- భగవద్గీత మతగ్రంథం కానేకాదన్న సువేందు
- గుజరాత్‌లోనూ ఇదే అమలవుతోందని వెల్లడి
- అధికారంలోకి వస్తే సిలబస్ లో చేరుస్తామని హామీ
పశ్చిమ బెంగాల్‌లో తమకు అధికారమిస్తే పాఠశాలల్లో భగవద్గీతను బోధిస్తామని బీజేపీ నేత సువేందు అధికారి హామీ ఇచ్చారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో నిన్న జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తామని అన్నారు. భగవద్గీత మతగ్రంథం కానేకాదని అన్నారు.
గుజరాత్‌లోనూ భగవద్గీతను పాఠశాల సిలబస్‌లో చేర్చినట్టు గుర్తు చేశారు. అక్కడ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చారనీ, ప్రజల ఆశీర్వాదంతో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇది అమలు చేసి తీరుతామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీఎంసీలో ఉన్న సువేందు అధికారి ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో మమతపైనే పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల ఆయన మళ్లీ టీఎంసీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన చాలామంది టీఎంసీ నేతలు ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి వచ్చి చేరారు.