– రాజకీయంగా ఎదుర్కొనలేక ఈడి, ఐటీలతో కేంద్రం దాడులు
– దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబ వారసులు భయపడతారా..?
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నాడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీకి దేశ ప్రజలు అండగా నిలిచినట్లే.. నేడు సోనియా రాహుల్ గాంధీలను ఈడీ నోటీసుల పేరిట వేధిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రజలు అండగా ఉంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదనని, E.D లాంటి సంస్థలను రాజకీయ లబ్ధి కోసం వాడటం దుర్మార్గమని అన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష నాయకుల పై కేంద్రంలోని బిజెపి సర్కార్ ఈడీ ,ఐటీ లతో దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ సోనియా, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేక E. D తో నోటీసులు ఇప్పించిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను గౌరవిస్తేనే.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు అవుతుందని బిజెపికి హితవు పలికారు.
1978 నవంబర్ లో ఇందిరా గాంధీ లోక్ సభకు ఎన్నికైతే అప్పటి అధికారంలో ఉన్న జనతా పార్టీ ఇందిరా గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరించి కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ పేరిట లోక్ సభ నుండి ఎక్స్ పైర్ చేశారని తెలిపారు. అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపితే దేశం మొత్తం తిరగబడి ఇందిరాగాంధీకి అండగా నిలబడిందన్నారు.
1980లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని 350 సీట్లతో గెలిపించి ఇందిరా గాంధీని ప్రధానిని చేశారని, ఇప్పుడు అదే రీతిలో సోనియా, రాహుల్ పట్ల బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే దేశ ప్రజలు సోనియా, రాహుల్ కు అండగా ఉంటారన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మోతిలాల్ నెహ్రు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పై కుట్ర పూరితంగా కేసు నమోదు చేసి సోనియా, రాహుల్ గాంధీలకు ఈడి నోటీసులు ఇప్పిస్తే… దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిర, రాజీవ్ గాంధీ వారసులు భయపడతారా అని ప్రశ్నించారు.
మీరు బయపెడితే ఇక్కడ ఎవరు బయపడరన్న విషయాన్ని బీజేపీ గ్రహించాలి న్నారు. దేశం కోసం మోతిలాల్ నెహ్రూ ఢిల్లీ అలహాబాద్ లో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను దేశానికి రాసిచ్చారని, దేశ సమైక్యత సమగ్రత కోసం ఇందిర, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేశారుని ఇలాంటి కుటుంబానికి E.D నోటీసులు ఇస్తే భయపడతారని బిజెపి భావించడం అవివేకమన్నారు.
చరిత్రను తెలుసుకోకుండ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, గత చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టి, మత విధ్వంసాలు సృష్టిస్తూ, ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న బీజేపీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు