– జనసేనకు 10 సీట్లు ఖరారు
– 20 సీట్లు అడిగిన జనసేన
– ముందు 6-8 వరకూ ఇస్తామన్న బీజేపీ
– చివరకు 10 సీట్లతో పొత్తుకు తెరదించిన బీజేపీ
– కూకట్‌పల్లి సీటు జనసేనకే
– శేరిలింగంపల్లి బదులు కూకట్‌పల్లి ఇచ్చిన బీజేపీ
– వైరా, నాగర్‌కర్నూలు, కోదాడ, కూకట్‌పల్లి, తాండూరు,అశ్వారావుపేట, మెదక్ సహా పది సీట్లు
– పది సీట్లు మినహా రేపు బీజేపీ అభ్యర్ధుల ప్రకటన
– అమిత్‌షా,నద్దా, సంతోష్‌జీతో కిషన్‌రెడ్డి భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ ఎన్నికల్లో తనతో పొత్తు పెట్టుకున్న జనసేనకు పది స్థానాలు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దానితో బీజేపీ-జనసేన పొత్తు చర్చల ప్రక్రియకు తెరపడినట్లయింది. ఈ పది సీట్లు మినహా, మిగిలిన స్థానాల్లో అభ్యర్ధుల పేర్లు ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఆ మేరకు కేంద్రహోంమంత్రి అమిత్‌షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దా, పార్టీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్‌జీతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చించారు.
ఎన్డీఏ మిత్రపక్షమైన జనసేన తెలంగాణ ఎన్నికల బరిలో దిగనుంది. ఇప్పటికే ఏపీలో టీడీపీతో పొత్తును ఖాయం చేసుకున్న జనసేన.. తెలంగాణలో మాత్రం బీజేపీతో కలసి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
గత ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన, ఈసారి ఎన్నికల్లో తన అభ్యర్ధులను బరిలోకి దించనుంది. ఆ మేరకు బీజేపీతో కుదిరిన ఒప్పందం ప్రకారం 10 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు పోటీ చేయనున్నారు.
తొలుత 32 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాన,ు జనసేన నాయకత్వం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అందించింది. అయితే 6 నుంచి 8 స్థానాలు ఇచ్చేందుకు కేంద్ర కమిటీ నిర్ణయించింది. చివరిగా పదిస్థానాలు ఇవ్వాలన్న బీజేపీ ప్రతిపాదనను జనసేన అంగీకరించింది. ఫలితంగా బీజేపీ ఆ పది స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో, తన అభ్యర్ధుల జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆ ప్రకారంగా వైరా, నాగర్‌కర్నూలు, కోదాడ, కూకట్‌పల్లి, తాండూరు, అశ్వారావుపేట, మెదక్ సహా పది సీట్లలో జనసేన పోటీ చేయనుంది. నిజానికి జనసేన శేరిలింగంపల్లి సీటు కావాలని పట్టుపట్టింది. అయితే అక్కడ బీజేపీలోనే పోటీ తీవ్రంగా ఉండటంతో, దాని బదులు కూకట్‌పల్లి ఇచ్చేందుకు బీజేపీ ముందుకువచ్చింది. అందుకు జనసేన నాయకత్వం అంగీకరించడంతో, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పొత్తు చర్చల ప్రక్రియకు తెరపడిన ట్లయింది.