-
భాగ్యనగరానికి బీమారొచ్చింది
-
చెత్త, నీళ్ల నిల్వలతో రోగాలు
-
బస్తీల్లో జీహెచ్‌ఎంసీ చెత్త బండ్లు తిష్ట
-
దోమలతో కొత్త రోగాలు
-
వైరల్ ఫీవర్, దగ్గు, గొంతు నొప్పితో జనం
-
సర్కారీ దవాఖానల కిటకిట
-
సుఖనిద్రలో సర్కారు
-
పాపం.. హైదరా‘బ్యాడ్’
( అన్వేష్)
హైదరాబాద్: రోగాల సీజన్ షురవయింది. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, జలుబు, గొంతునొప్పి, విరేచనాలు, వాంతులు.. ఒకటేమిటి? సర్వరోగాలతో మహానగరం వర్ధిల్లుతోంది. భాగ్యనగరం రోగాల ఒడిలో సేదదీరుతోంది. సర్కారీ దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నోలోఫర్, ఉస్మానియా, గాంధీ దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మంది ఎక్కువ-డాక్టర్లు తక్కువ కావడంతో, రోగులు గంటలపాటు నరకయాతనకు గురవుతున్నారు. టోటల్‌గా ఇదీ.. హైదరా‘బ్యాడ్’!
ఇదంతా మహానగరంలో పారిశుద్థ్యం పడకేసిన పాపమేనన్నది జనం మాట. వర్షాలకు రోడ్లపై నిలిచిన నీళ్లు కొన్ని రోజులపాటు అక్కడే తిష్టవేస్తున్నా, వాటిని తొలగించే దిక్కులేదు. ఇక బస్తీలకు సుస్తీ చేసినా పట్టింకునే నాధుడు లేడు. మహానగరంలోని మస్తు బస్తీలు ఇంకా నీళ్లలోనే ఉండగా… దాని ఫలితంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితం.. జ్వరాలు, అంటురోగాలు. బస్తీ దవాఖానలకెళితే, మందులు లేవన్న జవాబు.
ఇంకొన్ని బస్తీల్లో చెత్త తొలగించే వాహనాలను, జనం మధ్యనే పార్కింగ్ చేసి వెళుతున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడలో జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త వాహనాలన్నీ కాలనీల మధ్య వదిలేసి వెళుతున్న దృశ్యాలు, అధికారులకు కనిపించకపోవడమే వింత. చెత్త వాహనాలకు స్థలం కేటాయించినప్పటికీ.. బ్రాహ్మణబస్తీ, వారాసిగూడ ప్రాంతాల్లో వాటిని పార్కింగ్ చేస్తున్న ఫలితంగా.. కాలనీవాసులు రోగాలపాలవుతున్న వైనం అటు జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇటు కార్పొరేటర్లకు పట్టకపోవడం విషాదం.
కాలనీలలో చెత్త వాహనాలు పార్కింగ్ చేస్తున్న ఫలితంగా, అవి డస్ట్‌బిన్లుగా మారుతున్న పరిస్థితి. మరి రోగాలు ఎందుకు రావు? ఇలాంటి అనధికార పార్కింగులు మహానగరంలో మరెన్నో?! ఇవన్నీ సర్కారు సుఖనిద్రపోతున్న ఫలితమేనన్నది ‘సిటి’జనుల మాట.
వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలు తున్నాయి. జర్వం, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, వాంతులు, విరేచనాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఏ హాస్పిటల్ చూసినా వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతోంది.
ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వైరల్ ఫీవర్ బాధితులుంటున్నారు. వర్షా కాలం.. కొన్ని రోజులుగా వాతావరణం ముసురుగా ఉండటంతో విష జ్వరాల సంఖ్య భారీగా పెరిగి పోయింది. పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ఫీవర్ హాస్పిటల్ లోనే రోజుకు 600 నుంచి 700 వరకు ఓపీ ఉంటోంది. సాధారణ రోజుల్లో ఇక్కడ 300 నుంచి 400 మంది మాత్రమే వస్తుంటారు. సీజన్ మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదు రెట్లు పెరిగింది.
ఇన్ పేషెంట్‌గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు 30 నుంచి 40 వరకు ఉంటోంది.. వీరిలో ఎక్కువగా హెపటైటిస్, చికెన్ గున్యా, డెంగ్యూ, విష జర్వాల బాధితులు ఉంటున్నారు. ఒక్క ఫీవర్ హాస్పిటల్‌లో మాత్రమే కాదు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్ లలో కూడా వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య పెరిగింది.
ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధారణ ఓపీ కన్నా 500 వందల మంది వరకు ఎక్కువ ఒపి ఉంటోంది. పెరిగిన ఓపీ మొత్తం కూడా వైరల్ ఫీవర్స్ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. పాపం.. హైదరా‘బ్యాడ్’