బల్లి తలపై పడితే ఏమవుతుంది? చేతిపై పడితే ఏమవుతుంది. నుదుటిపై పడితే ఏమవుతుంది? పొట్టపై పడితే ఏమవుతుంది?అది ఎవరికి ప్రమాదం? ఎవరికి ఆయుక్షీణం? దానికి ఏం చేయాలి? అసలు బల్లి
శాస్త్రం ఏం చెబుతోంది? అది నిజమా? అబద్ధమా? దాన్ని నమ్మాలా? వద్దా? దాని పరిహారమేమిటి? ఇది కొన్ని శతాబ్దాల నుంచి జరుగుతున్న చర్చ. అసలు బల్లి ఏ ప్రదేశంలో పడితే ఏమవుతుంది? అది ప్రమాదమా? కాదా? అన్నది ఇప్పటికీదొరకని జవాబు. అదేమిటో చూద్దాం.
బల్లి శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే శకునాలను నమ్ముతూ వస్తున్నారు. జ్యోతిషంలో గౌలి పఠన శాస్త్రం దీని గురించి వివరిస్తుంది. గౌలి పంచాంగంలో శకునాల ప్రభావం గురించి వివరించారు. మనిషి శరీరంలోని ఓ భాగంపై బల్లి పడిందనే విషయంపైనే కాకుండా ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పడింనేది కూడా ముఖ్యం. కొన్నిసార్లు బల్లి మీద పడితే మంచి శకునంగానూ కొన్ని సార్లు అశుభం.
బల్లి తలపై పడితే వివాదాలు ముసురుకుంటాయనే సంకేతం ఇచ్చినట్లు. తల పైభాగాన పడితే మరణ భయం. ముఖం మీద పడితే ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది. ఎడమ కంటిపై పడితే శుభవార్త వింటారు. కుడి కంటి మీద పడితే మీరు చేపట్టిన పని కాదు.
నుదుటి మీద పడితే ప్రేమికుల నుంచి దూరమవుతారు. పై పెదవి మీద పడితే తగువులు వస్తాయి. కింది పెదవి మీద పడితే త్వరలో ఆర్థిక లాభం చేకూరుతుంది. రెండు పెదవుల మీద పడితే ఒకరి మరణవార్త వింటారు.
నోటి మీద మీ ఆరోగ్యం నశిస్తుందని అర్థం. వీపు వెనక భాగంలో పడితే ఏదో విజయం గానీ ఫలితం గానీ లభిస్తుంది. కలలో బల్లి కనిపిస్తే ప్రభుత్వానికి సంబంధించిన భయం పట్టుకుంటుంది. మణికట్టుపై పడితే ఇంటి మరమ్మత్తు లేదా ప్రాజెక్టు విభజన జరుగుతుందని సంకేతం.
చేయి మీద బల్లి పడితే ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. వేళ్ల మీద పడితే పాత మిత్రులు కలుస్తారు. కుడి చేతి మీద పడితే కష్టాలు వస్తాయనే సంకేతం. ఎడమ చేతి మీద పడితే అవమానం జరుగుతుంది. తొడల మీద పడితే దుస్తులు పోగొట్టుకుంటారు. మీసాల మీద పడితే మీరు సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది పెద్దల మాట.
అయితే ఇవన్నీ మూఢ నమ్మకాలని కొందరి వాదనయితే, బల్లి శాస్త్రం తప్పు చెప్పదన్నది మరికొందరి వాదన. శాస్త్రాలను కొట్టిపారేస్తే మిగిలేది వేదనే అన్నది పెద్దల మాట.
– ఎంబిఎస్ గిరిధర్‌రావు