అసలు ఈటల రాజేందర్ కు రాజకీయంగా ఊపిరి పోసిన పార్టీ టీఆర్ఎస్ అని.. కానీ ఆయన బీజేపీ పంచన చేరి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడారు.
‘‘కొన్ని రోజులుగా బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇది చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. 2004కు ముందు ఈటల రాజేందర్ కు అడ్రస్ కూడా లేదు. కనీసం కార్పొరేటర్ గా లేకుండా ఉన్న ఈటలను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినది సీఎం కేసీఆర్. ఒక పెద్దన్నలా చూసుకున్న కేసీఆర్ నే ఇబ్బంది పెట్టేలా, అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టినట్టుగా ఈటల వ్యవహరిస్తున్నారు..” అని బాల్క సుమన్ మండిపడ్డారు.
రహస్యంగా మంతనాలు చేస్తూ..
‘‘నమ్మి చేరదీస్తే.. శత్రువులతో చేతులు కలిపి.. శిఖండి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈటల రాజేందర్. మంత్రిని చేసి మంచిగా పనిచేయాలంటే.. ఎస్సీలు, బీసీల భూములు, దేవాలయాల భూములు కబ్జా చేసి.. ఒక కబ్జా కోరుగా నిలిచిపోయారు. ఇతర పార్టీల రాజకీయ నాయకులతో మంతనాలు చేస్తూ.. నమ్మిన పార్టీకి, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించారు” అని సుమన్ ఆరోపించారు.
బీజేపీకి బాకా ఊదుతున్నారు..
‘‘ఇవాళ భారత దేశ చరిత్రలోనే అత్యంత దుర్మార్గ పాలన సాగిస్తున్న బీజేపీ పంచన చేరారు. బీజేపీ నేతలకు బాకా ఊదుతున్నారు. అసలు తాను కమ్యూనిస్టుల నుంచి వచ్చాను అన్న ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారు? ఆ నాయకులకు ఊడిగం ఎలా చేస్తున్నారు? గజ్వేల్ లో కేసీఆర్ పైనే పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. హుజూరాబాద్ లో జనం తనను ఛీత్కరిస్తున్నారని.. తాను ఓడిపోబోతున్నానని ఈటలకు తెలిసిపోయింది. అందుకే కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ మీద పోటీ చేసేంత సీన్ ఈటలకు ఉందా?” అని బాల్క సుమన్ ప్రశ్నించారు.