్యాట్రిక్ సాధించి, 2009 లో వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. 2009లో వై.యస్.రాజశేఖర రెడ్డి రెండవ కేబినెట్ లో గనులు,భూగర్భశాస్త్రం, చేనేత వస్త్రాలు, వస్త్రాలు, స్పిన్నింగ్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నాడు.ఆ తర్వాత పరిణామాలలో జగన్ కోసం మంత్రి పదవి వదులుకొని, త్యాగం చేసి ,ఉప ఎన్నికలలో సైతం 26 వేల మెజారిటీతో విజయం సాధించాడు.
అదే సమయంలో లోక్ సభకు పులివెందుల శాసన సభకు జరిగిన ఉప ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి, వైయస్ విజయమ్మ విజయం సాధించడంలో పూర్తి కాలం పని చేశాడు.2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అతివిశ్వాసం వల్ల , సొంత బంధువుల వెన్నుపోటు వల్ల ఓడిపోయినప్పటికీ… 2019లో జగన్ ప్రభంజనం లో తిరిగి ఎన్నికయ్యారు.వైయస్సార్ బ్రతికి ఉన్నన్ని రోజులు బాలినేని ని సొంత కొడుకులా చూసుకునే వాడు బాలినేని కూడా వైయస్సార్ మాట వేదంలా భావించేవాడు.2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర, ప్రకాశం జిల్లాలో ప్రవేశించిన తర్వాతే ప్రభంజనం లా మారింది . అంతేకాదు విజయవంతం కావడంలోనూ ఆర్థికంగాను, ప్రజలను కూడగట్టడం లోనూ… బాలినేనిదే ప్రధాన పాత్ర.
ప్రస్తుతానికి వస్తే…..
నిన్న మంత్రిమండలి రాజీనామాల తర్వాత, కొంతమంది సీనియర్స్ ను కొనసాగిస్తామని చెప్తూ , మీరు మాత్రమే త్యాగం చెయ్యాలి , అన్న కోణం బాలినేని కుటుంబం అవమానం గా భావిస్తున్నది అని భోగట్టా . మొత్తం మంత్రులు త్యాగానికి , రాజీనామాలకు సిద్ధపడాలి అని మొదట చెప్పిన వ్యక్తి బాలినేనే . కానీ తన సమకాలీకులను కొనసాగిస్తూ తనని నిర్లక్ష్యం చెయ్యడం పొమ్మన లేక పొగబెట్టడమే అని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితుల వేదన .మంత్రి పదవి పోవటం కన్నా, జగన్ నిర్లక్ష్య ధోరణి… అత్యంత అవమాన కరంగా ఉందని, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మాకు, ప్రస్తుత మంత్రి పదవి గొప్పది కాదని, కానీ… జగన్ అనుసరిస్తున్న విధానమే, అవమాన కరంగా ఉందని, కుటుంబ సభ్యుల సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారని అభిజ్ఞుల గుసగుసలు .
ఇన్ని అవమానాలు భరిస్తూ, రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని,కుటుంబ సభ్యులు చెబుతున్నట్టు ,ఇప్పటికిప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో బాలినేని, రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా… బేషరతుగా సమర్డిస్తామని కుటుంబ సభ్యులు ,బంధువులు ,చెబుతున్నట్టు లోగుట్టు ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన… బాలినేని గురించి రాజకీయ ప్రత్యర్థులు కూడా పదునైన విమర్శలు చేయరు. ఎందుకంటే, బాలినేని స్వతహాగా మితభాషి , సున్నితమనస్కుడు ,అందరితోనూ సరదాగా ఉంటాడు, స్నేహపూర్వకంగా ఉంటాడు. రాజకీయంగా వేరువేరు పార్టీలలో ఉన్నప్పటికీ, అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తాడు.రాజకీయాలలో నిభద్దత , నిజాయితీ కలిగిన వ్యక్తిగా పేరుంది . ఎలాంటి ఆరోపణలకు , పైరవీలకు తావివ్వడు . మేకపాటి గౌతం రెడ్డి తరువాత ప్రత్యర్ధులు సైతం రాజకీయ అంశాల మీద తప్ప వ్యక్తిగతం గా విమర్శించరు . మౌనం గా అధిష్టానం ఇచ్చిన భాద్యతను ఆర్భాటాలకు , ప్రచారానికి దూరం గా ఉంటూ చేసుకుపోడం అతని సహజ శైలి . అలాంటి బాలినేని, ప్రస్తుతం అవమాన భారంతో… ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.
2017 లో 23 మంది వై ఎస్ ఆర్ సి పి శాసనసభ్యులు, తెలుగుదేశంలో చేరినప్పుడు, బాలినేని కూడా సిద్ధమయ్యాడు. కానీ వైఎస్ విజయమ్మ జోక్యంతో ఆగిపోయాడు.ఇప్పుడు ఏం జరిగిద్దో…. వేచి చూద్దాం.