తిరుపతి టీడీఆర్ బాండ్లు కుంభకోణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు తిరుపతి కార్పొరేషన్ వైస్ చైర్మన్ అభినయ్ రెడ్డి, తుడా చైర్మన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వున్నారని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. బుధవారం నిమ్మనపల్లె సర్కిల్ వద్ద తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిడిఆర్ బాండ్లు కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆర్.జే. వెంకటేష్ మాట్లాడుతూ తిరుపతిలో కొన్ని కొత్తవి, మరికొన్ని విస్తరించిన 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి మంజూరు చేశారు. వాటి కోసం సేకరించిన భూములు, ఆస్తుల పేరిట గత రెండేళ్లలో 342 బాండ్లను జారీచేశారు. తిరుపతిలో మొత్తం 2,85,406.56 చదరపు గజాలకు బాండ్లు ఇచ్చారు. ఈ స్థలాలన్నింటినీ కమర్షియల్‌గా చూపించి నాలుగు రెట్లు అధికంగా బాండ్లు జారీ చేశారు.
కరుణాకరరెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ కమిటీలోని సభ్యుల్లో మురళి, పి.అమర్నాథ్రెడ్డికి కూడా బాండ్లు ఇచ్చారు. వారు ఇతరుల భూమికి జీపీఏ తీసుకుని దాని ఆధారంగా బాండ్లు తీసుకున్నారు. ఈ కుంభకోణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీప బంధువులు వుండటం విచారకరం రూ.లక్ష విలువైన టీడీఆర్ బాండ్ ఉంటే 40 నుంచి 45 శాతం ఎక్కువ ధరతో బిల్డర్లు కొంటున్నారు. ఈ కుంభకోణంపై పూర్తి స్దాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు మాజీ సర్పంచ్ నారాయణ, బి.రాజన్న, ప్రతాప్, చెన్నం చలపతి, గౌతమ్, బాలప్పగారి రామస్వామి, కోడి నారాయణ, అంగజాల శ్రీనివాసులు పాల్గొన్నారు.