– కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి
– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్
కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు నిస్సిగ్గుగా కుంటిసాకులు చెబుతూ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నాననడం అవకాశవాదానికి నిదర్శనమని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు కల్పించి గుర్తింపునిస్తే.. నమ్మకద్రోహానికి వారసుడిగా తయారై, స్వార్థపూరిత,వ్యక్తిగత లాభాపేక్షతో పార్టీ ఫిరాయిస్తున్నాడని దుయ్యబట్టారు.
కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని కన్నకొడుకుల్లా ఆదరించాల్సిందిపోయి.. దొంగ కొడుకుల్లా తయారై పార్టీని నట్టేట ముంచుతుంటే.. చీకట్లో చిరుదివ్వెలా వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రమే నేడు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాడని బండి సుధాకర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ బాధ్యతలను భుజాన వేసుకొని, కార్యకర్తలకు నేనున్నా.. అని భరోసా కల్పిస్తూ, పార్టీని ప్రగతిపథంలో నడిపిస్తుంటే.. పనికిరాని విమర్శలు చేయడం రాజగోపాల్ రెడ్డికే చెల్లిందని బండి విమర్శించారు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చాడంటున్న రాజగోపాల్ రెడ్డి.. తనకు కూడా ఆ సూత్రం వర్తిస్తుందని బీజేపీలో త్వరలోనే తెలుసుకుంటాడన్నారు.
2018 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకపోయినా, దాదాపు 50 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్ధికసాయం చేసి కాపాడుకున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇదే బీజేపీ నాయకులైతే రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసినా.. గడ్డిపోచలా వదిలేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని బండి అన్నారు. టీఆర్ఎస్ నుంచి కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామనే ఆఫర్ వచ్చినా ప్రలోభాలకు లొంగకుండా తిరస్కరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు.
మెజార్టీ నాయకుల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి అందరం అండగా నిలిచి, మునుగోడులో కాంగ్రెస్ జెండాను మరోసారి ఎగురవేయాల్సిన చారిత్రక అవసరం ఉన్నదని పీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ పార్టీ శ్రేణులను కోరారు.