-కరీంనగర్‌లో కేసీఆర్, వినోద్ రికార్డులు బద్దలు
-2.25 లక్షల పైచిలుకు ఓట్లతో విజయకేతనం
-45 శాతం ఓట్లు సాధించిన సంజయ్
-రెండో స్థానం కోసమే పోటీపడ్డ కాంగ్రెస్, బీఆర్‌ఎస్
-కాంగ్రెస్‌కు 27.4, బీఆర్‌ఎస్‌కు 21.4 శాతం ఓట్లు
-అఖండ విజయంతో కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్తల తీన్మార్
-బండి విజయంతో సంబరాల్లో మునిగితేలిన కార్యకర్తలు
-భుజాలపైకి ఎత్తుకుని ఆనందాన్ని పంచుకుంటున్న శ్రేణులు
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి ప్రభంజనం సృష్టించారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించి టాప్ గేర్‌లో నిలిచారు. మొత్తం 13 లక్షల 3 వేలకుపైగా ఓట్లు పోలవగా, అందులో 45 శాతం ఓట్లు సాధించడం గమనార్హం. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులందరి కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించడం విశేషం. 2006 ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు 2,01,581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్‌కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఇవే అత్యధిక ఓట్లు.
తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డులను బద్దలు కొట్టి కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా 2,25,209 ఓట్లు సాధించి కరీంనగర్ ఆల్ టైం రికార్డును కైవసం చేసుకున్నారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు 89,508 ఓట్ల మెజారిటీ కట్టబెట్టిన ప్రజలు అంతకు మూడు రెట్లు ఓట్లు కట్టబెట్టి తమ అభిమానాన్ని చాటుకు న్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17,97,150 మంది ఓటర్లుండగా… 13,03,690 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ సహా తొలి రౌండ్ నుండే బండి సంజయ్ ఆధిక్యత కనబర్చారు.
మొత్తం 24 రౌండ్లకు 22 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తొలుత వెనుకబడినప్పటికీ క్రమేపి మెజారిటీ సాధిస్తూ వచ్చారు. ఇక చివరి దాకా రెండో స్థానం కోసమే నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పోటీ పడటం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ 27.41 శాతం ఓట్లు(3,59,907 ఓట్లు) సాధించి రెండో స్థానంలో నిలిచారు.
బీఆర్‌ఎస్ అభ్యర్ధి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ 21.49 శాతం ఓట్లతోనే (2,82163 ఓట్లు) సరిపెట్టుకోవడం విశేషం. వాస్తవానికి ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేశాయి. అయినప్పటికీ బండి సంజయ్ విజయాన్ని ఏ మాత్రం అడ్డుకోలేకపోయాయి. మరోవైపు వేలాది మంది కార్యకర్తలు కరీంనగర్ వీధుల్లోకి తరలివచ్చి సంబురాలు చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ వద్దకు తరలివచ్చిన కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ తీన్మార్ డ్యాన్సులు వేస్తూ… బండి సంజయ్‌కు ఘనస్వాగతం పలికారు. భుజాలపైకి ఎత్తుకుని చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కరీంనగర్-జగిత్యాల రోడ్డు కిక్కిరిసిపోయింది.