ఒక విస్ఫోటనం..
ప్రకృతి చేసిన వీరవిహారం..
మనిషి మళ్లీ
చూడాలనుకోని విలయం..
రేపు అనేది చూస్తామా..
ఇదే అఖరా..
జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందా..?
అందరి మదిలో ఇదే భయం
ఇంతకు మునుపెన్నడూ
చవి చూడని
భయానక అనుభవం..
ఇంట్లోనే ఉండి
చూసిన నరకం..
అది దుస్వప్నం కాదు..
మూకుమ్మడిగా కన్న పీడకల!
హుదూద్..
ఎనిమిది సంవత్సరాలకు మునుపు
ఇదే రోజు..
పగలూ రాత్రీ తేడా
తెలియని కాలం..
ఇంటింటా కలకలం..
రేపు పొద్దు పొడుస్తుందా…
పొడిచినా చూస్తామా..?
పిశాచాల ఊళలా..
ప్రకృతి తానుగా
చేస్తున్న గోలా..
కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి..
ఆకాశానికి చిల్లు పడినట్టు..
చినుకు పడుతుంటే
భూమి బద్దలైపోతున్నట్టు!
ఇదేనా ప్రళయమంటే..
మనుషులేమో నాలుగు గోడల మధ్య..
ఆ క్షణాన భవితే మిథ్య..
ఏదీ సాయం సంధ్య..
పంచభూతాలు వరుణుడి
అధీనంలోకి వెళ్లిపోయాయా
ఇక తెరిపి ఉండదా..
ఉషోదయం..పండు వెన్నెల..
పిల్ల తెమ్మెర..పూల చీర చుట్టి
సింగారించుకున్న
ప్రకృతి కాంత..
ఏమైపోయాయి ఇవన్నీ..
కళ్ళ ముందు నిన్న ఉన్న భవనాలు ఇప్పుడున్నాయా..
కూలిపోయాయా..
మరి నేనున్న ఇల్లూ పడిపోతే
నా వాళ్ళని
ఎలా కాపాడుకోవడం..
అసలు నేను మిగులుతానా!
ఊళ్ళు సెలయేళ్ళై..
రోడ్లు జలమయమై..
మేడలు జలపాతాలై..
ఆకాశహర్మ్యాలు
భయంకర రాక్షసుడు
కుదిపేస్తున్నట్టు ఊగిపోతుంటే
ఇంకెక్కడి నిరుపేద కొంప..
నడిసముద్రంలో
కొట్టుకుపోయిన తెరచాప!
సరే…ఎలాగోలా తెల్లారింది..
రోజంతా శ్రమించిన వరుణుడు ఉపశమించాడు..
అదే అదనుగా ఉదయభానుడు
ఇటు తొంగి చూసాడు..
ఆ వెలుగులో పరికిస్తే…
ఊరిని పలకరిస్తే..
ఒకేలాంటి కధలు..
ఒక్కరోజులోనే
అంతులేని వ్యధలు!
చిన్నప్పటి నుంచి చూసిన
మహావృక్షాలు
అదెలా కూలిపోయాయో..
చెట్టు నేలపై..
అగాధాలు ఇలపై..
ప్రకృతి ప్రకోపం..
మనిషికి శాపం..
హరించుకుపోయిన హరితం
హృదయం వ్యధాభరితం..
చీకటి చరితం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286