Suryaa.co.in

Telangana

మోదీని ఎదుర్కొనే ముఖం లేక కేసీఆర్ గైర్హాజరు

-మీకు నిజాయితీ ఉంటే… ఇవే అంశాలు నీతి అయోగ్ మీటింగ్ లో చెప్పాలి
-నీతి అయోగ్ గొప్పదని వేనోళ్ల పొగిడింది మీరే కదా?
-మీ ఏడుపంతా కేంద్రం నేరుగా స్థానిక సంస్థలకు నిధులిస్తున్నందుకే
– గతేడాది రూ.5 వేల కోట్ల కంటే ఎక్కువ నిధులిచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా?
-అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మీరు బెల్ కొట్టిస్తే ఒప్పు… నీతి అయోగ్ లో బెల్ కొట్టిస్తే మాత్రం తప్పా?
-కేసీఆర్… మీకు పాలన చేతగావడం లేదు… సర్కారీ స్కూళ్లలకు వెళ్లి క్లాసులైనా చెప్పుకోండి
-మిమ్ముల్ని ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

మోదీ ని ఎదుర్కొనే ముఖం లేఖ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నీతి అయోగ్ మీటింగ్ ను ఎగ్గొట్టి దానికి వేరే వేరే కారణాలు చెబుతుండటం హాస్యాస్పదం. మీకు నిజాయితీ ఉంటే… రేపు ఇవే అంశాలను నీతి అయోగ్ సమావేశంలోనే మాట్లాడవచ్చు కదా…? మీ 8 ఏళ్ల పాలనలో ఎనాడూ అధికారిక మీటింగులకు వెళ్లేందుకు ఆసక్తి చూపని మాట వాస్తవం కాదా? కేవలం మీ రాజకీయ లబ్ది కోసం, రాజకీయ పార్టీలతో సమావేశాల కోసం… ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసం ఢిల్లీ పోవడం తప్ప ప్రజల కోసం ఏనాడైనా చర్చించడానికి వెళ్లారా?

నీతి అయోగ్ అద్బుతం అని వేనోళ్ల పొగిడింది మీరు కాదా కేసీఆర్… మీరు కోరినంత డబ్బులిస్తే నీతి అయోగ్ మంచిది… లేకుంటే మంచిది కాదా? ఇదనే మీ రాజనీతి? మీకు నచ్చినట్లుగా, మీ పక్షాన లేదని నీతి అయోగ్ లాంటి గొప్ప సంస్థను నిందించడం ప్రజా స్వామ్య వ్యవస్థలను అవమానించడమే.
నరేంద్రమోదీ ప్రభుత్వం లబ్దిదారులకే నేరుగా నగదును బదిలీ (డీబీటీ) చేస్తుండటంతో ప్రజలకు ఫలితాలు అందుతున్నయి. దీనిపై మీ పెత్తనం పోతుందని, కమీషన్లు అందడం లేదనే అక్కసుతోనే మీరు నీతి అయోగ్ పై ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే కరోనా సమయంలో మీరు హెలికాప్టర్ మనీ (నేరుగా రాష్ట్రాలకు నిధులు) పంపాలని కోరిన మాట వాస్తవం కాదా?

ఎన్నికల కోసం, ఓట్ల కోసం అనుచితమైన ఉచితాలిస్తూ ఆర్దిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం వల్ల శ్రీలంక వంటి పరిస్థితి వస్తుందని, రాష్ట్రాల ఆర్దిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో, కేంద్రానికి ఏం సంబంధం? సుప్రీం సూచనను కేంద్రానికి అంట గట్టడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనం.

ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేసిన నియంత కేసీఆర్… కేంద్రం మీద ధర్నాలు చేసి ఏదో సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదం. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధానాల్లో కేంద్ర, రాష్ట్రాలకు అవసరమైన వ్యూహాత్మకమైన సాంకేతిక సలహాలను నీతి అయోగ్ అందిస్తోంది… అంతేగానీ కేసీఆర్ కోసం ప్రత్యేకంగా పనిచేయదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.

కేంద్రం నేరుగా స్థానిక సంస్థలకు నిధులిస్తుందనే కేసీఆర్ ఏడుపు. ఇన్నాళ్లూ కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ… కేంద్ర పథకాలకు పేర్లు మార్చుకుంటూ గడిపిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాలకు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని బదనాం చేసి… ఇప్పుడు మాకు వెసులుబాటు కోసం డైరెక్టుగా నిధులిస్తలేదని లొల్లి పెట్టడం వెనుక కేసీఆర్ స్వార్ధం కన్పిస్తోంది. గత ఏడాది కేంద్రం రూ. 5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని చెబుతున్న కేసీఆర్… 5 రోజులు ఢిల్లీలో ఉండి కేంద్రాన్ని బెదిరించి 10 వేలు కోట్లు అప్పు సాధించానని చెబుతున్నారు.. మరి కేంద్రం నిజంగా డబ్బులివ్వకపోతే ఏడాది నుండి ఏం చేసినట్లు?

గత ఏడాది కేంద్రం 5 వేల కోట్ల కంటే ఇచ్చినట్లు రుజువు చేస్తే అసెంబ్లీ ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఇన్నాళ్లు నరేంద్ర మోదీని తిట్టుడు, బీజేపీని తిట్టుడు, బండి సంజయ్ ను తిట్టుడుతోనే కేసీఆర్ కు సరిపోయింది… ఇగ నీతి అయోగ్ ను తిట్టడం మొదలైంది… నీతి అయోగ్ ను నిన్నటిదాకా పొగిడిన కేసీఆర్ కు నేడు ఆ సంస్థ చేదైంది. ప్లానింగ్ కమిషన్ చరిత్ర, కో ఆఫరేటివ్ ఫెడరలిజం, ప్రజాస్వామ్య స్పూర్తి గురించి పాఠాలు చెబుతున్నరే తప్ప సీఎం నౌకరీ మాత్రం చేయడం లేదు.. తెలంగాణలోని ఊళ్లల్లో పంతుల్లేరు.. పోయి క్లాసులైనా చెప్పుకుంటే మంచిది. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే… స్పీకర్ తో బెల్ కొట్టిస్తున్న కేసీఆర్… నీతి అయోగ్ మీటింగ్ ల మాత్రం బెల్ కొడుతున్నరని అపహాస్యం చేయడం హాస్యాస్పదం.

దేశంలో కంపెనీల ఎన్పీఏల గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ లో ఎందుకు వేల పరిశ్రమలు మూతపడ్డాయో కేసీఆర్ సమాధానం చెప్పాలి.బతుకమ్మ చీరలు కూడా హైదరాబాద్ లో తయారు చేయించడం చేతగాక సూరత్ కేసీఆర్ దిగుమతి చేసుకునే నువ్వు ఇతర దేశాల దిగుమతి గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ముందు ప్రగతి భవన్ ఫర్నీచర్ ను చైనా నుండి ఎందుకు తెప్పించుకున్నరో సమాధానం చెప్పాలి?

రైతు చట్టాలను విమర్శిస్తున్న కేసీఆర్… ఆనాడు రైతు చట్టాలను సమర్ధించిన మాట వాస్తవం కాదా? ఏనాడైనా రైతుల తరపున ఉద్యమించినవా?దేశంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న మీరు… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంగతేంది? కేంద్రం మీటర్లు పెట్టమని చెప్పిందా?రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, ఇంటర్ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆత్మహత్మలకు కారకుడైన నువ్వు హంతకుడివి.. కేంద్రాన్ని విమర్శించడం సిగ్గు చేటు.. కేసీఆర్… మీ ఇష్టమొచ్చినట్లు అన్నీ బహిష్కరిస్తున్నరు… తెలంగాణ ప్రజలు మిమ్ముల్ని బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్…

LEAVE A RESPONSE