నేరం జగన్మోహన్ రెడ్డి ఆయన పాలెగాళ్లదైతే శిక్ష ఎమ్మెల్యేలకా?!

-ఎమ్మెల్యేలను మార్చే బదులు జగన్మోహన్ రెడ్డిని మార్చితే సరిపోతుంది కదా??!
-11 మంది ఎమ్మెల్యేలను మార్చి టీజర్ వదిలారు… చాలా చోట్ల రియాక్షన్ వైలెంట్ గా ఉంది
-తెలంగాణలో కేసీఆర్ 9 మందిని తీసివేస్తే అందులో ఏడు మంది గెలిచారని రాష్ట్రం లోనూ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వైకాపా నాయకత్వం వ్యవహరిస్తోంది
-సామాజిక న్యాయం అంటూనే ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పెత్తనం చేస్తున్న ముఖ్యమంత్రి సామాజిక వర్గ నేతలు
-ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని జగన్ మోహన్ రెడ్డి
-మూడు రాజధానుల పేరిట రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు దూరమైన ప్రభుత్వం
-ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంపైర్ల కొరత
-మోడీ సుస్థిర నాయకత్వంలో దేశానికి వచ్చిన ముప్పేమీ లేదు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

నేరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పాలెగాళ్లదైతే శిక్ష ఎమ్మెల్యేలకా? అని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. నిన్నటి వరకు రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారని వైకాపా నేతలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చారని, ఆయన మళ్ళీ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటారని ప్రశ్నించారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… విశాఖపట్నం గత పాలెగాడు విజయ సాయి రెడ్డి, ప్రస్తుత పాలె గాడైనా బాబాయి సుబ్బారెడ్డి భూ కబ్జాల గురించి ఎవరిని అడిగినా చెబుతారు. వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేశారని, దసపల్ల హిట్స్, జోడుగూళ్ల పాలెం, ఆనందపురం జంక్షన్, రోడ్డు అలైన్మెంట్, విస్తరణలో వాళ్లు చేసిన భూకబ్జాల గురించి ఏ ఆటో డ్రైవర్ ను కదిపిన కథలు, కథలుగా చెబుతారన్నారు.

విశాఖపట్నం ప్రాంతంలో ఒక్క స్థానం కూడా గెలవకుండా విధ్వంసం సృష్టించింది అక్కడి పాలెగాళ్లయితే, దానికి ఎమ్మెల్యేలను మారుస్తామనడంలో అర్థం ఉందా అని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు . శ్రీకాకుళంలో స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంచి పేరు లేదని ఆయన్ని తీసివేస్తారన్న ప్రచారం కొనసాగుతోంది. ఏ ప్రాంతం చూసినా రాయలసీమ పాలెగాళ్లే పెత్తనం చలాయిస్తున్నారు. ఇసుక దోచుకున్న వారిని, మద్యం లో సొమ్ము చేసుకున్న వారిని టచ్ చేశారా అంటే, టచ్ చేయలేదు. కేవలం ఎస్సీ, బీసీ వర్గాల వారిని మాత్రమే బలి చేశారు. ఎన్నికలకు ముందు మద్యం నిషేదిస్తామని చెప్పింది ఎవరు?

నాలుగేళ్లలో ఫైవ్ స్టార్ హోటల్ లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచుతామని గొంతు చించుకొని అరిచిన జగన్మోహన్ రెడ్డి, అలా చేయకపోతే ఓట్లే అడగనని చెప్పారు. ప్రజలు గుడ్డిగా ఆయన్ని నమ్మారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పిన లెక్కల ప్రకారం నాసిరకమైన మద్యం సేవించి, రాష్ట్రంలో ఐదు లక్షల మంది మృత్యువాత పడ్డారన్నారు . మామూలుగా అయితే, ఎప్పటినుంచో మద్యం సేవిస్తున్న వారు 20 నుంచి 25 వేల మంది చనిపోయి ఉండేవారు. పాత మద్యం పాలసీని యధావిధిగా కొనసాగించి, అవే బ్రాండ్లను కొనసాగించి ఉంటే ఇంతమంది మృత్యువాత పడి ఉండేవారు కాదు. తొకడ బ్రాండ్లను ప్రవేశపెట్టి మద్యం సేవించే వారి ఒక్కొక్క కుటుంబం నుంచి ఏటా 60 వేల రూపాయలను దోచుకున్నారు. రాష్ట్రంలో 33 శాతం జనాభా నిత్యం మద్యం సేవిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ 33 శాతం మంది జనాభా కుటుంబ సభ్యులు నేనున్న ప్రస్తుత పార్టీకి ఓటు వేసే అవకాశం లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎమ్మెల్యేలను మార్చాలా?, జగన్మోహన్ రెడ్డిని మార్చాలా? అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలో సిపిఎస్ ను రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీనితో ఉద్యోగులు మురిసిపోయారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని మించిపోయాడని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్ రద్దు పై సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లవాడు ఏదో తెలియక మాట్లాడారని వక్ర భాష్యాన్ని చెప్పారు.

సిపిఎస్ రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేమని, ఉద్యోగులకు సమాజంలో ఉన్న వ్యక్తులకు మధ్య వైరాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేశారు. చివరకు ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి రిక్త హస్తం చూపెట్టారు. రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగులు ఉంటారనుకుంటే, ప్రతి కుటుంబంలో సుమారుగా ఐదు మంది చొప్పున వేసుకున్న, 50 లక్షల మంది ఈ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి అయితే, ఎమ్మెల్యేలకు ఏమైనా సంబంధం ఉందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దీనితో ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెల్లు బికుతోంది . ఎర్రగొండపాలెం లో మంత్రి సురేష్ పోటీ చేసిన నెగ్గరనే సర్వే ఫలితం వస్తుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన కూడా అదే ఫలితం పునరావృత్తమవుతుంది.

తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి, సురేష్ కు శిక్ష విధిస్తానని అనడం ఇదెక్కడి న్యాయమని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య 33% అంటే, వారి సంఖ్య కోటిన్నర. వాళ్ల భార్యలతో కలుపుకుంటే మూడు కోట్లు. ఈ మూడు కోట్ల ఓట్లు గయా.. అని అన్నారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేదని చెబితే … మంత్రి రోజాతో పాటు అందరూ ఆయన్ని సమర్ధించారు. నాలుగేళ్ల క్రితం మూడు రాజధానుల పేర్లు చెప్పి మూడు ప్రాంతాల ప్రజలను మోసం చేశారు. అమరావతిని కాదని మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం పట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం. విశాఖపట్నం వస్తానంటే అక్కడి ప్రజల్లో గుబులు మొదలయ్యింది.

అమెరికాలో ఉన్నవారు కూడా స్వదేశానికి విచ్చేసి, తమ స్థలాలు ఎక్కడ కబ్జాకు గురవుతాయోనని ప్రహరీ గోడలను నిర్మించుకొని ఇక్కడే ఉంటున్నారు. విశాఖపట్నం మకాం మారుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడంతో రాయలసీమ ప్రాంత ప్రజలు, తాము సచివాలయానికి వెళ్లాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వస్తుందని భావించారు. న్యాయ రాజధాని పేరిట కర్నూల్లో కోర్టు భవనాన్ని కట్టి చేతులు దులుపుకుంటారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తుంది. మూడు రాజధానుల నిర్ణయంతో మూడు ప్రాంతాల ప్రజల దృష్టిలో పనికిమాలిన వ్యక్తిగా ముఖ్యమంత్రి మారిపోయారు. మూడు రాజధానుల నిర్ణయం ముఖ్యమంత్రిది అయితే, ఎమ్మెల్యేలకు శిక్ష వేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రివర్స్ టెండ రింగ్ పేరిట తమకు నచ్చిన వ్యక్తికి పనులను కట్టబెట్టి ప్రాజెక్టును అధోగతి పాలు చేశారు.

గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్ ను తొలగించి, రివర్స్ టెండరింగ్ పేరిట తమకు కావలసిన వ్యక్తికి పనులు ఇచ్చింది ముఖ్యమంత్రి అయితే, ఎమ్మెల్యేలపై అప్రతిష్ట మోపడం ఎంతవరకు కరెక్టు అని నిలదీశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రభుత్వ వ్యతిరేకత సర్వేలలో స్పష్టంగా కనిపిస్తోంది. తప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తే… ఎమ్మెల్యేలకు శిక్ష విధిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకొని, నెల్లూరు జిల్లా వరకు పట్టుమని పది స్థానాలు వచ్చే పరిస్థితి నా ప్రస్తుత పార్టీకి లేదు. ఎంతమందిని మార్చిన ఉపయోగం లేదు. చేతులు కాలాక, ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యేలను బలి చేయడం అన్నది సరైన విధానం కాదు.

ముఖ్యమంత్రి ఆయన పాలెగాళ్లు దోచుకొని దాచుకున్నారు. అందులో కాస్తో, కుస్తో దోచుకున్న ఎమ్మెల్యేలు నైనా మార్చారా అంటే అదీ లేదు. అమాయకులైన మంత్రులు విడుదల రజిని, ఆదిమూలపు సురేష్ లను మారుస్తారా ఇదెక్కడి న్యాయం. ఎమ్మెల్యేలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదు. ఎమ్మెల్యేలను మార్చిన చోట ఎమ్మెల్సీ ఇస్తానని వారికి చెబుతున్నారట. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలంటే ప్రభుత్వం అధికారంలోకి రావాలి కదా అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సీతక్కను తన సోదరిగా పేర్కొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు కీలకమైన మంత్రిత్వ శాఖ కట్టబెట్టారు.

ప్రేమ, సౌబ్రాతృత్వం అంటే అది. నీకోసం అహర్నిశలు కష్టపడి, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన చెల్లిని, బైబిల్ చేత పట్టుకొని తిరిగిన బావను, తల్లికి కూడా సేవ చేయలేని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారనుకోవడం అత్యాశే అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు . వైకాపా ఎంపీలు, లోక్ సభ టికెట్ మాకొద్దంటే మాకొద్దంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎటువంటి తప్పు చేయని ఎంపీలను, ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన పాలెగాళ్ల మాత్రమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఒకచోట రద్దయిన వారు మరొక చోట చెల్లుతారా?
ఒకచోట రద్దయిన వారు, మరొకచోట చెల్లుతారా?, ఎర్రగొండపాలెంలో రద్దయిన సురేష్, కొండెపిలో ఎలా చెల్లుతారు?, చిలకలూరిపేటలో రద్దయిన రజిని, గుంటూరులో ఎలా చెల్లుతారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రజిని, సురేష్ ప్రతిభ పాట వాలపై నేనేమీ వ్యాఖ్యానించదలచుకోలేదు. ముఖ్యమంత్రి, సకల శాఖ మంత్రి సజ్జన రామకృష్ణారెడ్డి ప్రతిభాపాటవాలపై నేను కామెంట్ చేస్తున్నాను. వేమూరులో పనికిరాకుండా పోయిన నాగార్జున, వేరేచోట ఎలా చెల్లుతారో చెప్పాలంటూ నిలదీశారు. చెల్లటం అంటూ జరిగితే ఎక్కడైనా చెల్లుతారన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంగా ప్రజలు భావిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను మార్చితే ఉపయోగం ఏమిటి… ముఖ్యమంత్రిని మార్చాలని విజయవాడ నుంచి ఒక మైనారిటీ సోదరుడు ఫోన్ చేసి చెప్పారు.

ఫ్యాన్ బేరింగులు కండెన్సర్ కాదు మార్చాల్సింది… ఫ్యానే మార్చాలని చెప్పారు. నాకున్న సమాచారం ప్రకారం 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో 75 అసెంబ్లీ స్థానాల్లో 20 మందికి స్థానచలనం, 50 మందికి స్థానభ్రంశం కలిగే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇప్పటికే 11మందిని మార్చి టీజర్ వదిలారు. చాలా చోట్ల వైలెంట్ గా రియాక్షన్స్ వచ్చాయి. కొన్నిచోట్ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. రేపల్లె ఇన్చార్జిగా సౌమ్యుడైన మోపిదేవి వెంకటరమణ నియమించారు. ఇప్పుడు ఆయన్ని మార్చడం పట్ల 169 మంది ఎంపీటీసీలు సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

రేపల్లెలో మోపిదేవి వెంకటరమణకు కాకపోతే, ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మత్స్యకార,దాని ఉప కులాల ప్రజలు ఆయన్ని అంత అమితంగా ప్రేమిస్తారు. ఒకవైపు సామాజిక న్యాయం అంటూనే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో పెత్తనం చేస్తుంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నాయకులేనని రఘు రామ కృష్ణం రాజు విమర్శించారు . నా ఎస్సీలు నా బీసీలు అని పేర్కొనే ముఖ్యమంత్రి, ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలను వారికే కేటాయించాల్సిందే కదా అంటూ, దానికి ఏదో తాను ఎస్సీలకు ఎస్టీలకు మేలు చేసినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 మంది అభ్యర్థులను తొలగించి ఎన్నికలకు వెళ్తే ఏడు మంది నెగ్గారని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా రాష్ట్రంలో వైకాపా నాయకత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.

ఆడుదాం ఆంధ్ర పేరిట విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు. మార్చిలో విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయని, ఫిబ్రవరిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వారిని బలవంతంగా పాల్గొనాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి తొలుత 40 కోట్ల రూపాయలు అన్నారు. ఆ తర్వాత 90 కోట్లని చెప్పి ఇప్పుడు 130 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెంచారు. ఎన్నికల తర్వాత ఎలాగా వచ్చేది లేదని, ఇప్పుడు అందిన కాడికి దండుకోవాలని చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, వారిని ఉత్తేజపరచడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు పబ్లిసిటీ స్టంట్ మాదిరిగా ఆడుదాము ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఒకవైపు మైదానాలు లేకపోగా, వాలీబాల్స్ కూడా లేవు.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి అంపైర్లు దొరకడం లేదట. అంపైర్లుగా పదవ తరగతి పాసైన ఇళ్లల్లో కన్నాలు వేసే వాలంటీర్లు వ్యవహరించరున్నారట. క్రీడల్లో వారికి ఎటువంటి ప్రావీణ్యత లేకపోయినా, అంపైరింగ్ లో శిక్షణ ఇచ్చి, వారే అన్ని క్రీడలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే వెసులు బాటు కల్పించనున్నారట. కబడ్డీలో న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించడం సులువే. కానీ క్రికెట్ వంటి క్రీడలో వాలంటీర్లు ఎలా అంపైర్లుగా వ్యవహరిస్తారు. అంపైరింగ్ చేయాలంటే పెద్ద పెద్ద స్క్రీన్లు అవసరమని, లక్షల స్క్రీన్ లను జగన్మోహన్ రెడ్డి ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి విద్యార్థులను ప్రాక్టీస్ కు పంపించకపోతే తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కట్ చేస్తామని వాలంటీర్లు హెచ్చరిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యేలకు పోటీలు నిర్వహించాలన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కరాటే లో ప్రావీణ్యం చూపబోయి, నెత్తి కాల్చుకున్న వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు.

మోడీ నాయకత్వంలో దేశం సుస్థిరం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సుస్థిరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్లమెంట్లో గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు దూకి ఎంపీలు కూర్చున్న ప్రదేశానికి చేరుకున్న ఘటనపై ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారన్నది త్వరలోనే తేలనుందని చెప్పారు.2001 డిసెంబర్ 13 మృతులకు నివాళులు అర్పించిన రోజే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply