– అందరూ బతకాలి అని గొప్ప సందేశం ఇచ్చేదే బతుకమ్మ
– బతుకమ్మ పాటల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ లో అందరికీ ఇష్టమైన పండుగ బతుకమ్మ. ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పాటలు పండితులు రాసినవి కాదు. శ్రామిక మహిళలు తమకు తాము పాడినవి ఎక్కువ ప్రచారం లో ఉన్నవి. మహిళల సహజ సాహిత్య ప్రతిభ ను ప్రపంచానికి తెలియ జెప్పిన పండగ బతుకమ్మ. ఇలాంటి పండగ ప్రపంచం లో మరెక్కడ లేదు.
ప్రాణం విలువ చెప్పేది బతుకమ్మ. అందరూ బతకాలి అని గొప్ప సందేశం ఇచ్చేదే బతుకమ్మ. బతుకమ్మ లోని రకరకాల పూలు జీవితం లోని రకరకాల పార్శ్వాలు తెలియ జెబ్బుతాయి. బొడ్డెమ్మ మట్టికి చేసే పూజ అయితే బతుకమ్మ మొత్తం వృక్ష జాతికి చేసే పూజ. దేవునికి భక్తునికి అనుసంధానం లేదు బతుకమ్మకు.
బతుకమ్మ కు గుడి లేదు పూజారి లేడు. ప్రతి చౌరస్తా బతుకమ్మ కు గుడే .బతుకమ్మ కు మహిళలు పాడే పాటలే మంత్రాలు. మంచి తెలుగు భాష బతుకమ్మ పాటల్లోనే కనిపిస్తుంది. తెలంగాణ ఆస్థిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ. తెలంగాణ రాక ముందు గతం లో సీఎం లుగా పనిచేసిన వారు కనీసం బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపే వారు కాదు.
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పోరాట స్వరూపంగా మారింది. బతుకమ్మ ను విశ్వ వ్యాప్తం చేసిన ఘనత బీ ఆర్ ఎస్ దే. తెలంగాణ అస్తిత్వం తెలియని వాడు ఇపుడు మన సీఎం గా ఉండటం దురదృష్టకరం. బతుకమ్మ ను అధికారిక పండగ చేయడమే కాదు. ఆ బతుకమ్మ ను వేసే చెరువులు బాగు చేసిన ఘనత కేసీఆర్ దే.
తెలంగాణ తల్లి ఉద్యమ గర్భం లో నుంచి పుట్టింది. రేవంత్ రెడ్డి ఓర్వలేనితనం , నరనరాల ద్వేషం నింపుకున్న తత్వం నుంచి కొత్త తెలంగాణ తల్లి పుట్టింది. బతుకమ్మ ను తెలంగాణ నుంచి వేరు చేసి రేవంత్ రెడ్డి మహిళల హృదయాలను గాయపరిచారు.
తెలంగాణ తల్లికి వడ్డాణం ఎందుకు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వడ్డాణం ప్రస్తావన సాధారణ మహిళలు పాడుకునే బతుకమ్మ పాటల్లోనే ఉంది. యూరియా గురించి లైన్లలో నిలబడుతున్న మహిళలు ఈ ప్రభుత్వం కూలిపోను అని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ నేల స్వభావం తెలిసిన పాలన మళ్ళీ రావాలి. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ చేరాలి.