– ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ
– ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
హైదరాబాద్: వరద బాధితుల కోసం సిద్ధంచేసిన నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన బిజెపి శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , ఇతర నాయకులు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున బాధితులకు తక్షణ సహాయం చేయడం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బిజెపి నాయకుల బృందం ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది.
ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వరద బాధితులకు ఆహార పంపిణీ, ఇతర సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే 10 వేల మందికి నిత్యవసర సరుకులు, ఆహార పంపిణీ తో పాటు ఇతర సహాయ కార్యక్రమాలు అందించాలని పార్టీ నిర్ణయించింది.
బియ్యం, బెడ్ షీట్స్, పప్పు, చింతపండు, దుప్పట్లు ఇతరత్రా సామాగ్రి నాలుగు ట్రక్కుల్లో పంపించడం జరుగుతోంది. అలాగే, కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి , బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి , పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిన్న ఖమ్మంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి, బాధిత ప్రజల బాధలు తెలుసుకోవడంతో పాటు భరోసా కల్పించి, సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , నాయకులు ధర్మారావు , సీతారం నాయక్ , తదితర నేతలు మహబూబాబాద్, ములుగు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు అండగా నిలిచేలా చర్యలు చేపట్టారు.
ఇంకా అనేక చోట్ల నుండి వరద బాధితులకు సహాయం చేయడం కోసం బిజెపి ఆధ్వర్యంలో నిత్యావసరాల ట్రక్కులు బయలుదేరాయి.ఇది కేవలం తక్షణ సహాయం మాత్రమే. కేంద్ర బృందాలు పర్యటించిన తర్వాత వరద నష్టాన్ని అంచనా వేసి రైతులకు, ప్రజలకు నష్ట పరిహారం అందజేస్తాం.
అన్ని విధాలుగా అండ: బిజెపి శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి
ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో పలు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు, ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురై ఇండ్లు మునిగిపోయి, ఆస్తులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధిత ప్రజలకు బిజెపి అండగా నిలుస్తోంది.ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి నాయకులు పర్యటించి, సహాయక చర్యలు చేపట్టారు.
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రులతో కలిసి అతిభారీ వర్షాల కారణంగా వరద ధాటికి గురైన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, కోదాడ ప్రాంతాల్లో నిన్న పర్యటించారు.వంద సంవత్సరాలల్లో లేని విపత్తు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సంభవించింది.
ఆ జిల్లాల్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, వీఎచ్ పీ, హిందూవాహిని ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టి వరద బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఎన్డీఆర్ఎఫ్ నిధులతో నష్టపోయిన ప్రతీ ఒక్కరిని ఆదుకుంటామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. అవసరమైతే కేంద్రం నుండి మరికొన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. సహాయ కార్యక్రమాల్లో ముందుకెళ్తాం.