– కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు?
– ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వడం చేతగాని కేసీఆర్
– ఊరూరా బెల్టుషాపులు పెట్టి ఇంటింటికీ మందు తాగిస్తున్నడు
– టీఆర్ఎస్ జెండా పట్టుకున్నోళ్లకు, ఉన్నోళ్లకే దళిత బంధు
– టీఆర్ఎస్ అరాచకాలు ఇంకెన్నాళ్లు భరిద్దాం
– కేసీఆర్ ను గల్లాపట్టి నిలదీయండి
– ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి
– 28వ రోజు ప్రజాసంగ్రామ యత్రలో బండి సంజయ్
‘‘కరోనా వచ్చిన దగ్గర నుండి గత రెండేళ్లుగా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదలకు 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తానంది. ఈ లెక్కన ఒక్కో పేద వ్యక్తికి నెలకు 11 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలి. కానీ కేసీఆర్ కేంద్రం ఇస్తున్న 5 కిలోలో బియ్యాన్ని అమ్ముకుంటూ పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నరు. వ్యవసాయం చేసి నష్టపోతున్న పేద, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వని కేసీఆర్ వందల ఎకరాల భూములున్న అసాములకు రైతు బంధు ఇస్తున్నడు. ఇంకెన్నాళ్లు టీఆర్ఎస్ అరాచకాలను భరిద్దాం. ఇదేం న్యాయమని మీరంతా కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను నిలదీయండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజా సంగ్రామ యాత్ర-2లో భాగంగా 28వ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలోని పాటిగడ గేట్, కోతపేట, సంతాపూర్ గ్రామాల్లో మధ్యాహ్నం వరకు పాదయాత్ర చేశారు. ఆయా గ్రామాల ప్రజలు బండి సంజయ్ కు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపించి, బాణా సంచా పేల్చి, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కొత్తపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ కు తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. తమ ఊరికి రోజుల తరబడి నీళ్లు రావడం లేదని, పావులా వడ్డీకి రుణాలు రావడం లేదని, ఇండ్లు ఇవ్వడం లేదని, పెన్షన్లు లేవని వాపోయారు. ఆయా సమస్యలన్నీ సావధానంగా విన్న బండి సంజయ్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు… అందులోని ముఖ్యాంశాలు….
మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికీ ఫిల్టర్ నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ మాటలన్నీ అబద్దాలే.. ఈ కొత్తపేటలో వారానికి, నెలకోసారి నీళ్లు వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం చేతకాదు కానీ.. ఈ ఊరికి 10 బెల్టుషాపులు పెట్టి తాగండి-ఊగండి అని చెబుతుండు.. ఇంటింటికీ పేపర్ వేసినట్లుగా… క్వార్టర్ బాటిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నడు కానీ నీళ్లు మాత్రం ఇవ్వడం చేతగావడం లేదు..
ప్రగతి భవన్ లో వందల కోట్లు ఖర్చు పెట్టి 100 రూములు కట్టుకున్న కేసీఆర్ పేదలకు మాత్రం ఇండ్లు ఇవ్వడం లేదు.. ప్రధాని మోడీ తెలంగాణకు 1.4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే వాటిని కూడా కట్టివ్వకుండా పేదలకు అన్యాయం చేస్తుండు… మోదీ ప్రభుత్వం 2 ఏళ్ల నుండి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నరు. వచ్చే సెప్టెంబర్ వరకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నరు. కేసీఆర్ ప్రభత్వం 6 కిలోల బియ్యం ఇస్తానంది. అంటే ఒక్కొక్కరికి 11 కిలోల బియ్యం ఇవ్వాలి. కానీ.. 6 కిలోలే ఇస్తున్నడు. మోదీ ఇస్తున్న 5 కిలోల బియ్యం ఏమైనయో కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను గల్లాపట్టి నిలదీయండి…
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతగాని కేసీఆర్ తన ఇంట్లో 5గురికి ఉద్యోగాలిచ్చుకుని నెలకు రూ.25 లక్షల జీతం తీసుకుంటున్నడు..దళితుల 3 ఎకరాల భూమి ఇస్తానని ఇయ్యని మోసగాడు కేసీఆర్… పైగా పేదోళ్ల భూములను గుంజుకుంటున్నరు. పేదల భూముల్లోనే సబ్ స్టేషన్లు, కార్యాలయాలు కడతామని పేదలను ఇబ్బంది పెడుతున్నరు. పేదలకు పట్టా, అసైన్డ్ భూములున్నా ధరణిలోకి ఎక్కనియ్యకుండా వేధిస్తున్నడు…
టీఆర్ఎస్ జెండా మోసెటోడికి, ధనవంతులకే దళిత బంధు ఇస్తున్నరు.వందల ఎకరాల అసామికి రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదు. ఒకపక్క పొలం కౌలుకు తీసుకున్నందుకు భూమి యజమానికి కౌలు డబ్బులిస్తున్నడు. పంట రాకపోతే నష్టపోతున్నడు. అలాంటి వాళ్లకు రైతు బంధుతో ఆదుకోవాలి. కానీ కేసీఆర్ మాత్రం నయా పైసా ఇవ్వడం లేదు. ఇదేం న్యాయం… పేద రైతులను పట్టించుకోకుండా ధనవంతులకు, వందల ఎకరాల అసాములకు రైతు బంధు ఇవ్వడమేంటని నిలదీయండి.
గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక, పల్లె ప్రక్రుతి వనాలు, డంప్ యార్డ్ సహా అన్ని అభివ్రుద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోంది. కానీ వాటిపై మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల ఫొటోలు పెట్టుకోవడం సిగ్గు చేటు.. అందుకే ఈ దుర్మార్గపు కేసీఆర్ పాలన పోవాలి. పేదలకు న్యాయం జరగాలి. ఇప్పటి వరకు మీరంతా అన్ని పార్టీలకూ అవకాశమిచ్చారు. టీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారమిచ్చారు. ఇంకెన్నాళ్లు వాళ్ల అరాచకాలు భరిద్దాం? ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి. బీజేపీకి అధికారంలోకి వస్తే పేదల కోసం పనిచేస్తాం.. మేం సేవ చేస్తేనే మళ్లీ అధికారం ఇవ్వండి.. లేకుండా ఓటేయకండి.