– సమతా మూర్తి విగ్రహావిష్కరణకు రావొద్దని పీఎంఓ నుంచి ఫోన్ చేశారన్నది పచ్చి అబద్దం
– అనారోగ్యం వల్ల వెళ్లలేదని ప్రకటన చేసింది కేసీఆరే
– ప్రధానిని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– ఆనాడు మోదీని కలవడానికి ముఖం చెల్లకే వెళ్లని కేసీఆర్
– నీచ రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదు
– సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వార్నింగ్
సమతా మూర్తి విగ్రహావిష్కరణకు రావొద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి సీఎం కేసీఆర్ కు ఫోన్ వచ్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈరోజు ఆంగ్ల ఛానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తండ్రీ కొడుకుల పచ్చి అబద్దాలుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయాన్ని, నరేంద్రమోదీని అవమానించేలా తండ్రీ కొడుకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు మక్తల్ నియోజకవర్గం పగిడిమర్రి గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు.
‘‘ తండ్రీకొడుకుల పచ్చి అబద్దాలకు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూనే నిదర్శనం. ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహావిష్కరణకు సీఎం రావొద్దని పీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్దం. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీని అవమానించేలా అబద్దాలు మాట్లాడటం సిగ్గు చేటు. తెలంగాణను
అవమానించేది.. ప్రజలను అవమానపర్చేది కేసీఆరే. అనారోగ్య కారణాల వల్లే సీఎం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావొట్లేదని ప్రకటించింది కేసీఆరే. నరేంద్రమోదీని కలవడానికి ముఖం చెల్లకే ఆనాడు సమతామూర్తి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రాలేదన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా ఈరోజు తండ్రీ కొడుకులు ప్రధానిపైన, పీఎంఓపైన పచ్చి అబద్దాలు వల్లించడం నీచాతినీచం’’అని ధ్వజమెత్తారు.
‘‘దేశ ప్రధాని అందరికీ విలువ ఇఛ్చే వ్యక్తి అని, గతంలో అనేకసార్లు ప్రధానిని కేసీఆర్ కలిశారు. కానీ ఏనాడూ కేసీఆర్ ఇతర పార్టీల నేతలకు, ప్రజలకు అపాయిట్ మెంట్ ఇవ్వకుండా ఫాంహౌజ్ నుండి పాలన చేస్తున్నరు. అలాంటి నేతలు ప్రధానిని అవమానించేలా మాట్లాడటం క్షమించరాని విషయం’’’ అని మండిపడ్డారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసి నెలలు గడుస్తున్నా నోరు మెదపని కేసీఆర్, కేటీఆర్ లు ఇన్ని రోజుల తరువాత మాట్లాడటం నీచమైన రాజకీయాలకు పరాకాష్ట అని అభివర్ణించారు.
ప్రధానమంత్రి వచ్చి వెళ్లిన తర్వాతైనా కేసీఆర్ రామానుజాచార్యుల వారి విగ్రహ సందర్శనకు వెళ్లాల్సి ఉండేదిగా..మరి ఎందుకు పోలేదు..? అని ప్రశ్నించారు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తూ, ప్రజలను మోసం చేస్తూ కుర్చీ కాపాడుకుంటున్న దౌర్భాగ్య సీఎం కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘కేసీఆర్ చరిత్ర, ఆయన కుటుంబ చరిత్రంతా అవినీతిమయమే.. రాజకీయాలకు అతీతంగా చిన్నజీయర్ స్వామివారు రామానుజస్వామి వారి విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమతామూర్తి ప్రతిష్ట
మహోన్నతమైనది.. అందుకే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. కానీ ఈ సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించి, తానే ప్రతిష్ట చేసినట్లు కేసీఆర్ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నాలు చేసిండు’’ అని పేర్కొన్నారు.