– శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి కొడాలి నాని
– జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతకు ఘన సత్కారం
గుడివాడ, సెప్టెంబర్ 1: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా రూ. 8 లక్షల వ్యయంతో చేపట్టే పర్మినెంట్ ఐరన్ పందిరి నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీ కొండాలమ్మ దేవస్థానానికి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానం అవుతోందని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా శ్రీ కొండాలమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు. అలాగే దసరా పండుగ నాటికి పర్మినెంట్ ఐరన్ పందిరి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు . దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రధాన రహదారిపై 60 అడుగుల పందిరి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నవరాత్రి ఉ త్సవాల్లో భాగంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఆలయంలో మంచినీటి ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కొండాలమ్మ దేవస్థానానికి రంగులు వేసి చాలా కాలం అయిందని, వచ్చే దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూ. 5 లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. దసరా నాటికి అమ్మవారి ఆలయం రంగులతో కళకళలాడుతుందన్నారు. ఆలయంలో పాల పొంగళ్ళ భవనం అసంపూర్తిగా నిర్మించారని , దీన్ని కూడా వచ్చే దసరా నాటికి పూర్తి చేయాలని చెప్పారు. దాతల సహకారంతో ఆలయానికి గ్రిల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే శ్రీ కొండాలమ్మ దేవస్థానం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని మంత్రి కొడాలి నాని తెలిపారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలతను శేషవస్త్రాలతో మంత్రి కొడాలి నాని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, ఆలయ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు శాయన రవికుమార్, నాయకులు పాలేటి చంటి, తెన్నేరు ప్రభాకర్, శేషం గోపి, దుగ్గిరాల శేషుబాబు, మన్నెం చంటి, పడమట సుజాత, బాడిగ నాని, అల్లూరి ఆంజనేయులు, సతీష్ రెడ్డి, హరనాథ్ రెడ్డి, షేక్ బాజి, ఆలయ కార్యనిర్వహణాధికారి షణ్ముగం నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.