‘పువ్వుపార్టీ’కి ‘రాజధాని’ ముల్లు!

– బీజేపీ పాదయాత్రలో రైతుల నుంచి ఆగని పరాభవం
– రైతుల ప్రశ్నలకు జవాబు లేక నోరెళ్లబెడుతున్న బీజేపీ నేతలు
– పాదయాత్రతో పరువుపోతోందంటున్న నేతలు
– గత వైఫల్యాలను మళ్లీ గుర్తుతెస్తున్నామని విశ్లేషణ
– పాత గాయం తవ్వుతున్నామన్న ఆందోళన
– రైతులు నమ్మడం లేదని పార్టీ నేతల ఆవేదన
– మోదీ వద్దకు తీసుకువెళ్లాలంటున్న రైతులు
– సమాధానమిచ్చే ఆ స్థాయి నేతలెవరన్నదే ప్రశ్న
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని అదేదో సినిమాలో పాట ఉన్నట్లు గుర్తు.
‘ప్రతి నదిలో నీళ్లంటాయి.. ప్రతి ఎదలో కలలుంటాయి’
వసంతకోకిల సినిమాలో ఓ పాట ఇది.
ఇప్పుడు అమరావతిలో రాజధాని కోసం.. భాజపా చేస్తున్న పాదయాత్రలో, రాజధాని రైతన్నల నుంచి వస్తున్న నిరసన సెగలు చూస్తుంటే ఈ పాటలు గుర్తుకు రాకమానవు!
కానీ ‘పువ్వు పార్టీ’ నేతలు మాత్రం.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా, ‘జగడ జగడ జగడం. రగడ రగడ రగడం. మా ఊపిరి నిప్పుల వంతెన. మా ఊహల కత్తుల వంతెన. మా దెబ్బకు దిక్కులు పెక్కటిల్లిపోయే’ నంటూ గీతాంజలిలో నాగార్జున లెవల్లో, పాదయాత్రకు వస్తున్న ఆ డజన్ల మందిని చూసే స్వయం సంతృప్తి చెందుతున్న వైనం, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

రాజధాని అంశంపై రెండేళ్లు మన్ను తిన్న పాములా తిని తొంగొని, మాట్లాడకుండా మూతి మూసుకుని, ఎన్నికలకు రెండేళ్ల ముందు పాదయాత్ర అనే షార్టు కట్‌లో ఎదిగేద్దామన్న భాజపా తెలివి.. అమరావతి రైతుల ఆగ్రహం ముందు బోల్తా పడింది. ‘అమరావతిని జగన్ తగలబెడుతుంటే ఇన్నేళ్లూ ఎక్కడ తగలబడ్డారు? మాపై కేసులు పెడుతుంటే మాట్లాడకుండా, ఎందుకు నవరంధ్రాలూ మూసుకున్నారు? యాభైమందితో ఇప్పుడొచ్చి ఏం అఘోరిస్తారు? అమరావతిని రాజధానిగా ప్రకటించాలని మీ అమిత్‌షా, జగన్‌కు ఒక్క మాట ఎందుకు చెప్పడం లేద’ంటూ.. గుక్క తిప్పుకోకుండా అమరావతి రైతులు వేస్తున్న ప్రశ్నలకు, జవాబివ్వకలేక పువ్వుపార్టీ నేతలు గుటకలు మింగాల్సిన వస్తోంది. శాలువాలతో చెమటలు తుడుచుకోవలసి వస్తోంది.

మొన్న పువ్వుపార్టీ బాసు సోము వీర్రాజు, నేడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ. ఇద్దరికీ అమరావతి రైతుల సెగ తగిలింది. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరుతూ, గుంటూరు జిల్లా బీజేపీ నాయకత్వం ‘మనం మన అమరావతి’ పేరుతో, హటాత్తుగా పాదయాత్ర ప్రారంభించింది. రాష్ట్రంలో రోడ్లు, మద్యం దుకాణాలు, పాఠశాలల విలీనం, తలకు మించిన అప్పులు, ఉద్యోగుల సీపీఎస్‌హామీ, అంతకుమించి.. లేటెస్టు చీకోటి క్యాసినో గత్తర వంటి కీలక రాజకీయ అంశాలను వదిలేసి, తాను ఎప్పుడో మర్చిపోయిన అమరావతి రాజధాని అంశాన్ని, ఆలస్యంగా తలకెత్తుకున్న పువ్వుపార్టీ నేతలను అమరాతి రైతులు.. పాదయాత్రలో ఆడేసుకుంటున్న దృశ్యాలు, సోషల్‌మీడియాకు ఆహారంగా మారుతున్నాయి. రాజధాని రైతులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు పువ్వు పార్టీ నేతలు బదులివ్వలేక, నీళ్లు నములుతున్న దృశ్యాలు పరిశీలిస్తే.. పాదయాత్ర వల్ల పువ్వుపార్టీ పరిమళిస్తుందా? లేక పరువు పోగొట్టుకుంటోందో తెలియక, పువ్వుపార్టీ నేతలు పరేషానవుతున్నారట!

అమరావతిలో రాజధాని కోసం బీజేపీ ప్రారంభించిన పాదయాత్ర లక్ష్యం నెరవేరకపోగా.. గతంలో ఆ పార్టీ నేతలు అమరావతిపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చి, రైతులు నిలదీసే దిశగా పయనించడం బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,ఎంపీ జీవీఎల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి అమరావతి రాజధాని, ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు పాదయాత్రలో ఉన్న బీజేపీ నేతలకు ప్రతిబంధకంగా మారాయి. పట్టుచీరలు కట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారని ఒకరు, ఖరీదైన బట్టలు కట్టుకుని ధర్నాలు చేస్తున్నారని మరొకరు, రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఇంకొకరు, రాజధానికి కట్టుబడి ఉన్నామని ఒకరు చేసిన వ్యాఖ్యలను.. ఇప్పుడు అమరావతి రైతులు, పాదయాత్రకు వచ్చిన బీజేపీ నాయకుల వద్ద ప్రస్తావించి మరీ వారిని ఇరుకున పెడుతున్న వైనం, బీజేపీ ఇమేజీకి డామేజీగా మారింది. పైగా.. పాదయాత్రకు హాజరవుతున్న వారి సంఖ్య కూడా అత్యల్పంగా ఉండటంతో, సోషల్‌మీడియాలో దానిపైనా సెటైర్లు పేలుతున్నాయి.

బీజేపీ పాదయాత్ర ప్రారంభం రోజున అమరావతి రైతులు, ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజును కడిగేసిన వైనం సోషల్‌మీడియాలో దుమ్మురేపింది. ‘మీరూ జగన్ ఒక్కటే. ఇద్దరూ కలసి అమరావతిని నాశనం

చేశా’రంటూ విరుచుకుపడిన రైతులకు, సమాధానం ఇవ్వలేక బయటపడిన వీడియో, సోషల్‌మీడియాలో ఇంకా చక్కర్లు కొడుతోంది. తాజాగా బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణను.. అమరావతి రైతులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేని వీడియో కూడా, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘మీరు మమ్మల్ని ప్రధాని మోదీ గారి దగ్గరకు తీసుకువెళ్లండి. ఆయన ఈ దేశానికి ప్రధాని. మేం

ఆయన్నే అడుగుతాం. చేస్తే చేస్తారు లేకపోతే లేదు. మీరు చెబితే మేం నమ్మేది లేద’ని రైతులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో, పాపం సదరు బీజేపీ నేత దానికి సూటి సమాధానం ఇవ్వలేకపోయారు.

కాగా తాజా పాదయాత్రపై బీజేపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు అధ్యక్షుడయినప్పటి నుంచీ.. అంటే గత రెండేళ్ల నుంచి అమరావతికి వ్యతిరేకంగా, వైసీపీ సర్కారు విధానాలకు అనుకూలంగా వ్యవహరించి, ఇప్పుడు హటాత్తుగా రాజధానిపై పాదయాత్ర చేస్తే.. రైతులు, ప్రజలు ఎలా నమ్ముతారన్న చర్చ పార్టీలో మొదలయింది. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమరావతికి

అనుకూలంగా తీర్మానించిన అదే పార్టీ.. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత.. రూటు మార్చి, తమ విధానాలకు తామే విరుద్ధంగా చేసిన ప్రకటనలను, ప్రజలు ఎలా మార్చిపోతారని బీజేపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కన్నా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, పార్టీకి చేరువైన అమరావ తి రైతులను.. మద్దతుదారులుగా మలుచుకునే వ్యూహానికి బదులు, సోము నాయకత్వం తమ ప్రకటనలతో వారిని పూర్తిగా దూరం చేసుకుందని బీజేపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు నిర్వహించిన.. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు, తమ పార్టీ నేతలెవరూ చివరివరకూ పాల్గొనని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘ అసలు అమరావతిపై మా పార్టీ వైఖరేమిటన్నది ఇప్పటివరకూ నాయకత్వం మాకు చెప్పలేదు. అనుకూలమన్న మాట తప్పితే, దానిని కార్యాచరణలో చూపించే ప్రయత్నం కేంద్రపార్టీ కూడా చేయడం లేదు. పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే సుజానా చౌదరి, సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ, ఆదినారాయణరెడ్డి వంటి సీనియర్లు రంగంలోకి దిగేందుకు రెడీగానే ఉన్నారు. కానీ వాళ్లకు స్పష్టత ఇచ్చేదెవరన్నదే ప్రశ్న. అమరావతిలో రాజధానికి కట్టుబడి ఉన్నామని ప్రచారం చేసుకునే మేం, తిరుపతి వరకూ రైతులు నిర్వహించిన పాదయాత్రలో ఆది నుంచీ తుది వరకూ పాల్గొనలేదు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి అమరావతి ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు రైతులు ఎందుకు మర్చిపోతారు? మొన్న సోము వీర్రాజు, నేడు పాటిబండ్ల రామకృష్ణను రైతులు ప్రశ్నించిన తీరు చూస్తుంటే.. అమరావతిపై మేం ఎన్ని చెప్పినా రైతులు, ప్రజలు మా నిజాయితీని నమ్మే పరిస్థితి లేదని అర్ధమయింది. ఒకరకంగా ఈ పాదయాత్ర వల్ల మేం ఇంకా డామేజీ అవుతామేమోననిపిస్తోంది. ఆపేస్తే మంచిదనిపిస్తోంది. సోషల్‌మీడియాలో కూడా.. అమరావతిపై మా పార్టీ నేతలు గతంలో ఏం మాట్లాడారో వీడియోలతో సహా వస్తుంటే, మా పార్టీని రైతులు, ప్రజలు ఎందుకు నమ్ముతార’ని కాకినాడ జిల్లాకు చెందిన ఓ సీనియర్ బీజేపీ నేత వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
somu-amaravati-statment

Leave a Reply