Suryaa.co.in

Political News

ఆమె ఇం’ధైర్యమ్మ’..!

జాతిని ఒక్క త్రాటిపై
నడిపిన ధీరవనిత..
ప్రపంచ దేశాలకే
నాయకత్వం వహించిన
ఉక్కు మహిళ..
నెహ్రూ వారసురాలిగా
రాజకీయ అరంగేట్రం..
బిగిసిన మహామహుల
కుయుక్తుల చట్రం..
పురుషాధిక్యతను త్రోసిరాజంటూ
ఆమె సాగించిన ప్రస్థానం
ఓ చరిత్ర…
ఆధునిక భారతాన
ఆమె ఉనికి సరికొత్త చరిత్ర..!

ఇందిర ఈజ్ ఇండియా..
ఎందరికో ఆమె పేరంటేనే
ఓ చిత్రమైన మేనియా..
చట్టసభల్లో ఆమె ప్రసంగాలకు
అప్పుడప్పుడూ విపక్షాలు సైతం తాలియా..
అలా చెక్కు చెదరని చరిష్మాతో
ఏలలేదా దునియా..

ఆమె గళం మధురం
రూపం సమ్మోహనం
అంతుచిక్కని అంతరంగం
మాట తూటా
అంతకంటే తీవ్రంగా పేలే
రెండో బేటా..
భారతంలో విఫలమైన సంజయ రాయబారం
కొడుకు సంజయుడే
రాజకీయంలో ఇందిరకు
మోయలేని భారం..
ఒక్క చిన్న షాక్ తో
దేశానికి యమర్జెన్సీ షేక్…
అప్పుడే అయ్యాడు
ఈ పిల్ల గాంధీ
పెద్ద ఖల్నాయక్..!

మనిషిని నచ్చితే అందలం..
వైఖరి రుచించకపోతే పాతాళం
చుట్టూ భజన మేళం..
ఆ క్షణానే అనుకూలంగా
మాటాడే ఆమె గళం..
తేడా వస్తే మరుక్షణమే
కక్కేది గరళం..!

దేశంలో సంస్కరణలకు సూత్రధారి..
చిన్న కొడుకు ఆగడాల
అదుపులో గాంధారి..
ఢిల్లీకి రాణి
కోడలిని సాధించడంలో మాత్రం
సాధా”రణ” గృహిణి..
అత్తా నువ్వు యురేకా
అనలేదని మనేకా
ఆమెని ఆడేసింది షకామికా..
ఆమె ఉద్వాసనకు పావులు కదిపేసింది చకాచకా..!

ఇండియాకి
ఆమె ప్రియనాయకి
చాలామందికి ప్రతినాయకి..
తండ్రికి ప్రియదర్శిని..
కొడుకులకు పట్టం కట్టేందుకు
తపించిన ప్రియజనని..
తండ్రి నుంచి వారసత్వంగా పదవిని..పటిమని..
పోరాటాన్ని..పాటవాన్ని..
పొందిన దిగ్గజ వనిత..
ఎందరికో రక్షణ కల్పించి
ఇంకెందరికో శిక్షలు విధించి
ఎన్నో కక్షలు సాధించిన
మహానాయకురాలు
అంగరక్షకుల వేటుకే
బలైన దుఖాంతం..
ఆధునిక భారత ఇతిహాసంలో
అత్యంత విషాద ఉదంతం..!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE