Suryaa.co.in

Telangana

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం

-ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు
-వచ్చే నెల 20 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎంతో చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 20 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై MCHRD మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన దేవాదాయ, GHMC, రెవెన్యు, పోలీసు, ట్రాఫిక్, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జూన్ 19 న ఎదుర్కోళ్ళు, 20 న అమ్మవారి కళ్యాణం, 21 న రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు నగరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని పేర్కొన్నారు. వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు.

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో ఉన్నవారు కూడా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం (లైవ్) కు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆలయం వద్ద కూడా LED స్క్రీన్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అమ్మవారి కళ్యాణం నాటికి ఆలయ పరిసరాలలో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని GHMC అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే అన్ని రహదారులను ఎంతో అద్బుతంగా నిర్మించినట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల అతికొద్ది మంది భక్తుల సమక్షంలో నిర్వాహించేవారని పేర్కొన్నారు. రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఆలయం ముందు నిర్మించిన భారీ షెడ్డు క్రింద లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా అమ్మవారి కళ్యాణం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూ వస్తున్నట్లు వివరించారు. అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన వెండితో ఆలయ ప్రధాన ద్వారం తలుపులకు వెండి తాపడం చేసే పనులను కళ్యాణం నాటికి పూర్తిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే లక్షలాది మంది భక్తులు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల మద్య సమన్వయంతో పని చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్య నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలని ఆదేశించారు.

క్యూ లైన్ లో ఉండే భక్తుల కోసం వాటర్ ప్యాకెట్ లు, బాటిల్స్ అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించాలని చెప్పారు. నీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్బంగా వచ్చే భక్తులకు పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని, వారికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.

రధోత్సవం రోజున 500 మంది కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ పరిసరాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 4 హెల్త్ క్యాంప్ ల ఏర్పాటుతో పాటు 4 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించే విధంగా ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.

షీ టీమ్ లు, మఫ్టీ పోలీసులు కూడా విధులు నిర్వహిస్తారని చెప్పారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం ఉన్న CC కెమెరాలకు అదనంగా తాత్కాలికంగా CC కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్ లకు ప్రత్యేక ఐడెంటిటీ కార్డులను అందజేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కళ్యాణం, రథోత్సవం జరిగే రెండు రోజుల పాటు ఆలయం వైపు వాహనాలు రాకుండా ట్రాపిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా జనరేటర్ లు, అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ట్రాన్స్ కో అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, వెస్ట్ జోన్ DCP జోయల్ డేవిస్, ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకట్, I & PR JD జగన్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రావు, దేవాదాయ శాఖ రీజనల్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, RDO వసంత, ఆలయ EO అన్నపూర్ణ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, R & B SE లింగారెడ్డి, EE రవీంద్ర మోహన్, ట్రాన్స్ కో DE సుదీర్, RTC RM వెంకన్న, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE