– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
” కేసీఆర్… ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ ను అడ్దుపెట్టుకుని రాజకీయాలు చేస్తావ్? నిరుద్యోగుల కష్టాలు నీకు పట్టవు. ఉద్యోగుల బాధలు నీకు అక్కర్లేదు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల అరిగోస నీకు పట్టదు. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని తరిమికొట్టేందుకు మహిళలు చేస్తున్న పోరాటం నీ కంటికి అసలే కనిపించదు. నీకు కావాల్సిందల్లా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమే.. ఇందుకోసమేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది? ” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి టౌన్ కు చెందిన పెంటి రాజమౌళి ,పెంటి శ్రీనివాస్ సహా దాదాపు100 మంది నాయకుల ఈరోజు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి టౌన్ అధ్యక్షుడు కంచే శేఖర్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ1400 మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాబందుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మతో బలుపెక్కి మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగ రాస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని మండి పడ్డారు. శాశ్వతంగా తన కుటుంబమే రాజ్యమేలేలా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలనుకుంటున్నారని అన్నారు.
“కేసీఆర్….. ఇది రాచరికం కాదు. నిజాం నవాబు లా పాలించడానికి…. చైనాలో జిన్ పింగ్, రష్యాలో పుతిన్ మాదిరిగా అధికార కాంక్షతో మదమెక్కి కొట్టుకుంటున్నావ్. నీ పాలన అంతమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఉసురు నీకు తగలక మానదు. కర్షకుల కన్నీళ్లే సుడిగుండాలయి నిన్ను ముంచే రోజులు రాబోతున్నాయి…. నివురుగప్పిన నిరుద్యోగులు కురిపించే ఆగ్రహ జ్వాలకు మాడి మసై పోవడం ఖాయం…. మహిళల కోపాగ్ని నిన్ను దహించే రోజులు సమీపంలోనే వున్నాయి.” అని మండిపడ్డారు.
సామాన్య ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన కేసీఆర్ చివరకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లతో ఎములాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానంటూ దేవుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్ పాపాలు పం డాయన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా…. మరెంతమంది పీకేలను పెట్టుకున్నా కేసీఆర్ ను కాపాడలేరని అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రజాలిచ్చే తీర్పు తో కొట్టుకుపోవడం ఖాయం.” అని ఉద్ఘాటించారు.