Suryaa.co.in

Editorial

బీజేపీ.. భలే భలే!

– కేంద్రమే అప్పులిస్తూ రాష్ట్రంపై ఆరోపణలా?
– జగన్‌ అప్పులపై ఆర్ధికమంత్రికి పురందేశ్వరి ఫిర్యాదు
– పరిమితికి మించి అప్పులు చేస్తున్నారంటూ ఫిర్యాదు
– కేంద్ర నిధులు మళ్లిస్తున్నారంటూ ఆరోపణ
-జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో714627 కోట్లు అప్పు చేసిందని వివరణ
– రాష్ట్రంపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం
– పురందేశ్వరి ఫిర్యాదులో కేంద్ర నిధులే ఎక్కువ
– సర్పంచుల నిధులూ దారిమళ్లుతున్నాయ్‌
-ఎఫ్‌ఆర్‌ఎంబి పరిమితి దాటినా అప్పులు
– గత ఆగస్టులోనే రాష్ర్టాన్ని హెచ్చరించిన కేంద్రం
– సర్కారు ఆర్ధిక అవకతవకలపై అనేకసార్లు ప్రధానికి లేఖ రాసిన ఎంపి రఘురామకృష్ణంరాజు
– తాజాగా ప్రధాని మోదీకి ఎంపి రాజు మరో లేఖ
– కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రం అప్పులు చేయడం సాధ్యమేనా?
– పురందేశ్వరి ప్రజలను మభ్యపెడుతున్నారా?
– జగన్‌ను ప్రధాని కొడుకులా చూస్తున్నారన్న నిర్మలాసీతారామన్‌
– కేంద్రానికి తెలియకుండానే జగన్‌ అప్పులు చేస్తున్నారా?
– ఏపీ ప్రజలతో బీజేపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందా?
– ఇది పురందీశ్వరి సొంత ఇమేజ్‌ ఎత్తుగడేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

వెనుకటికి ఓ ఎమ్మెల్యే తనను ఆశ్రయించిన భూస్వామిని మెప్పించేందుకు.. ఊరి చివరన ఉన్న వందెకరాలూ తీసుకోమని చెబుతాడు. దానితో సదరు భూస్వామి అందులో ఫారెస్టు భూములున్నప్పటికీ, ఎమ్మెల్యే ఉన్నాడన్న ధైర్యంతో ఆ భూమి తీసుకుంటాడు. చుట్టూ కంచె వేస్తాడు. తర్వాత ఎమ్మెల్యే ఫారెస్టు అధికారులకు ఫోన్‌ చేసి, ఊరి చివర ఫారెస్టు భూములు ఆక్రమిస్తుంటే నిద్రపోతున్నారా అంటూ ఇంతెత్తున లేస్తాడు. దానితో మేల్కొన్న అధికారులు, సదరు భూస్వామికి నోటీసులిస్తారు. ఆరకంగా తనను ఆశ్రయించిన భూస్వామిని మెప్పించిన ఆ ఎమ్మెల్యేనే, మళ్లీ తన సహజ రాజకీయం ప్రకారం ఆ భూస్వామి ఆక్రమించిన భూమికి, నోటీసులిప్పిస్తాడన్న మాట. ఇది బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో కనిపించే .. నాగభూషణం, రావుగోపాలరావు, సత్యనారాయణ ఆడే రాజకీయ క్రీడ. కానీ ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్‌లోనూ కనిపిస్తోంది. అదె లాగో చూడండి.

జగన్‌ సర్కారుపై ఏపీ బీజేపీ చేస్తున్న ‘అప్పుల యుద్ధం’ ప్రజలను మభ్య పెట్టేందుకేనా? పరిమితికి మించి అప్పులు చేస్తుందంటూ.. ఏపీ బీజేపీ దళపతి పురందేశ్వరి, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి చేసిన ఫిర్యాదు, ఏపీ ప్రజలను మభ్య పెట్టేందుకేనా? నాలుగున్నరేళ్లలో కేంద్ర అనుమతి లేకుండానే రాష్ట్రం అప్పులు చేసిందా? ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కేంద్రానికి తెలియకుండానే రాష్ట్రం ఉల్లంఘిస్తోందా? జగన్‌ సర్కారు అప్పులపై రఘురామకృష్ణంరాజు సహా, ఎంపీలు ఫిర్యాదులు చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? అయినా.. ఒకవైపు తానే అప్పులు ఇస్తూ, మరోవైపు తానే అప్పులు చేస్తున్నారంటూ ఆరోపించడం ఏమిటి? ఈ వ్యూహం ఎవరి కోసం? ఈ ఆరోపణలు ఎందుకోసం? జగన్‌ సర్కారుపై తాము సీరియస్‌గా యుద్ధం చేస్తున్నామన్న సంకేతాలిచ్చేందుకేనా? పురందేశ్వరి సొంత ఇమేజ్‌ కోసం వేస్తున్న ఎత్తుగడేనా? ఇవీ ఇప్పుడు ఏపీ ప్రజల సందేహాలు.

జగన్‌ సర్కారు ఆర్ధిక వ్యవహారాలపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి దృష్టి సారించారు.ఆమె గత కొద్దిరోజుల నుంచి అన్ని వేదికలపైనా, ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రకారంగా ఈ నాలుగున్నరేళ్ల నుంచి జగన్‌ సర్కారు తీసుకువచ్చిన అప్పులు.. రాష్ట్రంలో ఏయే రంగాల ద్వారా వచ్చే ఆదాయం.. కేంద్రనిధులను పక్కదారి మళ్లిస్తున్న చిట్టా తయారుచేశారు. దానిని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. జగన్‌ సర్కారుపై చర్యలు తీసుకోమని కోరారు.

గత నాలుగున్నరేళ్లలో వైసీపీ సర్కారు ప్రజలెపై.. 7,14,625 కోట్ల అప్పుల భారం వేసిందని పురందేశ్వరి, ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్ధికబాండ్ల ద్వారా 2,39,716 కోట్లు, నాబార్డు నుంచి 7,902, కార్పొరేషన్ల ద్వారా 98 కోట్లు, జాతీయ భద్రత నిధి నుంచి 8,948 కోట్లు అప్పు చేశారని వెల్లడించారు.

గ్రామీణ పంచాయితీ నిధుల మళ్లింపు866 వల్ల సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, పురందేశ్వరి కేంద్ర ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే పురందే శ్వరి ఫిర్యాదు చేసిన వాటిలో కేంద్రనిధులే ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే వాటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగి, చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టమవుతుంది.

నిజానికి పురందేశ్వరి చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం కొత్తదనం లేదు. అన్నీ పాతవే. కాకపోతే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర నిధులను జగన్‌ సర్కారు దారి మళ్లిస్తోందని ఆరోపించేవారు. ఇప్పుడు పురందేశ్వరి ఆ వివరాలను విడుదల చేశారు. అదే తేడా.

చాలాకాలం నుంచి జగన్‌ సర్కారు చేస్తున్న అప్పులు, నిధుల మళ్లింపు వ్యవహారాలపై.. వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు సహా, పలువురు ఎంపీలు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎంపి రఘురామకృష్ణంరాజు ఓ అడుగు ముందుకేసి, జగన్‌ సర్కారు చేస్తున్న ఆర్ధిక వ్యవహారాలపై విచారణ జరపాలంటూ ప్రధాని, ఆర్ధికమంత్రి, ఆర్బీఐ గవర్నర్‌కు , డజన్ల సంఖ్యలో లేఖలు కూడా రాశారు.

ఏపీ సర్కారుకు అప్పులు ఇవ్వవద్దని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. తమకు కేంద్రం నుంచి వచ్చే నిధులను, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్న వైనాన్ని సర్పంచులు ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. అక్కడ ధర్నా కూడా నిర్వహించారు. తాజాగా కార్పొరేషన్ల పేరిట అప్పులు చేస్తున్న జగన్‌కు, పేదళ్ల జైలుశిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.

గత నాలుగున్నరేళ్ల నుంచి జగన్‌ సర్కారుకు కేంద్రం లోని బీజేపీ సర్కారు ఆర్ధిక సమస్యలు లేకుండా సహకరిస్తోందన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలో కేసీఆర్‌ సర్కారుకు మొండి చేయి చూపిస్తున్న కేంద్రం, ఏపీకి మాత్రం ఉదారంగా నిధులు విడుదల చేస్తోంది. అప్పులు ఇస్తోంది.

అంటే జగన్‌ సర్కారుకు బీజేపీ సర్కారే, అప్పులిస్తూ సహకరిస్తోందని స్పష్టమవుతుంది. మళ్లీ అదే బీజేపీ నేతలు.. జగన్‌ సర్కారు అప్పులు చేస్తోందంటూ కేంద్ర ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేయటంపై, ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇది తమను భ్రమల ప్రపంచంలో ఉంచే ఎత్తుగడగా భావిస్తున్నారు.

ఒకవైపు అప్పులు ఇస్తూ.. మరోవైపు అప్పులు చేస్తుందన్న ఆరోపణలతో.. సోము వీర్రాజు మాదిరిగా కాకుండా, తాము వైసీపీ సర్కారుపై సీరియస్‌గా యుద్ధం చేస్తున్నామన్న నమ్మకం కలిగించడమే, పురందేశ్వరి వ్యూహంలా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నిజానికి ప్రతి మంగళవారం అధికారులు, అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేందర్‌నాధ్‌రెడ్డి, ఆర్ధికశాఖ అధికారులు ఢిల్లీలోనే బైఠాయించి, అప్పుల కోసం ప్రయత్నిస్తున్న ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి.

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ చాంబరులో.. ఏపీ ఆర్ధికమంత్రి, అధికారులు, ఎంపీలే ఎక్కువగా కనిపిస్తుంటారన్న వ్యాఖ్యలు వినిపించడం సహజంగా మారింది. గతంలో నిర్మలాసీతారామన్‌ తన అనంతపురం పర్యటనలో, సీఎం జగన్‌ను ప్రధాని తన కన్నబిడ్డ మాదిరిగా చూసుకుంటున్నారని వెల్లడించిన వైనాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు.

ఎఫ్‌ఆర్‌ఎంబీ పరిమితి దాటుతోందని.. గత ఆగ స్టులోనే హెచ్చరించిన కేంద్రం, మళ్లీ అప్పులపై ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. నిజానికి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా దొడ్డిదోవన అప్పులు తీసుకోవడం, రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం గతంలో లేఖ కూడా రాసింది.

ఇప్పుడు మరొక మార్గంలో ఉత్తమ రేటింగ్‌ ఉన్న ఏజెన్సీ ద్వారా, బీఎస్‌ఈలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ను లిస్టింగ్‌ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. పరిస్థితులన్నీ కలసివస్తే ఆ రుణం కూడా సర్కారు ఖజానాకు చేరే అవకాశాలు లేకపోలేదు.

జగన్‌ సర్కారుపై ఈవిధంగా అప్పులపై పెద్దమనసు చూపిస్తున్న బీజేపీ సర్కారు.. మళ్లీ జగన్‌ సర్కారు అప్పులు చేస్తోందంటూ ఆరోపించి, దానిని హడావిడి చే యడం విమర్శలకు దారితీస్తోంది. దీనిని బట్టి ఏపీలో.. బీజేపీ జగన్‌ సర్కారుపై పోరాడుతోందన్న భ్రమలు కల్పించడమే, ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇవన్నీ కేంద్రానికి తెలిసే జరుగుతున్నందున, మళ్లీ ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆర్ధిక శాఖ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నందున, చ ర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ.. కేంద్రం ఎందుకు మౌన ంగా ఉంది? తాను విడుదల చేస్తున్న నిధులు దారి మళ్లుతుంటే.. కేంద్రం విచారణ జరపకుండా ఎందుకు ప్రేక్షకపాత్ర వహించిందన్న ప్రశ్నలు బీజేపీకి ఇరకాటంగా మారాయి. అయితే.. ఏదేమైనా నాలుగున్నరేళ్ల తర్వాతయినా, జగన్‌ సర్కారు ఆర్ధిక అవకతవకలపై దృష్టి సారించడం అభినందనీయమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE