Suryaa.co.in

Telangana

తెలంగాణపై దాడికి బీజేపీ కుట్ర

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్ శ్రేణులు

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా బైక్ ర్యాలీల లో పాల్గొన్నారు. ధర్నా నిర్వహించారు.

ఆయా నిరసన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ పై దాడికి బీజేపీ కుట్ర చేస్తున్నదన్నారు. ప్రధాని నిన్న రాజ్యసభలో తెలంగాణ విభజనపై విషం కక్కారని చెప్పారు. తెలంగాణ ను కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కానీ ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులన్న విషయం గుర్తు చేశారు. రాజ్యాంగ బద్దంగా విభజన జరిగిందని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినా, కించపరిచినా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, కించపరచడమేనని మంత్రి అన్నారు.

తెలంగాణ లో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇదంతా చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సీఎం కెసిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందన్నారు. చివరకు మన పథకాలను కాపీ కొట్టి దేశంలో అమలు చేసే దిక్కుమాలిన తెలివి బీజేపీ దని ఎద్దేవా చేశారు. తెలంగాణపై మరో కుట్రకు బీజేపీ తెర లేపిందని, దాన్ని తిప్పికొట్టే బాధ్యత ప్రజలతో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలది అని మంత్రి పిలుపు నిచ్చారు. ప్రజలను కులం, మతం పేరుతో విభజించి పాలించే దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతున్నదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రజలని హెచ్చరించారు.

కేసీఆర్ మన సీఎం గా మరో పదికాలాల పాటు ఉంటేనే, మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎర్రబెల్లి చెప్పారు. ఆయన చేపట్టిన పథకాలు ప్రతిఫలిస్తున్నాయి. మన రాష్ట్రం మరింతగా పురోగమించాలని మనమంతా కోరుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే సీఎం ఈ నెల 11 వ తేదీన జనగామకు వస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE