Suryaa.co.in

Andhra Pradesh

బండి సాహితీరెడ్డి ట్రస్ట్ సేవలు స్పూర్తిదాయకం -ఉదాత్తం -అనుసరణీయం

– రెడ్డి హాస్టల్‌లో గ్రంథాలయ భననాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
– సాహితీ రెడ్డి జ్ఞాపకాలు పదిలం: మంత్రి మేరుగు నాగార్జున
– ఈ గ్రంథాలయం అందరిదన్న ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి”

“ఈ సందర్భం స్ఫూర్తిదాయకం. వారి ఆశయం ఉదాత్తం. ఇదీ… సంకుచిత మనస్కుల హృదయాలను సైతం తట్టి మేల్కొలిపే మహత్తర కార్యక్రమం.” అని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తన కుమార్తె బండి సాహితీరెడ్డి, తన తల్లిదండ్రులైన బండి నారాయణరెడ్డి, రంగమ్మ పేరిట బండి అశోక్‌రెడ్డి దంపతులు నగరంపాలెంలోని రెడ్డి బాలుర హాస్టల్‌లో నిర్మించిన రెండు అంతస్థుల గ్రంధాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి పై విధంగా వ్యాఖ్యానించారు.

శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తమ కుమార్తె మృతి చెందిందని కుంగిపోకుండా బండి అశోక్‌రెడ్డి దంపతులు ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమని ప్రత్యేకంగా అభినందించారు. సాహితీరెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె స్మృతులు సజీవంగా ఉంచేందుకు వారు చేస్తున్న కృషి స్పూర్తిదాయకమన్నారు. అది కూడా సమాజానికి ఉపయోగపడే రీతిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమే కాక అనుసరణీయమని తెలిపారు. సమాజ హితం కోరే విధంగా గ్రంథాలయం నిర్మించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. క్షణం తీరిక లేని ఉరుకుల పరుగుల జీవనంలో సహజంగానే మర్చిపోతున్న మానవతా విలువలను గుర్తు చేసే ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలన్ళ ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

ఇక ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు చక్కని వేదికగా నిలిచిన యస్.వి.ఎన్.ఆర్ రెడ్డి బాలుర హాస్టల్ నిర్వాహకులను సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. కులమతాలకు అతీతంగా ఇక్కడ అర్హులైన పేద విద్యార్థులందరికీ ఆశ్రయం కల్పిస్తున్న వారి విశాల హృదయం చాలా గొప్పదన్నారు. మన తరమే కాక మన తర్వాతి తరం కూడ బాగుండాలని నిస్వార్ధంగా కాంక్షించే వారే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతారన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఉడుముల నర్సిరెడ్డి జన్మ ధన్యమనీ… బండి సాహితీరెడ్డి స్మృతి పదిలమనీ… సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు.

మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున మాట్లాడుతూ, చదువుకునేందుకు ఏమాత్రం అవకాశం లేని విద్యార్థులకు కులాలతో సంబంధం లేకుండా ఆశ్రయమిచ్చిన ఘనమైన చరిత్ర రెడ్డి హాస్టల్ సొంతమని తెలిపారు. ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చి మరెందరో ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఆలవాలంగా నిలిచిందన్నారు. అంతే కాకుండా రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించిన చరిత్ర కూడా దీనికి ఉందన్నారు.

అలాంటి చోట గ్రంథాలయం నిర్మించిన బండి అశోక్‌రెడ్డి దంపతులను ఆయన అభినందించారు. తద్వారా వారి కుమార్తె బండి సాహితీరెడ్డి జ్ఞాపకాలను వారు మరింత పదిలపరిచారని పేర్కొన్నారు. గతంలో ఎలాగైతే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారో అలాగే మళ్ళీ అండదండలు అందించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతున్న ప్రతిపక్షాల కుయుక్తులను తిప్పికొట్టాలని మంత్రి నాగార్జున కోరారు.

శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల స్వారాజ్యంలో కూడా అక్షరాశ్యతా శాతంలో గల వెనుకబాటుతనాన్ని సవ్యంగా గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే విప్లవాత్మకమైన సంస్కరణలతో విద్యా వ్యవస్థను ఆయన గాడిలో పెట్టారని తెలిపారు. అదే విధంగా బండి అశోక్‌రెడ్డి దంపతులు కూడా సీఎం ఆలోచనా ధోరణికి అనుగుణంగా తమ కుమార్తె బండి సాహితీరెడ్డి పేరిట విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

బండి సాహితీరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం, అవసరమైన పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించడం వంటి ఉదాత్తమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాక కరోనా వంటి కల్లోల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. విద్యా విజ్ఞాన వ్యాప్తిలో భాగంగానే రెడ్డి హాస్టల్‌లో నూతనంగా గ్రంథాలయ భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. రెడ్డి హాస్టల్‌లో నిర్మించారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకే అక్కడ చదువుకునే అవకాశం ఉంటుందేమో అనే అనుమానాలకు అసలు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకోవచ్చని లేళ్ళ అప్పిరెడ్డి అందరికీ ఆహ్వానం పలికారు.

చివరగా సమాజ హితాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బండి అశోక్‌రెడ్డి దంపతులను సజ్జల రామకృష్ణారెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాళి గిరి, ఏఎంసీ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, మద్య విమోచన కమిటీ ఛైర్మన్ వి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ సాహితీవేత్త మోదుగుల పాపిరెడ్డి, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బత్తుల దేవానంద్‌, డిప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు, షేక్ సజీల‌, స్థానిక కార్పొరేటర్ రాజేష్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, చల్లా అంజిరెడ్డి, సంజీవరెడ్డి, సురసాని వెంకటరెడ్డి, ఏరువ సాంబిరెడ్డి, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, తనుబుద్ది కృష్ణారెడ్డి, అచ్చాల వెంకటరెడ్డి, యక్కల మారుతీ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE