Suryaa.co.in

Telangana

“మహాలక్ష్మి” నిధుల విడుదల పై భట్టి తొలి సంతకం

-రాజీవ్ ఆరోగ్య శ్రీ నిధుల విడుదలకు ఆదేశాలు ఇస్తూ రెండవ సంతకం
-సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు 75 కోట్ల నిధుల మంజూరికి సిఫారసు
-రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి చాంబర్లో ప్రత్యేక పూజలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలను తీసుకొని కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి గ్యారెంటీ పథకానికి సంబంధించి మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీ 374 కోట్ల రూపాయలను ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం లోని రెండవ అంతస్తులో ఆర్థిక శాఖ కార్యాలయంలో భట్టి విక్రమార్క ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ బాధ్యతలను స్వీకరించారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం సౌకర్యానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ పథకం ప్రారంభించారు. అదే విధంగా తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబం కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచారు. ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకానికి నిధులను విడుదల చేస్తూ తొలి సంతకం చేయగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రారంభించిన రెండో గ్యారెంటీ అమలులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు 298 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ఆదేశాలను ఇస్తూ రెండవ సంతకం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న ఈ పథకాలకు నిధులను విడుదల చేస్తూ తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే సంబంధిత ఫైళ్ళపై సంతకాలు పెట్టి భట్టి విక్రమార్క మరో సారి చాటి చెప్పారు. విద్యుత్ శాఖ వివిధ వర్గాలకు అందిస్తున్న సబ్సిడీలకు గాను రూపాయలు 996 కోట్లను విడుదల చేస్తూ సంతకం చేయడం జరిగింది.

ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లకు గాను రూపాయలు 75 కోట్లను మంజూరు చేయడానికి గిరిజన సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలు ఆమోదిస్తూ మరో సంతకం చేశారు. ప్రజల సంపద ప్రజలకు పంచాలన్న లక్ష్యానికి అనుగుణంగా భట్టి విక్రమార్క మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే చేసిన తొలి సంతకాల వల్ల మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, విద్యుత్ సబ్సిడీలు లక్షల మందికి లబ్ధి చేకూర్చనున్నాయి.

ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉదయం 8:21 గంటలకు తన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛనాలు, ఆశీర్వచనాల మధ్య ఆర్థిక ఇందన ప్రణాళిక మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు పుష్పగుచ్చం అందజేసి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, కృష్ణ భాస్కర్, హరిత తదితర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

అదేవిధంగా ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, సంజీవరెడ్డి, బీర్ల ఐలయ్య, డాక్టర్ రాగమయి, మల్ రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, మాజీమంత్రి షబ్బీర్ అలీ తదితరులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.

పూర్ణకుంభం, సన్నాయి మేళాలతో స్వాగతం
ఆర్దిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించడానికి సచివాలయం చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులకు సన్నాయి మేళాల మధ్యన పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్క తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య, తదితర బంధుమిత్రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE