అర్థమే తెలియని
నువ్వా బాపూని
విమర్శించేది..
లాఠీ దెబ్బలకెదురెళ్లని
తరానికి ఆయనలా పోరాటాలు
చేయ తరమా..!
దేశమెలా విడిపోయిందో
నీకు తెలుసా..
ఆ నిర్ణయానికి ముందు
నలిగిపోయిన
మహాత్ముడంటే
నీకంత అలుసా..!
అన్నదమ్ములు
ఆస్తి పంపకాలు
కోరినప్పుడు
నలిగిపోయే నాన్న..
విడిపోతుంటే ఆపలేని
పరితాపంలో
బాపూ రూపంలో..!
కలిసుంటే గాంధీకి నచ్చదా
ఎంత అంతర్మధనం…
వద్దని అంతరాత్మ ప్రబోధం
విడగొట్టమంటూ
కొన్ని శక్తుల ప్రమేయం..
ఇదంతా శాంతిదూత
హృదయానికెంతటి గాయం!
ఇప్పుడు ఇంట్లో కూర్చొని
చేతిలో పెన్ను..లేదా ఫోను
ఉంది కదాని
తెగ చేస్తున్నావు విమర్శలు..
ఎవరో రాసింది చేసేస్తే ఫార్వర్డు..
అదో రికార్డు..
జాతిపితపై లేకుండా రిగార్డు..
నాటి చరిత్ర
పూర్తిగా చదివావా..
స్వరాజ్య సమరం..
ఎన్నో త్యాగాలు..
ప్రాణాలు ఫణంగా పెట్టి
తూటాలకు ఎదురెళ్లి
చేసిన పోరాటాలు
నీ దృష్టిలో అల్లాటప్పాలా..
బాపూ గురించి ఇంట్లో కూర్చుని కుచ్చుటప్పాలా!
కుహానావాదులను
చరిత్ర అడక్కు..
చెప్పింది వినకు..
నీ అంతట
నువ్వే తెలుసుకో..
చదువు..
మనసు వాకిలి తెరువు..
నమ్మకాల్లో వద్దు ఈ అరువు!
చాందసవాదులు..
పిడివాద హిందుత్వాలు
ఎక్కువైపోయి
మహాత్ముని పుట్టక
మహనీయుని నిబద్ధత..
అన్నిటినీ ప్రశ్నిస్తున్నావు..
ఏమిటి నీకున్న జ్ఞానం..
వాట్సాప్ పరిజ్ఞానం!?
నువ్వు పాడైపోతే పోయావు..
భావితరాల్లో
ద్వేషం నింపకు..
చరిత్రను వక్రీకరిస్తూ
నువ్వు చెప్పే మాటలు
విషపు మూటలు..
ఇప్పటికే భ్రష్టుపడుతున్న
వ్యవస్థ..మరింత అవస్థ!
అయినా..
నీ కళ్ళెదుట
జరుగుతున్న అక్రమాలను
ఆపే శక్తి..
కనీసం ప్రశ్నించే
ధైర్యం నీకుందా..
అవి లేనప్పుడు
మహనీయుల నిరతిని
ఎత్తి చూపే హక్కు నీకెక్కడిది..
ఎందరో వీరుల త్యాగఫలం
మన స్వరాజ్యం..
ఇప్పుడు
ముష్కరుల భోజ్యం..
అది పట్టించుకోవు..
పైగా అలాంటి నేతల వెనకే
నీ పరుగు..
వాళ్ళకి జేజేలు..
మహాత్ములపై విమర్శలు
ఎక్కడికి పోతున్నాం మనం
గతమెంతో ఘనం..
కుళ్లిపోయిన వర్తమానం..
భవిత అగమ్యగోచరం..
ఈ మూడింటి నడుమ
నలిగిపోయే త్రిశంకు..
ఇకనైనా మానేయి
ఈ బొంకు!
అభూతకల్పనలతో
ఇలాంటి రంకు..!!
– ఈఎస్కే