– సంఘటనా మంత్రిగా పంజాబ్‌కు బదిలీ
– పనిచేసిన బీజేపీ సీనియర్ల ఫిర్యాదు
– విఫలనేతగా పార్టీలో విమర్శలు
– తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిన మంత్రి శ్రీనివాస్
– చివరకు సీఎం అభ్యర్ధిగా ప్రచారం
– ఆకస్మిక బదిలీతో మంత్రిజీ వర్గం డీలా
– తొలిసారి ఉత్తరాది నేతకు పర్యవేక్షణ పగ్గాలు?
– కొత్త సంఘటనా మంత్రిగా గుజరాత్ నేత?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, పార్టీలో సంఘటనా మంత్రిగా పిలుచుకునే మంత్రి శ్రీనివాస్‌జీని పార్టీ నాయకత్వం ఆ బాధ్యతల నుంచి ఆకస్మికంగా తప్పించింది. పంజాబ్‌కు పంపించింది. రాష్ట్రపతిగా ముర్ము గె లిచిన సంంబరంలో ఉన్న వేళ, రెండు రోజుల క్రితం ఆకస్మికంగా జరిగిన ఈ మార్పు తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమయింది.
రాష్ట్ర విభజనకు ముందు జాయింట్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పనిచేసిన మంత్రిజీ, రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయి ఆర్గనైజేషన్ సెక్రటరీగా, పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదాకు మారారు. ఆరకంగా తెలంగాణ బీజేపీలో మంత్రి శ్రీనివాస్ ఎనిమిదేళ్ల ప్రస్థానం ముగిసినట్టయింది. ఆయనను పంజాబ్ సంఘటనా మంత్రిగా బదిలీ చేశారు.
తెలంగాణ బీజేపీలో ఎనిమిదేళ్లపాటు విజయవంతంగా చక్రం తిప్పిన రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ను హటాత్తుగా పంజాబ్‌కు బదిలీ చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. నిజానికి మంత్రి శ్రీనివాస్‌పై అంతర్గతంగా పార్టీలో వచ్చినన్ని విమర్శలు మరెవరిపైనా రాలేదు. ఎనిమిదేళ్లు సంఘటనా మంత్రిగా ఉండి, పార్టీని నడిపించిన ఆయన సారథ్యంలో, బీజేపీ గెలిచింది ఒక్కటంటే ఒక్క నియోజకవర్గమే. అది కూడా రాజాసింగ్ వ్యక్తిగత ఇమేజ్ తప్ప, మంత్రిజీ గొప్పతనం కాదన్నది పార్టీ నేతల విశ్లేషణ.
ఇక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ విజయం కూడా వారి వ్యక్తిగత చరిష్మానే తప్ప, అందులో మంత్రిజీ గొప్పతనం లేదన్నది పార్టీ నేతల వాదన. పైగా 5 గురు ఎమ్మెల్యేలున్న పార్టీని, ప్రారంభంలో ఒక స్థానానికి తీసుకువచ్చిన ఘనత ఆయనదేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఆయన ఏబీవీపీ వారినే ఎక్కువ ప్రోత్సహించారని, నియోజకవర్గానికి ఒక్కోరికి వాహనాలు కొనుగోలు చేసి, నెలకు పదివేల రూపాయలిచ్చినా, గోషామహల్ నియోజకవర్గం మినహా ఎక్కడా గెలిచిన దాఖలాలు లేవు. ఆ వాహనాలు ఎటు వెళ్లాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్ధకమేనంటున్నారు.
ఆరకంగా 104 నియోజకవర్గాల్లో పార్టీకి డిపాజిట్లు రాని పరిస్థితి.పైగా ఎమ్మెల్సీగా ఉన్న రామచందర్‌రావు విజయం కోసం పనిచేయకుండా, అక్కడ ఉన్న కీలక నేతలను వేరే ప్రాంతాలకు పంపించారన్నది మరో విమర్శ. బండి సంజయ్, కిషన్‌రెడ్డి వంటి ప్రముఖులను పక్కనపెట్టి అంతా తానై నిర్ణయాలు తీసుకున్నారన్నది ఇంకో విమర్శ.
ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ఐదు నియోజకవర్గాల్లో, టీఆర్ఎస్తో అంతర్గత ఒప్పందం కుదిరిందన్న ప్రచారం అప్పట్లో పార్టీని కుదిపేసింది. ఆ ప్రకారంగా ఇప్పుడు జాతీయ స్థాయి ప్రముఖుడితో సహా, మరో నలుగురిపై టీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్ధిని నిలబెట్టాలన్న ఒప్పందం జరిగిందని, దానికి ఉస్మానియా యూనివర్శిటీ ప్రముఖుడు-సీఎంఓ కీలక అధికారి ఆధ్వర్యంలో ఆ రాయబారం సాగిందన్నది ఆ చర్చల సారాంశం. దీనిపై ఇప్పటివరకూ పార్టీపరంగా, విచారణ జరిగిన దాఖలాలు లేవన్నది మరో ప్రధాన విమర్శ.
నిజానికి మంత్రి శ్రీనివాస్‌ను తప్పించాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే ఫిర్యాదులు ప్రారంభమయ్యాయి. డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ జమానాలో చాలామంది సీనియర్లు ఢిల్లీకి వెళ్లి మరీ మంత్రిజీని మార్చాలని ఫిర్యాదు చేశారు. ఆయన సీనియర్లను పక్కనపెట్టి, తన సొంత వర్గాన్ని పెంచి పోషిస్తున్నారన్నది వారి ప్రధాన ఫిర్యాదు. ఆయన హయాంలో పార్టీ విస్తరించకపోగా, దశాబ్దాల నుంచి పార్టీకి పనిచేసిన వారంతా నిస్తేజంగా ఉన్నారన్నది మరో ఫిర్యాదు.
మంత్రిజీ ఏబీవీపీలో తప్ప బీజేపీలో పనిచేయలేదు. కేవలం సంఘ్ నుంచి పర్యవేక్షణనేతగా వచ్చినప్పటికీ.. ఆయన తెలంగాణ సీఎం అభ్యర్ధిగా బీజేపీ వర్గాల్లో ప్రచారం జరగడం విశేషం. అప్పటికే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, తర్వాత ఈటల రాజేందర్, డికె అరుణ పేర్లు సీఎం అభ్యర్ధులుగా ప్రచారంలో ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో ఆయన పార్టీలో చక్రం తిప్పారని స్పష్టమవుతోంది.
బయట నుంచి సంఘటనా మంత్రి?
తెలంగాణ సంఘటనా మంత్రి శ్రీనివాస్ పంజాబ్‌కు బదిలీ అయిన నేపథ్యంలో, కొత్త సారథి ఎవరన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇతరాష్ట్రాలకు చెందిన ఇద్దరిని తెలంగాణ సంఘటనా మంత్రి, సహ సంఘటనా మంత్రిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజానికి సంఘటనా మంత్రులకు ఒక కాలపరిమితి ఉండదు. వారంతా సుదీర్ఘకాలం నుంచీ రాష్ట్రాల్లో పనిచేస్తుంటారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగు నేతలే సంఘటనా కార్యదర్శులుగా ఉండేవారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరూ సంఘటనా మంత్రులుగా వచ్చిన దాఖలాలు లేవు. అయితే, సంఘటనా మంత్రులు సుదీర్ఘకాలం పాతుకుపోయిన క్రమంలో.. వారిలోని అనేక బలహీనతలను, పార్టీ నేతలు సొమ్ము చేసుకునే సంప్రదాయం మొదలయింది. ఆ ఆరోపణల కారణంగా వారిని తొలగించిన దాఖలాలు కూడా తెలుగు రాష్ట్రాల బీజేపీలో కనిపిస్తాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలన్న కసితో ఉన్న బీజేపీ.. అందులో తొలి అడుగుగా, ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరిని సంఘటనా-సహ సంఘటనా మంత్రులుగా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారిలో సంఘటనా మంత్రిగా గుజరాత్‌కు చెందిన నేత నియమితులు కావచ్చంటున్నారు. కాగా మంత్రి శ్రీనివాస్ బదిలీ వార్త, ఆయన అనుచరులకు షాక్ కలిగించింది.