Suryaa.co.in

Editorial

జనసేన స్పీడుకు మళ్లీ బీజేపీ బ్రేకులు?

– తెలంగాణలో పోటీ చేయవద్దని ఒత్తిడి?
– తమకు మద్దతునివ్వాలని అభ్యర్ధన
– కిషన్‌రెడ్డి తెచ్చిన ప్రతిపాదన అదే
– ససేమిరా అని తేల్చేసిన పవన్ కల్యాణ్
– ‘గ్రేటర్’ ఎన్నికలలో కూడా త్యాగం చేశామని స్పష్టీకరణ
– తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలని వాదన
– ఇప్పటికే 32 చోట్ల అభ్యర్ధులున్నారని స్పష్టీకరణ
– కలసి పోటీచేస్తే మంచిదని సూచన
– అమిత్‌షాతో చర్చించి చెబుతానన్న కిషన్‌రెడ్డి
– బీజేపీ అభ్యర్ధుల జాబితా ప్రకటన వాయిదా పడే అవకాశం?
– పోటీ చేయాల్సిందేనని జనసైనికుల పట్టు
– గ్రేటర్, రంగారెడ్డిలో బలం ఉందని వాదన
– క్యాడర్ నిరుత్సాహపడుతుందని సూచన
– బీజేపీకి అభ్యర్ధులే లేరని విశ్లేషణ
– జనసైనికుల వైపే జనసేనాని?
– వస్తే కమలంతో కలసి కదనం
– లేకుంటే ఒంటరి పోరు
– టీడీపీ శ్రేణులు మద్దతు ఉంటుందని భరోసా
– బాబుకు దన్నుతో పవన్ వైపు తెలంగాణ సెటిలర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రాలో తన అసమర్ధ నాయకత్వ నిర్వాకంతో జనసేనను రాజకీయంగా దూరం చేసుకున్న బీజేపీ నాయకత్వం.. తెలంగాణలో కూడా అదే విధానం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కలసి పోటీ చేసే ఆలోచన బదులు… జనసేన బరిలోకి దిగకుండా, మద్దతుకు పరిమితం చేసే ఒత్తిడి రాజకీయాలకు తెరలేపింది. ఇది జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తోంది.

కేంద్రమంత్రి-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి, హటాత్తుగా జనసేనాని పవన్‌కల్యాణ్‌తో భేటీ అయి.. జనసేన తమకు మద్దతునివ్వాలని కోరారు. అంటే మీ పార్టీ పోటీ చేయవద్దని లౌక్యంగా చెప్పడమే. దీనిని పవన్ తేలిగ్గానే గ్రహించి, కిషన్‌రెడ్డి ప్రతిపాదనను జనసేనాని నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. కావాలంటే కలసి పోటీ చేసేందుకు అభ్యంతరం లేదని ప్రతిపాదించినట్లు సమాచారం. ఫలితంగా బీజేపీ అభ్యర్ధుల ప్రకటన వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో బలం లేని బీజేపీ.. అధికారంలోకి వస్తామన్న ధీమా, సొంత పార్టీ వారినే విస్మయపరుస్తోంది. 119 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు-ముఖ్యంగా బలమైన అభ్యర్ధులు లేని నేపథ్యంలో, జనసేనతో కలసి పోటీ చేస్తే అభ్యర్ధుల కొరతతోపాటు.. పార్టీ ఓటింగ్ శాతం పెంచుకోవచ్చన్నది బీజేపీ సీనియర్ల వాదన. నిజానికి తమకు రాష్ట్రం మొత్తంలో 30 చోట్లకు మించి బలమైన అభ్యర్ధులు లేరని బీజేపీ సీనియర్లు అంగీకరిస్తున్నారు.

ఈ పరిస్థితిలో.. అటు జనసేనతో పొత్తు పెట్టుకోకుండా- ఇటు జనసేనను పోటీ చేయనీయకుండా నివారించే వ్యూహం అమలుచేయడాన్ని, బీజేపీ సీనియర్లు ఆక్షేపిస్తున్నారు. గెలుపుపై విశ్వాసం ఉండటం మంచిదేకానీ, అతి విశ్వాసం అసలుకే ఎసరు తెస్తుందంటున్నారు. త్రిముఖ పోటీ నేపథ్యంలో.. టీడీపీతో పొత్తు పెండింగ్‌లో ఉన్నందున, జనసేనతో కలసి పోటీ చేయడమే మంచిదన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

తాజాగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌తో కేంద్రమంత్రి-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి భేటీ సారాంశం విని బీజేపీ సీనియర్లు విస్తుపోతున్నారట. జనసేనను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా, బీజేపీకి మద్దతునీయాలని కిషన్‌రెడ్డి ఆ భేటీలో పవన్ కల్యాణ్‌ను కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. జనసేనతో కలసి పోటీ చేస్తే గతంలో కంటే ఎక్కువ ఓట్ల శాతం సాధించే అవకాశాన్ని కిషన్‌రెడ్డి ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్ధం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అటు జనసైనికులు కూడా బీజేపీ వైఖరిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి బలం, ఇప్పుడు లేదని గుర్తు చేస్తున్నారు. మీడియా హైప్ తప్ప, క్షేత్రస్థాయిలో బీజేపీకి బలం లేదని స్పష్టం చేస్తున్నారు. సంజయ్‌ను అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత, ప్రజలు బీజేపీని నమ్మడం లేదని ఆ పార్టీ వారే అంగీకరిస్తున్న విషయాన్ని, జనసైనికులు గుర్తు చేస్తున్నారు. అంత బలహీనంగా ఉన్న బీజేపీ కూడా.. తమను పోటీ చేయకుండా, మద్దతుకే పరిమితం అవ్వాలని కోరడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కిషన్‌రెడ్డి అభ్యర్థనపై పవన్ అభ్యంతరం-ఆశ్చర్యం వ్యక్తం చేశారట. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు, అభ్యర్ధులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. జనసేనను పోటీ చేయవద్దని అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యర్ధించారు. దానితో సంజయ్ మాట గౌరవించి, జనసైనికులు మనస్తాపం చెందినప్పటికీ, జనసేన పోటీ నుంచి వైదొలిగింది.

ఆ పరిణామాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని జనసైనికులను రాజకీయంగా గాయపరిచాయి. డివిజన్లను ఎంచుకుని, ఎన్నిక లకు కొన్ని నెలల ముందు నుంచీ కార్యక్రమాలు నిర్వహించిన జనసైనికులకు, పవన్ నిర్ణయం రుచించలేదు. దానితో అనివార్య పరిస్థితిలో జనసైనికులు, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతునీయాల్సి వచ్చింది.

మళ్లీ ఇప్పుడు కూడా తమనే త్యాగం చేయాలని, చావుకబురు చల్లగా చెప్పడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి పవన్ మాత్రం, జనసైనికుల పక్షానే ఉన్నట్లు.. కిషన్‌రెడ్డికి చేసిన ప్రతిపాదన స్పష్టమవుతోంది.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కోసం చేసిన త్యాగం.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని, పవన్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తెలంగాణలో 32 స్థానాల్లో అభ్యర్ధులను ఎంపిక చేసిందని కిషన్‌రెడ్డికి వివరించారట. ఆమేరకు 2వ తేదీన నాదెండ్ల మనోహర్ పోటీకి సంబంధించి చేసిన ప్రకటనను పవన్ గుర్తు చేసినట్లు తెలుస్తోంది.

ఈసారి పోటీ చేయకపోతే పార్టీకి రాజకీయంగా ఉనికి ఉండదని, పార్టీ క్యాడర్‌ను నిరుత్సాహపరచలేనని కిషన్‌రెడ్డికి నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు తాము ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నామో, ఆ నియోజకవర్గాల వివరాలు వెల్లడించారట. జయాపజయాలు పక్కనపెట్టి, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడమే తనకు ప్రధానమని పవన్ కుండబద్దలు కొట్టారట.

కావాలంటే తెలంగాణలో కలసి పోటీ చేసేందుకు సిద్ధమని, పవన్ ప్రతిపాదించినట్లు సమాచారం. దానికి స్పందించిన కిషన్‌రెడ్డి.. తాను ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాతో చర్చించి, మీ ప్రతిపాదన- పోటీపై వైఖరి వివరిస్తానని చెప్పారట. అయితే అప్పటివరకూ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, పవన్‌ను అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరించిన పవన్.. త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారట.

బీజేపీ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ, జనసేన పోటీ చేయడం ఖాయమంటున్నారు. ‘‘మేము ఎన్నికల్లో ఒంటరిగానయినా-జంటగానయినా… పోటీ చేయడమైతే పక్కా .ఈసారి మా పార్టీ శ్రేణులను నిరుత్సాహపరచబోం. వారి మనోభావాల ప్రకారమే పోటీ ఉంటుంది’’అని జనసేన కీలకనేత ఒకరు కుండబద్దలు కొట్టారు.

ఈ పరిణామాల ఫలితంగా.. బీజేపీ అభ్యర్ధుల జాబితా ప్రకటన, మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దానికి తగినట్లుగానే కిషన్‌రెడ్డి గురువారం ఉదయం అమిత్‌షా నివాసానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నద్దాతో జరిగిన కోర్ కమిటీ భేటీలో కూడా ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ప్రతిపాదనపై, అమిత్‌షా స్పందన ఏమిటన్నది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాలు వివరించాయి.

కాగా జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో దిగితే.. టీడీపీ శ్రేణులు-సెటిలర్లు-కమ్మ సామాజికవర్గం, జనసేనకు మద్దతునిస్తుందన్న భరోసా జనసైనికులలో వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం అనుమానంగానే కనిపిస్తోందని, జనసైనికులు అంచనా వేస్తున్నారు.

నిజంగా అదే జరిగితే.. ఆంధ్రాలో టీడీపీతో కలసి పోటీ చేయనున్న జనసేనను, తెలంగాణలో టీడీపీ శ్రేణులు-కమ్మ వర్గం అందలమెక్కించడం ఖాయమన్న అంచనా, జనసైనికులలో వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలసి, బయటకు వచ్చి టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన తర్వాతనే, టీడీపీకి ధైర్యం వచ్చిందన్న భావన లేకపోలేదు. అది తెలంగాణలో జనసేన పోటీకి, లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE