– బండి సంజయ్ తో బహిరంగ చర్చకు సిద్ధమా?
– తరుణ్ చుగ్ సవాల్
– ఎంపీ ధర్మపురి అర్వింద్ హౌస్ అరెస్ట్
– రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్ బీజేపీనేతల అరెస్ట్
– తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో నిరుద్యోగ దీక్ష
పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం చనిపోవద్దని, మీ పక్షాన బీజేపీ పోరాడుతుందని బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి హామీ ఇచ్చారు. నిరుద్యోగులు, విద్యార్ధుల తరఫున కేసీఆర్ సర్కారును బీజేపీ నిలదీస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
ఇవాళ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి..పెంచి పెద్ద చేస్తారన్నారు. అలాంటి పిల్లలు ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాంటి నిరుద్యోగులంతా తమ తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు పోరాటం
చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదన్నారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన యువత… ఇవాళ ఉద్యోగం కోసం చనిపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రతీ సమస్యకు అనేక పోరాటాలన్నారు. పిరికితనం కాదు ఎదురు తిరగాలన్నారు.కేసీఆర్ ప్రభుత్వంపై యువత పోరాడాలన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్ల పాటు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు ఇవ్వాలన్నారు. కానీ జీతాలు ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని విమర్శించారు విజయశాంతి.
హైదరాబాద్ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మొదట ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేయాలని నిర్ణయించారు. ఐతే పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేదికను పార్టీ ఆఫీస్ కు మార్చారు. నిరుద్యోగ దీక్షకు భయపడే సర్కార్ ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని కోరారు ఆ పార్టీ నేతలు.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ మీ కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాడాలన్నారు. ఉద్యోగులు పెన్ డౌన్ చేయమని నేను అడగడం లేదు కానీ.. ఓ గంట పాటు నిరుద్యోగాల కోసం గొంతు విప్పాలన్నారు రాములమ్మ. మీ తమ్ముళ్లకు ధైర్యం చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే ధైర్యం సత్తా యువతకు ఉందన్నారు. మీకోసం భారతీయ జనతా పార్టీ ఉందన్నారు విజయశాంతి.
ఏడేళ్ల పాటు మీరేం చేశారు?: తరుణ్
తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్.. కేసీఆర్ సర్కారు విధానాలను తప్పుబట్టారు. ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారన్నారు. ఈరోజు ఉద్యమ కారులంతా బీజేపీ వెంట నడుస్తున్నారన్నారు. కేసీఆర్ నిరుద్యోగుల్ని మోసం చేశారన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన యువతను సీఎం మరిచిపోయారన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు తరుణ్ చుగ్ బహిరంగ సవాల్ చేశారు. ఏడేళ్ల పాటు మీరేం చేశారు? బండి సంజయ్ తో బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్ చేశారు. ఏడేళ్ల మోదీ పాలన.. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ఉద్యోమ ద్రోహులకు టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందన్నారు. నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతల్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు తరుణ్ చుగ్. కరోనా మహమ్మారి కోసం మీరేం చేశారు ? పేదలకోసం మీరేం ఏం
చేశారు ? అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇవాళ దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి మోడీ సర్కార్ ఉచితంగా బియ్యం అందిస్తోందన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ సర్కార్ ఫ్రీ టీకా ఇవ్వలేదన్నారు. దేశప్రజలకు ఉచితంగా మోడీ సర్కార్ వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు.
పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణలో యువత ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలు లేక అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. డిగ్రీలు, చదువులు మాని… తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొందన్నారు. ఆ యువత చేసిన పోరాటంతో కేసీఆర్ అధికార పీఠం ఎక్కారన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని
కేసీఆర్.. యువతను మభ్య పెట్టారన్నారు. ఇన్నేళ్లు గడిచినా… బంగారు తెలంగాణ మాత్రం రాలేదన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడ్డాయన్నారు. ప్రతీ ఇంటికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీం అని తరుణ్ చుగ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ వచ్చే వరకు ప్రతీ బీజేపీ కార్యకర్త పోరాడాలని పిలుపు నిచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న నిరుద్యోగ దీక్షకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ నేతలను వేములవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు.మహబూబ్ నగర్ నుంచి నిరుద్యోగ దీక్షకు బయలుదేరి వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, ఇతర జిల్లా నాయకులను అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తప్పించుకుని దీక్ష వద్దకు చేరుకున్న ఈటల
రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రభుత్వ కొలువులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు చేపడుతున్న నిరుద్యోగ దీక్ష వేదిక వద్దకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేరుకున్నారు. రాష్ట్రంలో అనేక మంది బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నప్పటికీ.. అన్ని నిర్బంధాలను తప్పించుకుని దీక్ష వద్దకు చేరుకున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరై దీక్షను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలు నేతలు దీక్షలో పాల్గొంటున్నారు. అయితే దీక్షలో భాగస్వామ్యం కాకుండా చేసేందుకు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.