_ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్?
– బాబుకు సానుభూతి బ్రేక్?
(మార్తి సుబ్రహ్మణ్యం)
మూడు రాజధానుల యోచన విరమించుకున్న ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయం అందరినీ మెప్పించింది. అమరావతి రైతు ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించిన బిజెపి ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన మరుసటి రోజునే జగన్ సర్కారు మూడు రాజధానులు యోచన విరమించుకోవడం, నిస్సందేహంగా బిజెపి రాజకీయంగా సాధించిన తొలి భారీ విజయమే.
అయితే ఇప్పటి వరకు అమరావతి ఉద్యమానికి ముందుండి సారథ్యం వహించిన తెలుగుదేశం పార్టీ.. జగన్ సర్కార్ పై సాధించిన అపూర్వ విజయంగా భావించక తప్పదు. అమరావతి భూముల కొనుగోలుపై ఇప్పటివరకు టిడిపి నేతలపై విచారణ, కేసులు పెట్టిన ప్రభుత్వ నిర్ణయం.. తాజా వైఖరితో రద్దయినట్లపోయింది.అమరావతి ఉద్యమానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ఉన్న తెలుగు వారినందరిని కూడగట్టి ,వారి మద్దతు పొందేలా చూసిన తెలుగుదేశం పార్టీ.. తాజా ప్రభుత్వ నిర్ణయంతో నైతిక విజయం సాధించినట్లే అయింది. ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గత రెండున్నర ఏళ్లలో రాజకీయంగా సాధించిన ఈ భారీ విజయమనే చెప్పాలి.
ప్రధానంగా బిజెపి అమరావతి అంశంలో రంగ ప్రవేశం చేయడం కూడా జగన్ సర్కారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ఒక కారణమని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా రంగంలోకి దిగి అమరావతి అనుకూల ఉద్యమంలో పాల్గొనాలని ఆదేశించడం.. ఆ మేరకు రంగంలోకి దిగిన సుజనా చౌదరి ఆదివారం భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి రైతుల పాదయాత్రలో పాల్గొనడం కూడా జగన్ ప్రభుత్వం వెనకంజ వేయడానికి మరో ప్రధాన కారణం అంటున్నారు. బిజెపి రంగంలోకి దిగక పోతే జగన్ ఈ నిర్ణయం తీసుకునే వారు కాదని.. స్వయంగా గా ఇక తాను బీజేపీతో కూడా యుద్ధం చేయవలసి ఉంటుందన్న ముందు చూపుతోనే, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఇదంతా జగన్- బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. రాష్ట్రంలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా పెంచే వ్యూహంలో భాగంగానే ఈ పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. అందుకే అమరావతి రైతులు వందల రోజుల పాటు ఉద్యమాలు నిర్వహించిన స్పందించని జగన్ ప్రభుత్వం.. బిజెపి నేతలు రైతుల పాదయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరుసటి రోజునే ఈ నిర్ణయం తీసుకుందని గుర్తు చేస్తున్నారు. దీని ద్వారా బిజెపి రంగంలోకి దిగితేనే జగన్ ప్రభుత్వం వస్తుంది తప్ప, చంద్రబాబునాయుడు ఎన్ని ఉద్యమాలు చేసినా దిగిరాదనే సంకేతాలు ప్రజల్లోకి పంపడమే వైసిపి బిజెపి లక్ష్యమని చెబుతున్నారు.
పైగా రాజధాని అనుకూల నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక టీడీపీకి రాజకీయంగా ఎలాంటి అస్త్రాలు ఉండవని, ఆ వ్యూహంలో భాగంగానే మూడు రాజధానులు బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు అని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో రైతుల నుండి తెలుగుదేశం పార్టీని వేరు చేయడానికి జగన్ తీసుకున్న నిర్ణయంగా విశ్లేషిస్తున్నారు.
జగన్ సర్కారు తాజా నిర్ణయం.. ఇప్పటివరకు జగన్ మొండివాడు అన్న పేరు పోవడానికి దోహదపడిందని చెబుతున్నారు. మోడీ కూడా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి అందరినీ మెప్పించి నట్లే.. జగన్ కూడా మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించుకుని.. తనకు ఎక్కడ తగ్గాలో తెలిసిన అన్న సంకేతాలు పంపారు అంటున్నారు.
ప్రధానంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యల నేపథ్యంలో.. చంద్రబాబు విలపించిన వైనం మహిళల్లో టిడిపికి బోలెడు సానుభూతి సంపాదించింది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు టిఆర్ఎస్ నేతలు సైతం, చంద్రబాబు కుటుంబానికి దన్నుగా రావటం.. ఈ సానుభూతి మరింత విస్తరించకుండా, అది ఇది తన పార్టీ- ప్రభుత్వంపై సరే కథ ఇంకా పెంచక ముందే, జగన్ వ్యూహాత్మకంగా మూడు రాజధానులు బిల్లు నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇది బిజెపి విజయమే: కన్నా
అమరావతిపై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నిజానికి అమరావతి కి అనుకూలంగా తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తీర్మానం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజల అభిప్రాయాలను ఎవరైనా గౌరవించక తప్పదన్నారు. జగన్ ప్రభుత్వం అమరావతి పై అనవసర ప్రతిష్టకు పోయి , చివరకు బిజెపి రంగప్రవేశంతో దిగిరాక తప్పలేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనవసర బేషజాలు మరచి, అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను శరవేగంగా నిర్మించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి బిజెపి గత ప్రభుత్వంలో కూడా సలహాలు సూచనలు ఇచ్చిందని, ఈ ప్రభుత్వానికి కూడా సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. అమరావతిలో కేంద్ర భాగస్వామ్యం ఉన్నందువల్లే, బిజెపి రాజకీయ నిర్ణయం తీసుకుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.