Suryaa.co.in

Editorial

బీ‘సీరియస్‌’!

– బీఆర్‌ఎస్‌పై బీసీల తిరుగుబాటు
– టికెట్లలో బీసీలకు మొండిచేయి
– ఓసీలకు పెద్దపీటపై బీసీల ఫైర్‌
– రోడ్డెక్కిన బీసీ సంఘాలు
– మా వాటా మాకివ్వాలంటూ ఆందోళన
– రెడ్డి-రావుల పార్టీ అంటూ బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్ర్తాలు
– జనాభాలో వెలమ, రెడ్ల శాతం ఎంతంటూ ప్రశ్నాస్ర్తాలు
– ముదిరాజ్‌, యాదవ, కురుమల ఆగ్రహం
– కులసభలకు సన్నాహాలు చేసుకుంటున్న సంఘాలు
– 25న ముదిరాజ్‌ ప్లీనరీ
– ముదిరాజ్‌ ఆత్మగౌరవ పాదయాత్రకు సన్నాహాలు
-25న నాగోల్‌లో యాదవ యుద్ధభేరి
– 26న దగాపడ్డ బీఆర్‌ఎస్‌ బీసీలతో సమావేశం
– అగ్ర కులాలకో న్యాయం ఆదివాసులకో న్యాయమా?
– కోర్టు వద్దన్నా వనమాకు ఎలా ఇచ్చారు?
– నలుగురు గిరిజన, దళిత ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారు?
– ‘కారు’లో ఎన్నికల ‘కుల’కలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘కారు’లో రేగిన ‘కుల’కలం ఇప్పట్లో చల్లారేలా లేదు. తెలంగాణలో సింహభాగం ఉన్న బీసీలకు.. బీఆర్‌ఎస్‌ మొండిచేయి చూపడంపై, బడుగులు పిడుగులు కురిపిస్తున్నారు. ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని సవాళ్లు విసురుతున్నారు. జనాభాలో అర శాతం ఉన్న వెలమ, ఐదు శాతమే ఉన్న రెడ్లకు.. సింహభాగం సీట్లు ఎలా కేటాయిస్తారంటూ విరుచుకుపడుతున్నారు. అది రావు-రెడ్ల పార్టీగా అభివర్ణిస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై భగ్గుమన్న బడుగులు, కులాల వారీగా బహిరంగసభలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే కారులో ‘కుల’కలం రేపుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం ఉన్న తమకు… బీఆర్‌ఎస్‌ టికెట్లలో తీవ్ర అన్యాయం చేసిందంటూ బీసీ సంఘాలు, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పిడికిలి బిగించి, రోడ్డెక్కడం అధికార పార్టీకి తలనొప్పిలా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతమని బీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్‌ తాజా ప్రకటనలో గౌడ్లు 4, మున్నూరు కాపు 11, యాదవ 5, పద్మశాలి 1, గంగపుత్ర 1, వంజర 1 టికెట్లు ఇచ్చారు. గతంలో పెరిక నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌కు ఇవ్వగా, ఇప్పుడు అక్కడి నుంచి కేసీఆర్‌ పోటీ చేయడంతో, అది కూడా అగ్రకులాల ఖాతాలో కలిసిందని బీసీ నేతలు చెబుతున్నారు.

అయితే 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లే ఇవ్వడంపై బడుగులు భగ్గుమంటున్నారు. తెలంగాణలోని 136 కులాల్లో.. కేవలం 5 బీసీ కులాలకే సీట్లు ఇవ్వడంపై, బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. 5 శాతం మాత్రమే ఉన్న రెడ్లకు 40 సీట్లు ఇవ్వడం ద్వారా, వారికి 60 శాతం ఇచ్చినట్లయిందని చెబుతున్నారు. అరశాతం కూడా వెలమలకు 11 సీటు ఇవ్వడం, ఏ సామాజిక న్యాయమని నిలదీస్తున్నారు.

మొత్తం తెలంగాణ జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రకులాలకు, 60 శాతం ఎలా ఇస్తారని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం సీట్లు, 0.5 శాతం ఉన్న వెలమలకు 16 శాతం సీట్లు, 5 శాతం ఉన్న రెడ్లకు 33 శాతం ఇవ్వడం బట్టి.. కేసీఆర్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదని, బీసీ పొలిటికల్‌ జాక్‌ కన్వీనర్‌ యుగంధర్‌గౌడ్‌ ధ్వజమెత్తారు.

బీసీలకు జరిగిన అన్యాయంపై గళమెత్తిన బీసీ సంఘాలు, రెండురోజులుగా చేస్తున్న ఆందోళనలు అట్టుడికిస్తున్నాయి. మంచిర్యాల టికెట్‌ను వెలమ సామాజికవర్గానికి చెందిన దివాకర్‌రావుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ, బీసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో 50 శాతం ఉన్న బీసీలను కాదని, తరాల నుంచి వెలమలకే ఇవ్వడం ఏమిటని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థులు, కేసీఆర్‌ దిష్టిబొమ్మ తగులబెట్టే ప్రయత్నం చేశారు.

ముదిరాజ్‌ ఆత్మగౌరవ పాదయాత్ర నిర్వహిస్తామని ముదిరాజ్‌ సంఘం వెల్లడించింది. దానితోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ముదిరాజ్‌లను ఇండిపెండెంట్లుగా నిలబెడతామని హెచ్చరించింది. 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులను, కేసీఆర్‌ అవమానించారని ఆగ్రహించింది. 25న బేగంపేటలో నిర్వహించే ముదిరాజ్‌ ప్లీనరీలో, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

మరోవైపు యాదవులు కూడా పిడికిలి బిగించారు. ఈనెల 25న నాగోల్‌లో యాదవ యుద్ధభేరి నిర్వహిస్తామని, హైకోర్టు సీదియర్‌ న్యాయవాది అయిన యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలకాని వెంకట్‌యాదవ్‌ అధ్యక్షుడు వెల్లడించారు. తమ జనాభా ప్రకారం యాదవులకు, 22 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కానీ కేవలం కేసీఆర్‌ 5 సీట్లే ఇవ్వడం అన్యాయమన్నారు.

కాగా బీఆర్‌ఎస్‌లో మోసపోయిన బీసీలతో, ఒక సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు 24న రాష్ట్రవ్యాప్తంగా పూలే, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తామని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస గౌడ్‌ వెల్లడించారు. 26న బీఆర్‌ఎస్‌ మోసపోయిన బీసీలతో సమావేశం ఏర్పాటుచేసి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

కాగా ఖమ్మంలో కమ్మవర్గానికి చెంందిన ఎమ్మెల్యే వనమాపై, కోర్టు అనర్హత వేటు వేసింది. కానీ మళ్లీ ఆయనకే సీటిచ్చిన కేసీఆర్‌.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు గిరిజనులు, వరంగల్‌లో ఎస్సీ, ఖమ్మంలో ఎస్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చడంపై, అటు గిరిజన సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అగ్రకులాలకు ఒక న్యాయం, గిరిజనులకు ఒక న్యాయమా? అని ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

కాగా బడుగుల ఈ పిడుగులు ఎంత కాలం కొనసాగుతాయో చూడాలి. ఒకవేళ ఎన్నికల వరకూ బీసీ సంఘాలు.. దీనిని ఒక సామాజిక ఉద్యమంగా తమ ఆందోళన కొనసాగిస్తే మాత్రం, బీసీఆర్‌ఎస్‌ రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A RESPONSE