-‘బీఈఎల్’ సమస్యల పరిష్కారానికి సంబంధించి వినతిపత్రం సమర్పించిన డైరెక్టర్ డాక్టర్ పార్థసారధి
-డీపీఆర్ సిద్ధం చేసుకుని వస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్న -ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
అమరావతి, సెప్టెంబర్, 01: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డితో ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ పరిశ్రమ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. పరిశ్రమ ఏర్పాటులో కరోనా సహా గత ప్రభుత్వంలో జరిగిన అనుమతులలో జాప్యం , ఇతర సాంకేతిక ఇబ్బందుల గురించి బీఈఎల్ డైరెక్టర్ పార్థసారధి ఏపీఐఐసీ, ఛైర్మన్, ఎండీలకు వివరించారు. మిస్సైల్ తయారీ. రాడార్ వ్యవస్థ, ప్రయోగాల వంటి సున్నితమైన అంశాలపై చర్చించారు.
2016లో అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద బీఈఎల్ ఆధ్వర్యంలో రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ , రక్షణ రంగ ఉత్పత్తుల (మిస్సైల్ మానుఫాక్చరింగ్) యూనిట్ కోసం ఏపీఐఐసీ 914 ఎకరాల భూములను కేటాయించినట్లు ‘బీఈఎల్’ డైరెక్టర్ పార్థసారధి తెలిపారు. గత ప్రభుత్వంలో అనుమతుల విషయంలో జరిగిన జాప్యం వల్ల ఎక్కువ ఆలస్యం జరిగిందన్నారు. పరిశ్రమ ఏర్పాటులో కీలకమైన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ఇంతవరకూ సిద్ధం చేసుకోకపోవడంపై ఈ సందర్భంగా ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి ఆరా తీశారు.
ఇప్పటికే ప్రహరీ గోడ, రోడ్లు వంటి పనులు పూర్తి చేసుకున్నప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు బీఈఎల్ బోర్డుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులను డైరెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ అనుమతులు సహా అన్ని అనుమతులు ఈ ప్రభుత్వంలోనే వచ్చాయన్నారు. ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఛైర్మన్ హామీ ఇచ్చారు. డీపీఆర్ ను త్వరలోనే పూర్తి చేసుకుని వస్తామని బీఈఎల్ డైరెక్టర్ అన్నారు. డీపీఆర్ సహా ఏపీఐఐసీ నియమావళిని అనుసరించి జాప్యానికి గల కారణాలను సమర్పిస్తే ఏపీఐఐసీ ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించే బోర్డులో నిర్ణయం తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని ఎండీ సుబ్రమణ్యం వెల్లడించారు.
మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో గురువారం జరిగిన బీఈఎల్ సమావేశంలో ఏపీఐఐసీ సీజీఎం(అసెట్ మేనేజ్ మెంట్) ఎల్.రామ్, జనరల్ మేనేజర్లు గెల్లి ప్రసాద్, నాగ్ కుమార్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారధి, జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, ఏజీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.