Suryaa.co.in

Features

క్షత్రియ జాతి పుట్టుక

చరిత్ర / పురాణాలు
క్షయము నుండి కాపాడువాడు క్షత్రియుడు
వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించుటయే రాజధర్మం
క్షత్రియులు ఇవ్వవచ్చును- యాచింప రాదు

అద్వితీయమైన అవ్యక్త పరమాత్మ తన మాయా శక్తిచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగను నానా తత్వముతో కూడిన జగత్తుగను వ్యక్తమవుతాడు. ఆ పరమాత్మను దర్శించడం మానవుని పరమలక్షణం. ఆ పరమాత్మయే సకల చరాచర సృష్టిని దాని యెక్క స్థితి, లయలను నిర్వహిస్తూ, అనేకరూపాల్లో అవతరిస్తూ పరిపాలిస్తూ ఉంటాడు.

ఆ సృష్టి లో దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు, స్థిరములు (కదలనివి) అనబడే నాలుగు జీవ రాశులు ఉన్నవి. వాటిలో స్త్రీ పురుష భేదములు, సత్వ రజో తమో గుణ స్వభావ భేదములు ఏర్పడినవి.
మొదట ప్రపంచం లో ఇన్ని వర్ణములు లేవు. అంతయు బ్రహ్మ మయమే కనుక. అందరూ బ్రాహ్మణులు గానే ఉండిరి.

కృతయుగ అంతమున అంటే త్రేతాయుగం ప్రారంభం కంటే ముందు మానవ జాతి ప్రవర్తనను క్రమబద్దం చేయడానికి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఆశ్రమ ధర్మాలు, సత్వగుణ ప్రధానులను బ్రాహ్మణులుగాను, రజోగుణ ప్రధానులను క్షత్రియులుగాను, తమోగుణ ప్రధానులను వైశ్య , శూద్రులుగాను వర్ణ విభజన చేయబడినది.

వారి మనుగడకు ధర్మార్థకామమోక్షము లనబడే నాలుగు పురుషార్థములు నిర్ధేశించబడినది. ఆ పురుషార్థములు సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని భగవానుడే మానవాళికి అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా వేదాలను వెలువరింపజేశాడు. ఈ పరిణామక్రమంలో 4 వేదాలు, 4 యుగాలు, 4 వర్ణాలు (కులాలు) గా ఏర్పడడం గమనార్హం.

ఆ దేవదేవుడు క్రమంగా కాలానుగుణముగా వరాహ, నరసింహ, నారాయణ, కపిల, దత్తాత్రేయ, ఋషభ, మత్స్య, కూర్మ, వరాహ, శ్రీరామ కృష్ణా దులిరువులు క్షత్రియులుగా అవతారమేత్తి రాజ్య పాలన సాగించి సత్యాన్ని ధర్మాన్ని కాపాడి ఆదర్శ పురుషులుగా దేవుళ్ళుగా పూజింపబడిరి.కానీ ఇతర అవతారములు ఏదో ఒక కార్యార్థము కొరకు ముగించబడినవి.

కల్పాదిలో సృష్టి ప్రారంభమున లోకమంతా జలమయమై ఉండెను. అందునుండి భూమండలం ఏర్పడేను. పిమ్మట ఆకాశ స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నుండి స్వయంభువు అయిన బ్రహ్మ దేవుడు దేవతలతో కూడి ఆవిర్భవించెను. ఆయన నుండి మరీచి, అత్రి, వశిష్ఠల తో సహా నారదుడు మొదలగువారు ఉద్భవించిరి. మరీచి ఆయన భార్య కళకు కశ్యపుడు జన్మించెను, కశ్యప ప్రజాపతి – సూర్యుడు కుమారుడుగా జన్మించెను. సూర్యుడు- సంజ్యలకు వైవస్వత మనువు జన్మించెను. ఆ మనువు సుతుడే ఇక్ష్వాకు ఆయన అయోధ్యకు మొదటి ప్రభువయ్యెను.

వీరి వంశంలో పుట్టిన వారే వికుక్షి-. భానుడు- అణరణ్యుడు- పృదువు- త్రిశంకు – దుందుమారుడు – యవనాశ్వుడు- మాంధాత- సునంది- ద్రువసంది- భరతుడు- ఆశితుడు- సగరుడు- అసమంజుడు- అంశుమంతుడు- దిలీపుడు- భగీరతుడు- కుకుతస్థుడు- రఘువు- కల్మశపాదుడు – సౌధాముడు- శ్యంఖనుడు- సుదర్శనుడు- అగ్నివర్ణుడు – శ్రీ గ్రుడు- మరువు- ప్రశుశుక్రుడు- అంబరీషుడు- నహుషుడు- యయాతి- నభాగుడు- అజుడు- దశరథుడు – శ్రీరాముడు.

వైవస్వత మనువుకు అనేకులు తనయులు, వారి లో వైవస్వత మనువు ప్రసిద్ధుడు, సరిష్యoత, ద్రిష్ట యనువారల సంతతియూ మత బోధకులై బ్రాహ్మణులైరి. వైవస్వత మనువు తనయులగు సారనుడు మొదలగు 12 గురు వింద్యా, అనార్త (గుజరాత్), ఉత్కళ (ఒరిస్సా) , విశాల(మాలవ), మొదలగు ప్రదేశము లకు అధిపతులైరి. కరుశ మొదలగు 46మంది సోదరులు హిమవత్పర్వత ఉత్తరా పదమునకు ప్రభువులైరి.

వారిలో 27గురు తూర్పునకు, 13గురు పడమటి భాగమునకు ప్రభువులైరి. ఇక్ష్వాకు కుమారుడు వికుక్షి దేశ బహిష్కరణ గావింపబడి మిథిలా నగరానికి చేరెను. వికుక్షి మిథిలా నగరమునకు రాజు అయ్యెను. ఇక్ష్వాకు వంశంలో దండ యను రాజు దక్షిణపదమునకు రాజు అయ్యెను. వికుక్షీ-నిమి పుత్రికను చంద్రుడు వివాహమాడెను.

క్షయము నుండి కాపాడువాడు క్షత్రియుడు. రాజ్యాన్ని పరిపాలించే వానిని రాజులనడం పరిపాటి. వేద వచనాన్ని బట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించుటయే రాజధర్మం. రాజు లేకపోతే ప్రపంచం గతి తప్పుతుంది. అందుచేత రాజు బలవంతుడుగా ఉండాలి. జగత్తును రక్షిoచడానికి ఇంద్రుడు, చంద్రుడు, వాయువు, యముడు , సూర్యుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు యొక్క అంశాలను గ్రహించి రాజును స్ప్రుజించెను.
క్షత్రియులు దాన స్వీకారం మినహా , మిగిలిన విప్ర ధర్మాలతో పాటు అదనంగా ప్రజా పాలనం, దోషి దండన, పన్నులు వసూలు చెయ్యాలి. ధైర్యం, శౌర్యం, దాన గుణం, ధర్మ నిష్ట, రక్షణ ,ఆచార్యసేవ, కళాపోషణ, దైవఆరాధన కలిగి ఉండుట క్షాత్ర ధర్మం.

క్షత్రియులు ఇవ్వవచ్చును- యాచింప రాదు.
యజ్ఞ యాగాదులు చేయవచ్చును – చేయింపరాదు.
మానవులలో క్షత్రియులకన్న అధికులు మరెవ్వరులేరు. అందుచేత రాజసూయ యాగం లో క్షత్రియులని పైన కూర్చుండ బెట్టి బ్రాహ్మణుడు క్రింద కూర్చుని పూజింతురు.
క్షాత్ర తేజం పురాణయుగములలో రెండు పాయలుగా చీలినది. అవే సూర్య, చంద్ర వంశంములు. మూల పురుషులు వైవశ్వత మనువు మరియు పురూరవుడు.

ఇది సూర్యవంశం యొక్క పుట్టుక.
ఇప్పుడు చంద్రవంశం పుట్టుక గురించి, బ్రహ్మమానస పుత్రుడైన అత్రి మహాముని కి – అనసూయకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, మహేశ్వరుల అంశతో దుర్వాసముని పుత్రులుగా జన్మించారు. చంద్రుడు ఇశ్వాకు కుమారుడైన
వికుక్షీ (నిమిచక్రవర్తి ) పుత్రిక నిమిని ఇంకా దక్షుని 27 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు, ఇంకా చంద్రునకు – తారకు అంటే దేవ గురువు భార్యకు బుధుడు జన్మించాడు. సూర్యవంశం రాజు శ్రాద్ధదేవుడు పుత్రిక ఇళను ప్రేమించి పెళ్లాడి ఆమె యందు పురురవుడను కుమారుని పొందాడు. ఈతడు
చంద్ర వంశమునకు మొదటి ప్రభువు అయినాడు. పురురవునికి ఊర్వశికి 6 గురు పుత్రులు కలిగారు. వీరి ద్వారా చంద్రవంశం విస్తరించినది.

చంద్రవంశమునకు చెందిన రాజులు, పురురవుడు – కుశాoబుడు – గాది – విశ్వామిత్రుడు – నహుషుడు – యయాతికి, దేవయానికి యదువు మరియు తుర్వసుడు – యయాతికి, శర్మిష్టకు పూరువు- హస్తి- ప్రధీపుడు- శంతనుడు, మత్స్యగంధి కి విచిత్ర మరియు చిత్రవీర్యులు – ధృతరాష్ట్రుడు, పాండురాజు.

పురూరవుని వంశంలో గాధి మహారాజుకు సత్యవతి అనే పుత్రికను భృగు వంశపు బ్రాహ్మణుడైన ఋచీకుడు వివాహమాడినాడు. గాధి మహారాజుకు మగ సంతానం లేరు . గాధి మహారాజుగారి భార్య, కూతురు ( ఋచీకునీ భార్య ) పుత్రుడు పుట్టె క్రతువు చెయ్యమని ఋచీకుని కోరినారు.

ఋచీకుడు క్షాత్ర మంత్ర బలంతో అత్తగారికి, తన భార్యకు బ్రాహ్మణ మంత్ర బీజముతో తన భార్య గురించి ఇద్దరికి రెండు ప్రసాదం దొప్పలను తయారు చేసి వుంచి నిత్య కర్మలను చేయడానికి నదికి వెళ్ళారు. అత్త గారు తన కుమార్తె యొక్క ప్రసాదం తినినది, అత్త యొక్క ప్రసాదం కుమార్తె తినివేసినది.

ఋచీకుడు వచ్చి మార్పును తెలుసుకొని భార్యపై కోపించగా ఆమె ప్రాధేయపడగా మంత్రం మార్పు చేయగా ప్రస్తుతం మనకు సాత్వికుడైన కుమారుడు, తరువాత మన పుత్రునకు క్షాత్ర గుణముతో ఘోర స్వభావుడైన మనుమడు పుడతాడు, అనగా ఆమె తృప్తి చెందినది. గాధి మహారాజుగారి భార్యకు విశ్వామిత్రుడు, కూతురుకు అంటే ఋచీకునికి జమదగ్ని జన్మించారు.

విశ్వామిత్రుడు కొంత కాలం రాజ్య పాలన సాగించి తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు. విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయ మహారాజు పేరు మీద ధనుంజయ గోత్రం పుట్టింది.
జమదగ్ని మహర్షి సూర్యవంశం రాజు అయిన రేణు మహారాజు కూతురు రేణుకాదేవినీ వివాహమాడినాడు. రేణుకాదేవికి.పరశురాముడు జన్మించాడు. అతడు క్షత్రియ ద్వేషి గా క్షత్రియవంశ నాశకునిగా ప్రసిద్ధికెక్కినాడు. ఒక నాడు చంద్రవంశం రాజు కార్త్యావీర్యుడు వేటకు వెళ్లి ఆకలితో జమదగ్ని ఆశ్రమంలోనికి ప్రవశించగానే మునీంద్రుడు సకలపరివారానికి
భోజనం పెట్టడం రాజు ఆశ్చర్యపోయి అది అంతా ముని వద్ద నున్న కామధేనువు ప్రసాదించినట్లు తెలుసుకొని మునిపై అసూయ చెందాడు. ఆ కామధేనువును తోలుకుని రమ్మని భటులను ఆజ్ఞాపించాడు. వారు బలవంతముగా లాక్కొని పోయినారు. పరశురాముడు విషయం తెలుసుకొని ఉగ్రుడై కవచం, గండ్ర గొడ్డలి, విల్లంబులు ధరించి సింహంలా లంఘించి కార్త్యావీర్యుని వెయ్యి చేతులను, శిరస్సును ఖండించి వేశాడు.

అతని పదివేల మంది పుత్రులు పారిపోయారు. పరశురామునిపై పగ తీర్చుకోవాలని పొంచి కార్త్యావీర్యుని పుత్రులు ఒకనాడు ఆశ్రమం లో ఏకాంతంలో తపస్సు లో నున్న జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించి, భయపడి పారిపోయారు. నిస్సహాయ అయిన రేణుకాదేవి భర్త శరీరం మీద బడి రోదిస్తూ 21 మారులు గుండెలపై బాదుకోవడం పరశురాముడు గమనించి, అన్నలతో ఇలా అన్నాడు తండ్రి గారి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుమని చెప్పి పిమ్మట కార్త్యవీర్యుని పుత్రులందరిని తన గండ్రగొడ్డలికి ఆహుతి చేసి హతమార్చి వచ్చి తండ్రిని మంత్ర బలంతో బ్రతికించుకుంటాడు,
అయినా అతని కోపం చల్లారలేదు. భూమి మీద క్షత్రియుడేవ్వడుయుండ రాదని ప్రతిన పూనగా రేణుకాదేవి కుమారునితో నాయనా పరశురామా, యజ్ఞములు , వ్రతములు చేయు ధర్మపరులను, పిల్లలను, స్త్రీలను క్షమించమని వేడుకుంటూ, వారిని వదిలివేయమని చెప్పినది. ఆ తరువాత పరశు రాముడు 21 మారులు భూమండలం అంతా గాలించి అధర్మపరులైన క్షత్రియులను అంతం చేశాడు.

పరశురాముడు తల్లికి ఇచ్చిన మాట కోసం సూర్యవంశంలో దశరథుని, చంద్రవంశంలో కార్త్యవీర్యుడి 5 గురు పుత్రులను ఇంకా సూర్య చంద్ర వంశములలోని ధర్మ పరులను పిల్లలను, స్త్రీలను చంపకుండా వదలి వేశాడు. పరశురాముని నర మేధం లో భర్తలను కోల్పోయిన స్త్రీలు సతీ సహగమనం చేయగా, వీరి పిల్లలు ఋషి మునుల వద్ద విద్య నభ్యసించిరి.

విద్యనభ్యసించిన క్షత్రియ కుమారులు వారి గురువుల పేరులనే గోత్రములుగా స్వీకరించారు. అట్టి గోత్రములుగలిగిన క్షత్రియులందరిది విద్యా వంశం. ఈ క్షత్రియ కుమారులు సూర్యుని పూజించేవారు సూర్యవంశం అని, చంద్రుని పూజించే వారు చంద్రవంశం అని చెప్పుకొనుట త్రేతాయుగం అంతంలో మొదలైనది.

అది పరశురాముడు క్షత్రియులను నాశనం చేసిన తర్వాత ఇలా చాలా గోత్రములు వచ్చినాయి. అంతకు పూర్వం సూర్యవంశమునకు, కశ్యప మహర్షి గోత్రం, చంద్రవంశమునకు ఆత్రేశ గోత్రం ఉండేది. వీరిది జన్మ వంశం. ఇలా జన్మ వంశం, విద్యా వంశం మొదలైనది.

పరశురాముడు భూమండలం మీదనున్న క్షత్రియులను వధించక పూర్వం సూర్యవంశమునకు కశ్యప మహర్షి గోత్రం, చంద్రవంశమునకు అత్రి మహర్షి గోత్రం ఉన్నట్లు వాల్మీకి రామాయణం, వేదవ్యాసుడు వ్రాసినమహాభారతం, భాగవతం ద్వారా తెలియుచున్నది. ఈ రెండు గోత్రములు వారిది జన్మ వంశం . పూర్వము త్రేతాయుగం అంతం వరకు ఈ రెండు గోత్రముల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లు పురాణముల ద్వారా తెలియుచున్నది. కశ్యపునకు సూర్యుడు పుట్టెను కాబట్టి కశ్యప గోత్రికులది సూర్యవంశం. అత్రిమహర్షి కుమారుడు చంద్రుడు కావున అత్రేశ గోత్రికులది చంద్ర వంశం.
మన దేశంలో క్షత్రియులకు 32 ఋషి మునుల గోత్రములకు పైగా ఉన్నట్లు తెలియుచున్నది.
పై రెండు గోత్రములు కాక మిగతా క్షత్రియుల గోత్రములు విద్యావంశం అని మన పురాణముల ద్వారా ఇది నిజమని తెలియుచున్నది. కృత,త్రేతా,ద్వాపర యుగాలు జరిగిపోయినవి. ఇప్పుడు జరుగుచున్నది కలియుగం. దక్షిణ భారత దేశంలో వాడుకలో ఉన్న గోత్రాలు, కశ్యప, ఆత్రేశ, ధనుంజయ, గౌతమ, భరద్వాజ, పశుపతి, వశిష్ట, కౌoడీన్యస, విశ్వామిత్ర, శ్రీవత్స, హరితస్య, నాగఋషి, వర్షముని, జమదగ్ని, దుర్వాస మహాముని.

రాయలసీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాలలో తమిళనాడు, కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఒక వర్గం క్షత్రియులు కశ్యప, అత్రేశ గోత్రికులను సూర్యవంశం రాజులుగా పిలుచుకుంటున్నారు. ఒక వర్గం రాజులు లైన ధనుంజయ, పశుపతి, కశ్యప,వశిష్ఠ గోత్రీకులను చంద్రవంశం రాజులుగా పిల్చుకుంటున్నారు. పురాణాల ప్రకారం వంశాలు వేరుగా ఉన్నాయి. విశ్లేషణ జరగాలి. మన క్షత్రియ పెద్దలు సూర్య,చంద్ర వంశముల వారికి ఏది అసలు నిజమో తెలియచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

సూర్యవంశం, చంద్రవంశములలోని కొంత మంది క్షత్రియులు క్రీ.పూ. శతాబ్దాల క్రితం ఉత్తర హిందుస్థాన్ నుండి దక్షణపథమునకు వలసలు వచ్చి గోదావరీ పరివాహక ప్రాంతంలో కొందరు, రాయలసీమ ప్రాంతంలో కొందరు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిస్సా ప్రాంతాలలో స్థిరపడిరి. క్రీ. పూ 263 సం.లో ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపన జరిగినట్లు ఇంకా. క్రీ పూ 1000 సం. ముందే ఆంధ్ర క్షత్రియుల గురించి ఐతరేయ బ్రాహ్మణంలో మొదట ప్రస్తావన జరిగినది.

రాజపుత్రులను,యుద్దవీరులను ముస్లింలు ఊచకోత కోసి దేవాలయాలను దోచుకొని కూలగొట్టి మన సంప్రదాయాలకు తీవ్ర విఘాతాన్ని సృష్టించారని చరిత్ర చెబుతోంది. నడవగలిగిన యుద్దవీరులు, స్త్రీలు, యువకులు రెండెడ్ల బండ్లలో రాజస్థాన్, ఉత్తర ప్రాంతాల నుండి ఇప్పుడున్న రహదారుల మీదుగా రాత్రులు ప్రయాణం చేసి అలాగ కొందరు మహారాష్ట్ర సరిహద్దులో అంటే గోదావరీ తీరప్రాంతం లో, మరి కొందరు ఓరుగల్లు కాకతీయ ప్రభువుల వద్ద సిపాయిలుగా చేరి కాకతీయ ఓరుగల్లును మొఘలుల దాడుల నుండి రక్షించారు.

మొఘలుల దక్కనును జయించిన సమయంలో రాజపుత్రులు ప్రాణాలను నిలుపుకొనుటకు వారి వేష భాషలనుమార్చుకొని దక్షణ ద్రావిడులలోని బ్రాహ్మణుల రంగు రూపాలతో పోలికలు కనబడుటవలన మన రసపుత్రులు బ్రాహ్మణులవలె జుట్టు, అంట కత్తెర, పిలక, పంచె కట్టు ధరించడం మొదలుపెట్టారు. ముస్లిములకు చిక్కకుండుట కొరకు మన తెలుగు క్షత్రియులు రహదారులు, రోడ్లు లేని చోట, నీటి వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

మన జాతి లో ఒక సామెత ఉన్నది గొఱ్ఱెలు, మేకలు మందలు కడతాయి కానీ, పులులు మందలు కడతాయా. కాని ఇప్పుడు మనం పులులం కాము, అందరితో ఒకరికొకరు సహాయపడుతూ మన క్షత్రియ జాతిని రక్షించుకునేందుకు నడుం బిగించాలి..

మన క్షత్రియుల పుట్టుపూర్వోత్తరాలు పురాణకాలం నుంచి ఉన్న ఆధారాలు అందరికీ తెలియాలని గూడూరు ఆంజనేయరాజు గారు వీటిని సేకరించి అందిస్తున్నారు.. ఈ చరిత్ర గురించి ఎవరికైనా తప్పొప్పులు కనపడినా లేక సందేహములున్నా మీ అభిప్రాయములు తెలియజేయమనవి.. వాదోపవాదములకు తావు లేదు.

జై క్షాత్రధర్మం..
– ఎస్.రాజు

 

LEAVE A RESPONSE