Suryaa.co.in

Telangana

కోరితెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఇవేం స్కూళ్లు?

– బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం

కోరి…..కొట్లాడి తెచ్చుకున్న ….బంగారు తెలంగాణలో … ఈ 8సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పాఠశాలల్లో మౌలిక అభివృద్ధి కోసం ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వమే 75శాతం నిధులను కేటాయిస్తోంది. మన ఊరు` మన బడి కార్యక్రమానికి ఖర్చుచేస్తున్న 3497 కోట్ల రూపాయల్లో కేంద్రప్రభుత్వం కేటాయించిన వాటా 2700 కోట్ల రూపాయలు. కేంద్రప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయల నిధుల కేటాయిస్తున్నా సోకు, ప్రచార ఆర్భాటాలు మాత్రం రాష్ట్రప్రభుత్వం చేసుకుంటోంది.

‘మన ఊరు మన బడి’ తో పాఠశాలల మరమ్మత్తులు గానీ, నవీకరణ గానీ మొదలు పెట్టింది లేదు. పాఠశాల లకు ఒక్క రూపాయి ఖర్చు చేసింది లేదు. బంగారు తెలంగాణలో పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన లేదు. పేదవిద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో లేవు. పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన యూనిఫాంలు ఇవ్వటం లేదు. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు స్కావెంజర్‌ లు లేరు. ప్రభుత్వ హైస్కూల్‌లలో అటెండర్‌/ జూ. అసిస్టెంట్‌ లు లేరు. సాంఫీుకసంక్షేమ వసతి గృహాల్లో వంట చేసే వారు లేరు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల లలో సబ్జెక్టు నిపుణుల కొరత తీవ్రంగా ఉంది.

రాష్ట్రంలో 90% జిల్లాలకు జిల్లా విద్యా శాఖ అధికారులు డిఇఓలు లేరు. 95% మండలాల్లో ఎంఈఓలు లేరు. ప్రభుత్వ హైస్కూల్‌ ల లో 40% ప్రధానోపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. 317 జీవో బాధితులను పట్టించుకున్నది లేదు, 13 జిల్లాలో స్పౌజ్‌ బదిలీల ఊసే లేదు, 402 జీవోను కాపాడే సోయి లేదు, 21 జీవో ప్రకారమైనా మూచువల్‌ బదిలీలు జరుపతారో లేదో తెలియదు. ఉపాధ్యాయుల జీతాలు సమయానికి వస్తాయో రావో తెలియదు. ఉపాధ్యాయుల జీవితంలో ఎన్నడూ ఇంత మానసిక క్షోభ అనుభవించిన దాఖలాలు గతంలో లేవు.

రాష్ట్రంలో జూన్‌ 13 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రయివేట్‌ స్కూళ్లు, మైనార్టీ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ పేదలపైన ఆర్థికభారాన్ని మోపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయివేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టానుసారం పెంచుతున్న ఫీజుల కారణంగా పేదవాడికి విద్య దూరం అవుతోంది. పెరుగుతున్న ఫీజుల కారణంగా పేదవారు అప్పులపాలై పోతున్నారు.

బిజెపి అనుబంధ సంఘాలు బిజెవైఎం తదితర సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని అనేక ప్రయివేటు స్కూళ్లు, యాజమాన్యాలు 20 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచారు. ప్రయివేటు స్కూళ్లు, యాజమాన్యాలు పెంచుతున్నా ఫీజులపై ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు ఎటువంటి అజమాయిషీ లేకుండా పోయింది. విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాల నుంచి లక్షల రూపాయలు ముడుపులు స్వీకరించి నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రయివేటు స్కూళ్లు, యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని బిజెపి తెలంగాణశాఖ తరుపున డిమాండ్‌ చేస్తున్నాం.

ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ఈ సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌రావుగారు అధ్యక్షతన జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో నిర్ణయించి, దానికి అనుగుణంగా ప్రత్యేకంగా 14 మందితో గ్రూపు ఆఫ్‌ మినిస్టర్స్‌ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ మార్చి లో సమావేశమై గతంలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటి చేసిన సిఫార్సుల ప్రకారం ప్రతీ సంవత్సరం 10 శాతం ఫీజులు పెంచుకోవచ్చనే ప్రతిపాదనను ఆమోదించినట్లు వార్తలు బయటకొచ్చాయి.
ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటి సిఫార్సులను రాష్ట్రప్రభుత్వం ఆమోదించిందా? లేదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రొ.తిరుపతిరావు కమిటి సిఫారసులను బయటపెట్టి, ఆ సిఫారసులపైన తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలతో, విద్యారంగంలో నిపుణులతో చర్చించాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున డిమాండ్‌ చేస్తున్నాం.

ఫీజుల నియంత్రణ చట్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం 20 నుంచి 40 శాతం ఫీజులు పెంచి పేదల ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఈ విధంగా వసూలు చేస్తున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దుచేయాలని బిజెపి తెలంగాణ శాఖ తరపున కోరుతున్నాం.

ప్రయివేటు విద్యాసంస్థలు నిబంధనలకు వ్యతిరేకంగా అధికఫీజులు వసూలు చేయడమే కాకుండా స్కూల్‌ బుక్స్‌, డ్రెస్‌లు, బూట్లు, బ్యాగ్‌లు తమవద్ద లేదా తాము సిఫారసు చేసిన సంస్థలు, దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ కొనుగోళ్లల్లో కూడా స్కూల్‌ యాజమాన్యాలకు, వ్యాపారస్థులకు మధ్య వాటాలున్నాయి. ఇటువంటి స్కూలు యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.

ప్రభుత్వం వెంటనే ఫీజులను నియంత్రణ చట్టాన్ని తీసుకుని రావాలి, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్‌ స్కూళ్లపై, మైనార్టీ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, తల్లిదండ్రులు, విద్యారంగంలోని ప్రముఖులతో రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిల్లో అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా విద్యాసంస్థలను తనిఖీలు చేయించాలి వారి సిఫారసులకనుగుణంగా ఫీజులను నిర్ణయించాలి ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలతో ముడుపులు స్వీకరించి వారికి వత్తాసు పలుకుతున్న విద్యాసంస్థ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులపై కఠినంగా వ్యవహరించాలి, ప్రభుత్వం తరుపున ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ ను, ఈమెయిల్‌ ఐడిని ఏర్పాటు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూలు యాజమాన్యాల బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించాలి, గత సంవత్సరం పేదవిద్యార్థులకు స్కూల్‌యూనిఫామ్‌లు ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం నాలుగు జతల స్కూల్‌యూనిఫామ్‌లను ఇవ్వాలి, రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా వున్న 20 వేల టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ విషయాలన్నింటిపై సత్వర చర్యలు చేపట్టాలని, బిజెపి తెలంగాణ శాఖ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.

LEAVE A RESPONSE