త్రిదళాధిపతి రావత్ సాహసం అసామాన్యం

త్రిదళాధిపతి రావత్ సాహసం అసామాన్యం

– ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకునేలా రావత్ చరిత్ర
– రావత్ దంపతుల పార్ధివ దేహానికి పుష్పాంజలి ఘటించిన బండి సంజయ్
– వీర సైనికుల, తెలుగు తేజం సాయితేజ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
హెలికాప్టర్ దుర్ఘటనలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల పార్థీవ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డితో కలిసి బిపిన్ రావత్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్ సీడీఎస్ రావత్ దంపతుల భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ దుర్ఘటనలో అశువులు బాసిన వీర సైనికులకు బండి సంజయ్ ఘన నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ దుర్ఘటనలో దుర్మరణం పొందిన తెలుగు తేజం, రావత్ టీం సభ్యుడు బి.సాయితేజను ప్రత్యేకంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘దేశ రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న బిపిన్ రావత్ గొప్ప వీరుడు. రావత్ తోపాటు గొప్ప దేశభక్తితో సేవలందిస్తున్న వీర సైనికులను వీర సైనికులను కోల్పోవడం చాలా బాధాకరం.’’అని తెలిపారు.
‘‘బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. శత్రు దేశాలనుండి భారత్ ను రక్షించే క్రమంలో ప్రత్యేక పంథాను కొనసాగిస్తూ సేవలందిస్తున్న వీర సైనికుడు బిపిన్ రావత్.రావత్ ప్రతిభాపాటవాలు, సాహసాలు చూసి ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటున్నయ్. ’’ అని పేర్కొన్నారు.
‘‘రావత్ వంటి దేశ భక్తులకు పునర్జన్మ ఇవ్వాలని నేను పూజించే అమ్మవారిని ప్రార్థిస్తున్నా. రావత్ దేశభక్తిని, చరిత్రను, ప్రతిభాపాటవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి బాటలో నడవాలని కోరుకుంటున్నా.’’ అని ఆకాంక్షించారు.
‘‘రావత్ తోపాటు వీరమరణం పొందిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూర్చాలని అమ్మవారిని కోరుకుంటున్నా. ఈ ఘటనలో దుర్మరణం పొందిన తెలుగు తేజం బి.సాయితేజ సేవలు చిరస్మరణీయం. ఆ కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నా. ఈ విషాదం నుండి త్వరగా బయటపడేలా వీర సైనికుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని ఈ భగవంతుడిని ప్రార్ధిస్తున్నా.’’ అని తెలిపారు.