-డిస్మిస్ ప్రయత్నాలకు కేంద్రం నో
-ఇంక్రిమెంట్ల రద్దుకు ఓకే
-ఏపీ సీఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ
ఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని UPSC తోసిపుచ్చింది. అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్ర హోంశాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. చర్యల్లో భాగంగా వెంకటేశ్వరరావు ఇంక్రిమెంట్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ చర్యలను క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయనున్నారు.
కాగా ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ గతేడాది పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు తప్పుకున్నారు. తగిన బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ ఫైల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ముందు ఉంచాలన్నారు. ఈ పిటిషన్‌పై గతంలో మరో న్యాయమూర్తి విచారణ జరపగా.. హైకోర్టులో తాజాగా రోషర్ మారడంతో ఈ పిటిషన్ జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు పరిధిలోకి వచ్చింది. పిటిషనర్ తరపు లాయర్.. అత్యవసర విచారణ జరపాలని కోరగా.. తాను విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జడ్జి ప్రకటించారు. గతేడాది మార్చి 18న ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీవీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.