-ఊరంతా గుంటూరే
-గోదార్లయిన రాదార్లు
-బీసీ జన ఘోషతో దద్దరిల్లిన అమరావతి
-బాబు-పవన్-లోకేష్ జయజయధ్వానాలతో ప్రతిధ్వనించిన జయహో బీసీ
-బీసీలపై టీడీపీ-జనసేన వరాల జల్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ అక్కడే.. కాకపోతే అప్పుడు టీడీపీ ఒంటరిగా.. ఇప్పుడు జంటగా జనసేన. జనప్రభంజనం.. జయజయ ధ్వానాలు.. బీసీల బ్రహ్మరథం అంతా సేమ్ టు సేమ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో చెప్పేందుకు బీసీ జయహో పేరిట టీడీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు బడుగులు గొడుగు పట్టారు.
50 ఏళ్లున్న ప్రతి బీసీకీ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. బీసీలకు ఎస్సీల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టం.. బీసీ సబ్ ప్లాన్ ద్వారా లక్షన్నర కోట్ల ఖర్చు.. 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణ.. దామాషా ప్రకారం నిధులు.. 5వేల కోట్లతో ఆదరణ పనిముట్లు.. పదిలక్షలతో చంద్రన్నభీమా పునరుద్ధరణ.. శాశ్వత కులధ్రువపత్రాల జారీ.. పీజీ విద్యార్థులకూ ఫీజురీఇంబర్స్మెంట్ పునరుద్ధరణ.. ఇలా బీసీలపై వరాల జల్లు కురిపించి, వారి పెదవులపై చిరునవ్వులు పూయించారు.
నిజానికి వీటిలో సింహభాగం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా అమలుచేసినవే. వాటిని జగన్ రద్దుచేసి అటకెక్కించారు. ఇప్పుడు బీసీ గర్జనలో బాబు-పవన్-లోకేష్ త్రయం మళ్లీ వాటిని పునరుద్ధరిస్తామని లక్షలాదిమంది బడుగుల సాక్షిగా ప్రకటించారు. టీడీపీ జయహో బీసీకి శ్రీకాకుళం నుంచి మాచర్ల వరకూ బడుగులు పోటెత్తారు. వారి రాకతో రాదార్లు గోదార్లయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది. దారిపొడవునా వెలసిన ఫ్లెక్సీల ఉత్సాహం చూస్తే బడుగులలో బీసీ జయహో ఎంత ప్రభావం చూపిందో సుస్పష్టం. ఉత్తరాంధ్రలో కాళింగ, తూర్పుకాపు, గవర, కొప్పుల వెలమ.. గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ, మత్స్యకారులు.. కోస్తా-ఉత్తరాంధ్రలో యాదవులు, గౌడలు.. రాయలసీమలో ఈడిగ, కురుబ, కురుమ, బోయలు బీసీ గర్జనకు హాజరై బీసీ జయహో అంటూ చేసిన నినాదాలతో ప్రతిధ్వనించింది.