-గీతా సుగీతా భగవద్గీతా
-“తత్త్వ సత్యానికి, సత్య తత్త్వానికి సత్వం వచ్చింది. అదే భగవద్గీత”
భగవద్గీత ఒక తాత్త్విక లేదా వేదాంత పాఠం. అంతే కాదు భగవద్గీత దాపుగా 50 విషయాలపై సరైన అవగాహనను ఇస్తోంది. భారత(ప్ర)దేశం ప్రపంచానికి అందించిన అసమానమైన, మహోన్నతమైన పాఠం భగవద్గీత. ఇక్కడ గీత అంటే గీతం లేదా పాట అని అర్థం కాదు. గీతా(త)అన్న పదానికి “ఆధ్యాత్మిక, తాత్త్విక, విషయమై ప్రశ్న , జవాబుల రూపంలో ఉండే గ్రంథం” అని అర్థం.
భగవద్గీతలోనే (అధ్యాయం 18, శ్లోకం 70) ఇలా ఉంది: “అధ్యేష్యతే చ యం ఇమం ధర్మ్యం సంవాదమావయోః” అంటే ధర్మం తప్పని మన ఇద్దఱి ఈ సంవాదం అని అర్థం. అక్కడ సంవాదం (పరస్పర సంభాషణ లేదా చర్చ) అనే చెప్పబడింది.భగవద్గీత అంటే దేవుడి పాట అన్న తప్పుడు అర్థం స్థిరపడిపోయింది. ఇక్కడ గీత అంటే పాట అని అర్థం కాదు. మహాభారతంలో భగవద్గీత అని లేదు. తరువాతి కాలంలో ఈ పాఠానికి భగవద్గీత అన్న పేరు స్థిరపడింది. భగవత్ అంటే దైవీ, పవిత్రమైన, మహిమాన్వితమైన, విశిష్టమైన అన్న అర్థాలున్నాయి కనుక ఆ అర్థాలతోనూ, కృష్ణ భగవానుడికి సంబంధించినది కనుక ఆ భావంతోనూ భగవత్ – గీతా(త) అని ఈ పాఠం పేర్కొనబడింది. ఆదిశంకరులు వివరణ రాసిన తరువాత భగవద్గీతకు పెను గుర్తింపు వచ్చింది.
అటుపైన ఎంతో, ఎంతో ప్రాచుర్యానికి వచ్చింది. నిజానికి ఆదిశంకరులకు ముందే భగవద్గీతకు వ్యాఖ్యానాలున్నాయి. శంకరుల తరువాత లోకంలో విస్తృతంగా విరాజిల్లుతోంది భగవద్గీత. భగవద్గీతలో40 శాతం మాత్రమే సరిగ్గా చెప్పబడుతోంది. భగవద్గీతను ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఉంది. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు అనాలోచితంగా తప్పుగా పరిగణించబడుతున్నాయి. “చాతువర్ణ్యాం మయా సృష్టం…”, “స్వధర్మాన్ శ్రేయాన్…”, “కర్మణ్యేవాధికారస్తే…” వంటి శ్లోకాలు నిజ అర్థాలకు దూరంగా దోషార్థాలతో చలామణిలో ఉన్నాయి. ఈ స్థితి సరికావాలి. ఎన్నో గీతావాక్యాలకు సరైన, స్పష్టమైన సత్యమైన అర్థాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భగవద్గీతకు సరైన అర్థ వివరణ ఇంకా జరలేదు; అది జరగాలి. 40 శాతం మాత్రమే అర్థం చేసుకోబడ్డ భగవద్గీత ఇంకా, ఇంకా సరిగ్గా అర్థం చేసుకోబడితే అది ప్రపంచానికీ, ప్రజలకు ప్రగాఢమైన ప్రయోజనాన్నిస్తుంది. భగవద్గీతపై ఎప్పుడో వచ్చి ఉండాల్సిన సరైన అవగాహన ఇకపైనైనా రావాలి. భగవద్గీత ఈ విశ్వంలో వచ్చిన, ఉన్న అసమానమైన, మహోన్నతమైన పాఠం.
అది మతిలోకి, మనసులోకి సరిగ్గా ఎక్కాలి. భగవద్గీతను సరిగ్గా చదవుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత అంటే అది కళ్లకద్దుకుంటూ ఇంట్లో పెట్టుకోవాల్సిన పుస్తకం కాదు. బుద్ధితో చదివి ఒంటబట్టించుకోవాల్సిన సత్వతత్త్వం, సత్యతత్త్వం, తత్త్వసత్యం. కళ్లకద్దుకోవడం కాదు భగవద్గీతను బుద్ధికి అద్దుకోవాలి. మానవాళికి అందివచ్చిన భగవంతుడి మహోన్నతమైన సత్యాల తేనె భగవద్గీత. మనుషులందఱూ ఆ తేనెను సేవించి మానసిక ఆరోగ్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి.
“ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్; ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మానః” (భగవద్గీత శ్లోకం 5 అధ్యాయం 6). మనసును (ఆత్మానం) బుద్ధిచేత (ఆత్మనా) తరింపజేసుకోవాలి (ఉద్ధరేత్). మనసును (ఆత్మానం) చెడగొట్టుకోకూడదు (నావాసాదయేత్).కదా? (హి) మనసుకు (ఆత్మనః) బుద్ధే బంధువు (ఆత్మైవ బందుః), మనసుకు (ఆత్మనః) బుద్ధే శత్రువు (ఆత్మైవ రిపుః). మన బుద్ధి మనకు శత్రువు కాకుండా బంధువుగా ఉండాలంటే, మన బుద్ధివల్ల మనం అభ్యుదయాన్ని పొందాలంటే మనకు భగవద్గీత తప్పనిసరి. “నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః; ఉభయోరపి దృష్టోన్తస్త్వనయో స్తత్త్వదర్శిభిః” (అధ్యాయం 2 శ్లోకం 16) (లేనిదానికి) అబద్ధానికి వాస్తవ స్థితి (ఉండడం) అనేది ఉండదు. (ఉన్నదానికి) నిజం అన్నదానికి లేకపొవడం అన్నది ఉండదు.
తత్త్వాన్ని దర్శించిన వారిచేత ఈ రెంటి యొక్క నిశ్చయం దర్శించబడింది. మనం భగవద్గీతను ఆవాహన చేసుకుని, అవగాహన చేసుకుని తత్త్వాన్ని, నిశ్చయీన్ని దర్శించాలి; దర్శిద్దాం. “క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వ య్యుప పద్యతే; క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప” (అధ్యాయం 2, శ్లోకం 3). అధైర్యాన్ని పొందకు అర్జునా ఇది నీకు తగదు. నీచమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి లే శత్రు నాశకుడా. “క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ…నీచమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి లే…” ఇది భగవద్గీతలో తొలి ఉపదేశం. ఈ ఉపదేశం మనలో ప్రతి ఒక్కరికీ. మనం మన హృదయ దౌర్బల్యానికి బలైపోయాం అన్న వాస్తవాన్ని మనం తప్పకుండా గ్రహించాలి.
మనకే కాదు బారతదేశానికి జరిగిన విపరీతమైన నష్టం హృదయ దౌర్బల్యం వల్లే జరిగింది. “నీచమైన హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి మనం లేవాలి; భగవద్గీతను ఊతంగా చేసుకుని మనం లేద్దాం. విదేశీ మతోన్మాదం నుంచి, కులం వ్యాధి నుంచి, కమ్యూనిజమ్ దాడి నుంచి, నక్సలిజమ్ నుంచి, మేధా భ్రష్టత్వం నుంచి, భావ దారిద్ర్యం నుంచి, మానసిక బానిసత్వం నుంచి, వికార మనస్తత్వం నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి నిజ భారతీయతా తత్త్వంతో, నిజ ఆర్ష సత్వంతో భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి భగవద్గీత ఎంతో అవసరం. భగవద్గీతకు సాటిరాగల మఱో కృతి లోకంలో లేనేలేదు; రానేరాదు.
– రోచిష్మాన్ 9444012279

