– ఇదే కూటమి లక్ష్యం
– రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత
* త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
* బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణిస్తాం
* గొల్లపూడి బీసీ భవన్ లో సివిల్స్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన మంత్రిసవిత
* అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
విజయవాడ : ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను మంగళవారం మంత్రి సవిత సందర్శించారు. ఈ సందర్బంగా బీసీ అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు చెందిన 43 రకాల మెటీరియల్ ను వారికి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో ఉండే కీలక స్థానాల్లో బీసీ యువత ఉండాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు.
16,457 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగానే, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఆఫ్ లైన్ కోచింగ్ ప్రారంభించామన్నారు. ఇంటి వద్ద ఉండే మహిళలకు, పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునే బీసీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300ల మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారన్నారు. గతేడాది ఉచిత సివిల్స్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు. సివిల్స్ కోచింగ్ తీసుకున్నవారిలో పలువురు గ్రూప్ -1, రైల్వే, బ్యాంకులు వంటి రంగాల్లోనూ ఉద్యోగాలు సాధించారన్నారు.
గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా వందమంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 700ల మంది పాల్గొనగా, వారిలో వంద మంది అర్హత సాధించారన్నారు. ఎంపిక మహిళ, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా వసతి సౌకర్యం కల్పించామన్నారు. హైదరాబాద్ కు చెందిన లా ఎక్స్ లెన్స్ ఐఎఎస్ అకాడమీ ద్వారా నిష్ణాతులైన అధ్యాపకులతో సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నామన్నారు.
కార్పొరేట్ సంస్థల కంటే ధీటుగా పౌష్టికాహారంతో కూడిన విద్యా బోధన అందిస్తున్నామన్నారు. ఏసీ తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ వంటి అధునాతన సదుపాయలు కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా వివిధ సబ్జెక్టులతో కూడిన మెటీరియల్ ను అభ్యర్థులకు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని, బీసీ అభ్యర్థులు ఐఎఎస్ లుగా ఎంపికవ్వాలని మంత్రి సవిత సూచించారు.
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని, ఈ పోటీ పరీక్షకు కూడా ఉచిత కోచింగ్ అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి సవిత ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుని, ఐఎఎస్ లు స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఎం.ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.