Suryaa.co.in

Telangana

దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపి

  • నేషనల్ హెరాల్డ్ పేపర్ కి తాళం వేయడం స్వాతంత్ర్యన్ని అవమానించడమే
  • దేశ స్వాతంత్ర సంగ్రామంలో బిజెపి ఎక్కడ?
  • బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే ధరల పెరుగుదల
  • కాంగ్రెస్ స్వాతంత్ర సంగ్రామ పోరాట ఫలితమే ఆజాది అమృత్ ఉత్సవాలు
  • దేశ ఆస్తులను బిజెపి అమ్ముతుంటే చూస్తూ ఊరుకుందమా?
  • స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరో ఉద్యమం చేయాలి
  • ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు

బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాస్తూ దేశ వినాశనానికి పాల్పడుతున్న బిజెపి పాలకుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఆనాటి స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరో సారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. నిత్యవసర ఆహార వస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ…
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను, వ్యవస్థలను ఆస్తులను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసిందన్నారు. 2014 ఎన్నికల్లో దేశ ప్రజలకు అనేక భ్రమలు కల్పించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ సృష్టించిన సంపదను బహుళ జాతి సంస్థల అధిపతులైన అంబానీ, ఆదానిలకు ధారాదత్తం చేస్తుంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ మౌనంగా ఉండదన్నారు. దేశ ఆస్తులను బిజెపి అమ్ముతుంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. దేశానికి జెండా, అభివృద్ధికి అజెండా, సమసమాజ స్థాపన కోసం భూ పంపిణీ, 20 సూత్రాల అమలతో అభివృద్ధి, బ్యాంకులను కాంగ్రెస్ పార్టీ జాతీయ చేస్తే వీటిని ధ్వంసం చేసే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

నిత్యవసర ఆహార వస్తువులపై జిఎస్టీ విధించి మోడీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతుందని, సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబాలు సైతం బతకలేని దుస్థితికి తెచ్చిందని పేర్కొన్నారు. బహుళ జాతి కంపెనీలకు గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు, నిత్యవసర వస్తువులు కట్టబెట్టడానికే మోడీ జీఎస్టీ విధిస్తున్నారని వివరించారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగకుండా, వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని బిజెపి నిర్వీర్యం చేస్తుందన్నారు.

దేశ స్వాతంత్ర సంగ్రామంలో బిజెపి ఎక్కడ?
దేశ స్వాతంత్ర సంగ్రామంలో బిజెపి పాత్ర ఏముందని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలకుల అడుగులకు మడుగులెత్తిన సవర్కర్ వారసులు నేడు పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను తామే రూపొందించామన్నట్టుగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ తమ నాయకుడు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ బిజెపి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆజాది అమృత్ ఉత్సవాల పేరిట జెండా పండగ చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు చేసిన స్వాతంత్ర సంగ్రామ పోరాట ఫలితమే నేడు జరుపుకుంటున్న 75 సంవత్సరాల ఆజాద్ అమృత్ మహోత్సవ ఉత్సవాలని తెలిపారు.‌

దేశభక్తిని చాటడం కోసం, స్వాతంత్ర సంగ్రామ పోరాటాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ఆనాడు నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పేపర్ కి తాళాలు వేయడం దేశ స్వాతంత్ర్యన్ని అవమానించడమేనని బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి చేస్తున్న ఆకృత్యాలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసి గొల్పి మోడీ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఏఐసిసి కార్యాలయంలోకి పోలీసులను పంపించి దుర్మార్గానికి పాల్పడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మౌనంగా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE