– సమస్యల వలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు
– ఇల్లు లేక కొందరు…బతుకు భారమై మరికొందరు..తిండిలేక ఇంకొందరు….
– గ్రామస్తుల, తండావాసుల కష్టాలు విని చలించి పోయిన బండి సంజయ్ కుమార్
– నేనున్నా….మీకు అండగా ఉంటానంటూ అభయం
– 20వ రోజు పాదయాత్రతో మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు తో కలిసి సంజయ్ పాదయాత్ర
‘‘సారూ….నాకు భర్త లేడు, పిల్లల్లేరు. ఇల్లు లేదు. ఫించన్ లేదు. పొలం లేదు. కూలీనాలీ చేసుకోనే వయసు లేదు. నేనెట్ల బతకాలి? నన్నెవరు ఆదుకుంటరు. ఫించన్ కోసం అందరి కాళ్లు పట్టుకున్నా ఒక్కరూ కనికరించలేదు. మీరే ఏదైనా దారి చూపాలి సార్…’’ తాండూరులో దుర్గమ్మ ఓ వృద్ధురాలి బండి సంజయ్ ఎదుట బోరున విలపించింది.
‘‘అన్నా…పుస్తెలమ్మి (మెడలో పసుపు తాడును చూపిస్తూ..) పిల్లలను చదివిస్తున్నా. ఇల్లు లేదు, పొలం లేదు. ఏ అసరా లేదు. కూలీనాలీ చేసుకుని నలుగురు పిల్లలను చదివిస్తున్నా. ఇల్లు ఇస్తమని, సాయం చేస్తమని చెబితే కేసీఆర్ కు ఓట్లేసినం. ఒక్క సాయం కూడా చేయలే. మోసపోయినం అన్నా…మీరే ఆదుకోవాలి’’ ధర్మారెడ్డి గ్రామంలో ఓ మహిళ బండి సంజయ్ ఎదుట విలపిస్తూ చెప్పిన మాటలివి.
‘‘సార్…ఐదు తరగతులకు ఒకటే గది. ఒకరే టీచర్ ఫ్యాన్ లేదు. వానొస్తే కురుస్తుంది. చుట్టూ ప్రహారీ గోడ లేదు. పాములు, పురుగులు వస్తున్నయ్. ఎప్పుడేమవుతదో తెల్వని బతుకులు. చిన్న పిల్లలు సార్…వాళ్లకేమన్నా అయితే మేం బతకలేం’’ రాఘవపల్లి తండా స్థానికులు ప్రభుత్వ పాఠశాలను చూపిస్తూ బండి సంజయ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డిపేట నియోజకవర్గంలో 20వ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు ఎదురైన అనుభవాలివి. ఎవరిని కదిలించినా పుట్టెడు కష్టాలు, కన్నీళ్లే స్వాగతమిస్తున్నాయి. ఇల్లు లేదని కొందరు….బతకడం భారమైందని ఇంకొందరు…. తాగడానికి నీళ్లు లేవని, కరెంటు సౌకర్యం లేదని, కనీస సౌకర్యాలకూ నోచుకోలేదని మరికొందరు….ఇలా ఎక్కడికెళ్లినా ప్రజలు పడుతున్న బాధలు కళ్లకుకడుతున్నాయి. ఏ ఊరెళ్లినా, ఏ తండా వెళ్లినా గ్రామస్తులు బండి సంజయ్ ను కలిసి తమ ఇళ్లలోకి తీసుకెళ్లి తమ కష్టాలను, ఇల్లు లేక పడుతున్న బాధలను చెబుతూ కంట తడి పెట్టడం కదిలించింది.
ఉదయం బంజారా తండా నుండి మొదలైన పాదయాత్ర దారి పొడవునా కలిసిన జనం బండి సంజయ్ ను కలిసి తమ బాధలను వెళ్లబోసుకున్నారు. గ్రామస్థుల కోరిక మేరకు దారి పక్కన ఉన్న గ్రామాల్లోకి వెళ్లి ఆ ఊరు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత బంజారా తండాలో సేవాలాల్ మహారాజ్ గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించి పూజారుల ఆశీస్సులు తీసుకున్న బండి సంజయ్ దారిలో వెళుతూ పశువులు కాసుకునే మహిళ వద్దకు వెళ్లారు. తనకు ఇల్లు లేదు. ఆస్తిపాస్తుల్లేవు. బతికేదెట్లా అని బోరున విలపించడంతో చలించిన బండి సంజయ్ బీజేపీ అండగా ఉంటుందని ఓదార్చారు. అవసరమైన సాయం చేస్తామని హామీ ఇస్తూ ముందుకు కదిలారు.
అక్కడి నుండి తాండూర్ గ్రామంలోకి ప్రవేశించగానే దుర్గమ్మ అనే వ్రుద్దురాలు ఎదురైంది. తనకెవరూ లేరని, ఫించన్ కూడా రావడం లేదని ఆదుకోవాలని వేడుకుంది. తాను సాయం చేస్తానని వ్రుద్దురాలిని ఓదార్చిన బండి సంజయ్ గ్రామస్తులు చెప్పిన సమస్యలన్నీ విన్నారు. పోడు భూముల సమస్య ప్రధానంగా చర్చించారు. ఆ అంశంపై పోరాడుతున్నట్లు చెప్పారు.
అనంతరం కన్నారెడ్డి వెళ్లిన బండి సంజయ్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ‘‘సార్…25 మంది పిల్లలున్నరు. శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. గతంలో ఒకసారి కొత్త బిల్డింగ్ కట్టినా నాణ్యత లేకపోవడంతో కూలిపోయింది. ఇనుప చీకు కుచ్చుకుని పిల్లవాడు చనిపోయిండు. ఎప్పుడేమవుతోందో భయం వేస్తుంది. మధ్యాహ్న భోజనానికి ముక్కిన బియ్యంతో అన్నం వండి పెడుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత’’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చలించిన బండి సంజయ్ ఎట్ట పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ లో పిల్లలను ఉంచకుండి. వేరే బిల్డింగ్ లోకి మార్చండి. ఈ విషయంలో నావంతు సాయం చేస్తా. అని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. దారిలో పేరుపల్లి సాల నర్సింహులు అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. మొరం పోయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. బండి సంజయ్ వెంటనే మొరం పోయించాలని స్థానిక నేతలను ఆదేశించారు.
దారిలో రాఘవపల్లి తండా వాసులు ఎదురొచ్చారు. తమ తండాలో అన్నీ సమస్యలేనని, కరెంటు, నీళ్లు, ఇండ్లు కూడా లేక బిక్కుబిక్కుమంటున్నామని పేర్కొంటూ తండాకు తీసుకెళ్లి చూపించారు. అక్కడే ఉన్న పాఠశాలను సందర్శించిన బండి సంజయ్ కు ఐదు తరగతులకు ఒకే గది ఉండటాన్ని గమనించారు. ఫ్యాన్లు, కుర్చీలు, ప్రహారీగోడ లేని విషయాన్ని గ్రామస్తులు వివరించారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ పాఠశాలకు వెంటనే కుర్చీలు, ఫ్యాన్లు పంపిస్తానని హామీ ఇచ్చారు. కనీస సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని భరోసా ఇచ్చారు. అదే సమయంలో నాగలక్ష్మీ అనే మహిళ తన కూతురుని తీసుకొచ్చి ‘తన బిడ్డకు మాటలు రావట్లేదని, ఆరోగ్యం కూడా బాగోలేదని ఆసుపత్రికి పోయినా పట్టించుకోవడం లేదని, బతకడమే కష్టమైన మాకు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదని కన్నీటి పర్యంతమయ్యారు. చలించిన బండి సంజయ్ వెంటనే ఆ పాపకు అవసరమైన పరీక్షలు చేయించి మెరుగైన చికిత్స అందించాలంటూ అక్కడున్న డాక్టర్లకు సూచించారు.
ఆ వెంటనే పక్కన ఉన్న తండాలోకి వెళ్లి అక్కడున్న వ్రుద్దులు, మహిళలు, స్థానికులతో మాట్లాడారు. ఇల్లు లేదని, పనుల్లేవని బతకడమే కష్టమైందని అక్కడున్న వారంతా భోరున విలపించారు. నేనున్నా..మీరేం భయపడకండి. మీకు అవసరమైన సాయం అందేలా క్రుషి చేస్తా’నని భరోసా ఇచ్చారు. వెంటనే అక్కడున్న వాళ్లంతా తమ ప్రేమకు గుర్తుకు సేవాలాల్ బోనాలను బండి సంజయ్ కు అందజేశారు. బోనాలను నెత్తిన పెట్టుకున్న బండి సంజయ్ మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ముందుకు కదిలారు. అప్పటికే సమయం సాయంత్రం 4 గంటలు కావడంతో అక్కడి నుండి వెల్లకుంట తండా వద్ద ఏర్పాటు చేసిన లంచ్ హాల్డ్ వద్ద మధ్యాహ్న భోజనం చేశారు. కొద్దిసేపటి తరువాత మళ్లీ సాయంత్రం 5 గంటలకే పాదయాత్ర ప్రారంభించిన బండి సంజయ్ కు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ చేత జెండా ఎగరేయించారు. తమ గ్రామాల్లోకి, తండాల్లోకి సంజయ్ రావడంతో యువత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పూల వర్షం కురిపిస్తూ, డ్యాన్సులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
బండి సంజయ్ తో పాటు పాదయాత్ర చేసిన వారు : జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు, కర్నాటక రాష్ట్రం కోలార్ ఎంపీ మునుస్వామి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ, బీసీ, మహిళా మెర్చాల అధ్యక్షులు కొప్పు భాష, ఆలె భాస్కర్, గీతామూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, కార్యదర్శులు ఉమారాణి, జయశ్రీ, మహిళా మోర్చా నాయకురాలు సుధా, జిల్లా అధ్యక్షురాలు అరుణతార, జిల్లా ఇంఛార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పైలా కృష్ణారెడ్డి, బాణాల లక్ష్హారెడ్డి తదితరులు పాల్గొన్నారు.