Suryaa.co.in

Telangana

త్వరలోనే హైదరాబాద్ లో బంజారా జాతీయ స్థాయి సమావేశం

-వినోద్ కుమార్ తో దక్షిణాది రాష్ట్రాలతో సహా మహారాష్ట్ర, గోవా బంజారా జేఏసీ నేతల భేటీ
– బంజారా జేఏసీ నిర్వహించనున్న జాతీయ స్థాయి ఉద్యమానికి వినోద్ కుమార్ మద్దతు

దక్షిణాది రాష్ట్రాలతో సహా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ తో బంజారా జేఏసీ నాయకులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బంజారా జేఏసీ నాయకులు వినోద్ కుమార్ ను కోరారు.

కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన బంజారా జేఏసీ నాయకులు శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమై ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన బంజారా జేఏసీ నాయకులతో కలిసి హైదరాబాద్ లో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బంజారా జేఏసీ నాయకులు వినోద్ కుమార్ కు తెలిపారు.

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద తమ కుల దైవం అయిన కింగ్ శుర్ వీర్ లఖిషా బంజారా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని, అందుకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి ముందుకు సాగేందుకు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని బంజారా జేఏసీ నాయకులు వినోద్ కుమార్ ను కోరారు. దీంతో పాటు జాతీయ స్థాయిలో బంజారా కులస్థులకు రిజర్వేషన్ విధానం ఒకేవిధంగా ఉండేలా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని కూడా వారు వినోద్ కుమార్ ను కోరారు.

ఈ సదర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ న్యాయ పరంగా ఉన్న బంజారా జేఏసీ డిమాండ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బంజారా జేఏసీ నాయకుల డిమాండ్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినోద్ కుమార్ తో సమావేశమైన బంజారా జేఏసీ నాయకులలో కన్నీరాం రాథోడ్ ( కర్నాటక ), గుర్మీత్ రాథోడ్ ( తమిళనాడు ), రమేష్ రాథోడ్ ( ఆంధ్రప్రదేశ్ ), సింపల్ రాథోడ్ ( మహారాష్ట్ర ) రామారావు మహారాజ్ భాటేగావలర్ ( మహారాష్ట్ర ), పవార్ రమేష్ ( గోవా ), అంబు రాథోడ్ ( తెలంగాణా ), ఎల్. రూప్ సింగ్ ( తెలంగాణా ), తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE