త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును, ఏపీ బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ సీనియర్ నేత పురిఘళ్ల రఘురాం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ఉప రాష్ట్రపతిని కలిసి, రాజ్యసభలో ఇప్పటివరకూ ఆయన సమర్ధవంతంగా నిర్వహించిన పాత్రను గుర్తుచేశారు. పార్లమెంటుచరిత్రలో వెంకయ్య ప్రస్థానం ఓ మధురఘట్టమని ప్రశంసించారు. కేంద్రమంత్రిగా, ఉప రాష్ట్రపతిగా అనేక పదవులు నిర్వహించిన వెంకయ్యనాయుడు, తెలుగువారు కావడం తెలుగువారి అదృష్టమని కొనియాడారు. రాజకీయాల్లో ఎదుటివారిని ప్రత్యర్ధులుగా చూడాలే తప్ప, శత్రువుగా చూడకూడదన్న వెంకయ్య సిద్ధాంతాన్ని అన్ని పార్టీలూ పాటించాలన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో చిత్తశుద్ధి, విలువలు, విశ్వసనీయత, ప్రజలకు మేలు చేయాలన్న తపన ముఖ్యమని.. ప్రధానంగా కష్టపడి పనిచేసే మనస్తత్వంతోపాటు, పుట్టిన గడ్డకు మేలు చేయాలన్న ఆలోచన ఉండాలని వ్యాఖ్యానించారు.