– తెలుగుదేశంతో పొత్తు లేకున్నా తెగించరేం?
– సర్కారుపై సమరశంఖం పూరించరేం?
– స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టలేదేం?
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రనేతలు పోటీ చేయరేం?
– బాబు వల్లే ఏపీలో బీజేపీ ఎదగడం లేదట
– హైకమాండ్‌కు బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు విచిత్ర లేఖ
– వీర్రాజు లేఖపై బీజేపీ నేతల విస్మయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘ మా పక్కింటాయన మగాడు కాదు. మా ఎదురింటాయన మగాడు కాదు. నాతో జతకట్టిన ఫ్రెండు మగాడు కాదు. అందుకే మా ఆవిడకు పిల్లలు పుట్టడం లేదు. నాకు పిల్లలు పుట్టకపోవడానికి వారే కారణం’’ – వెనకటికి పిల్లలు పుట్టని ఓ వీరయ్య ఆవేశమిది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవచిత లేఖ కవిహృదయం కూడా, దాదాపు ఇలాగే ఉంది. రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన తన పార్టీకి లేఖ రాశారన్నది జరుగుతున్న ఓ ప్రచారం. అది నిజమో-కాదో పక్కనపెడితే.. వీర్రాజు వాదన మాత్రం, అచ్చం పిల్లలు పుట్టని వీరయ్య కథ మాదిరిగానే ఉంది.
అదెలాగో చూద్దాం…
ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకూ వెంకయ్యనాయుడే బీజేపీని వెలిగించారు. ఆ పార్టీకి ఆయనే ఆశ, శ్వాస. వెంకయ్య తర్వాత, ఢిల్లీలో వెలిగిన తెలుగోడు మరెవరూ లేరు. వెంకయ్య వెలిగిన స్థాయిలో, ఆయన పార్టీ ఆంధ్రాలో వెలగలేదు. ఆయన అనుమతి లేనిదే జిల్లా అధ్యక్షుడు కూడా కాలేని పరిస్థితి. అలా ‘ప్రతి జిల్లాలోనూ ఒక వెంకయ్య’ కనిపించేవారు. ఆయన తన పార్టీ గెలవకపోయినా ఫర్వాలేదు. టీడీపీ మాత్రం గెలవాలని కోరుకునేవాళ్లని, ఇప్పటికీ ఆయనపై ఉన్న ఒక నింద. అసలు టీడీపీతో కటీఫ్‌తో చెప్పే ముందే, నాయకత్వం జాగ్రత్తగా వెంకయ్యను, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించిందన్నది ఒక ప్రచారం. ఇంకా చెప్పాలంటే ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి, పనిచేసేవారు పారిపోవడానికి ప్రధాన కారణం కూడా నెల్లూరు నాయుడు గారేనన్నది, ఇప్పటికీ వినిపించే బలమైన ఆరోపణ లాంటి విమర్శ.
ఓకే. ఆ నిందలో ఎంతో కొంత నిజం ఉండవచ్చు. ఆయన వల్ల చాలామంది సీనియర్లు రాజకీయంగా శరాఘాతాలు తిని నష్టపోయి ఉండవచ్చు. అప్పట్లో నాయుడు వర్గాన్ని ఎదుర్కొని, ఆయన వల్ల తొలిరోజులో రాష్ట్ర అధ్యక్ష పదవి దూరమైన, ఇప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి నేతలు.. వెంకయ్య వల్లే, ఏపీలో కమలం వికసించలేదన్న నిశ్చితాభిప్రాయంతో ఉండవచ్చు.
కాదనలేం. కానీ.. ఇప్పుడు నెల్లూరు నాయుడు గారు పార్టీకి, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఉప రాష్ట్రపతి కుర్చీలో కూర్చున్నప్పుడే, ఆయనకు కమలవనంతో బంధం తెగిపోయింది. ఇప్పుడు ఆయన తన మానాన తాను ఏవేవో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ వాసనలేమీ కనిపించడం లేదు. పైగా ఆయన చెబితే, వినే నాయకత్వమూ లేదు. అవన్నీ గతకాలపు వైభవాలే!
ఇక టీడీపీతో బీజేపీ పెళ్లి పెటాకులయి ఐదారేళ్లయింది. పొత్తుల్లో ఉన్నప్పుడు పార్టీ ఎదగలేదని కమలదళాలు బాధపడటంలో తప్పులేదు. అందుకు టీడీపీనే ప్రతిబంధకమవుతోందని, వాపోవడమూ తప్పు కాదు. పొత్తు వల్ల బీజేపీ ఎదిగే అవకాశం పోయిందని, అందుకు టీడీపీని ఒక కారణంగా చూపడం రాజకీయ ధర్మమే.
మరి.. ఇప్పుడు బీజేపీకి అటు నెల్లూరు వెంకయ్య నాయుడు అడ్డులేరు. ఇటు చిత్తూరు చంద్రబాబు నాయుడూ అడ్డుకాదు. మరి వెంకయ్య లేకపోయినా కమలదళాలు ఎందుకు విజృంభించరు? పువ్వుపార్టీ ఇన్నేళ్లయినా ఎందుకు వికసించలేదు? ఇన్నాళ్లూ ఆయననే సాకుగా చూపి, నానా యాగీ చేసి టన్నుల కొద్దీ కన్నీరు కార్చిన భాజపేయులు, ఇప్పుడు మూడో కన్ను తెరవచ్చుకదా? అగ్గిరాముళ్లు అవ్వవచ్చు కదా?
నాయుడు గారి వల్ల రాజకీయ జీవితం పోగొట్టుకుని, రాజకీయ వైధవ్యం పొందుతున్న వాళ్లంతా ముందువరసలో నిలబడి, ఆంధ్రాలో పువ్వుపార్టీని పరిమిళింప చేయవచ్చు కదా?
పార్టీని అధికారంలోకి తీసుకువస్తామంటే అది నాయకత్వం వద్దంటుందా? పక్కన తెలంగాణ రాష్ట్ర కమలదళపతి బండి సంజయ్ మాదిరిగా.. సర్కారుపై సమరశంఖం పూరించి, ఒంటికాలితో లేచి క్యాడర్‌ను కదిలించడానికి ఉన్న అడ్డేమిటి?
అప్పుడంటే ‘పువ్వు’ పరిమళించేందుకు నెల్లూరు నాయుడు గారు అడ్డుపడుతున్నారన్న నింద ఉండేది. మరి ఇప్పుడు ఎవరు అడ్డు పడుతున్నారు? అన్నీ ఉన్నా అయిదోతనం తక్కువనట్లు.. స్వతహాగా ఎదగలేక, సాకులతో రాజకీయ జీవితం కొనసాగించే పువ్వుపార్టీ ప్రముఖులు, జీవితాంతం ఇలాంటి వాదనతోనే కాలం వెళ్లదీస్తారన్నది ఒక ప్రముఖుడి ఉవాచ. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా లేని దిక్కుమాలిన పరిస్థితికి, రేపటి కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అగ్రనేతలు పారిపోయిన వీరత్వానికి కారణమెవర న్నది పార్టీ నేతల ప్రశ్న.
ఇక టీడీపీ వల్లే రాష్ట్రంలో బీజేపీ ఎదగడం లేదంటూ.. అధ్యక్షుడు సోము వీర్రాజు రాశారని చెబుతున్న లేఖ, సొంత పార్టీలోనే నవ్వులపాలవుతోంది. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు పెట్రో ధరలు పెంచారు. పోలవరం లెక్క తేల్చలేదు. ప్రత్యేక హోదాకు గతి లేదు. విశాఖ స్టీల్ తెగనమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్లోనూ ఏపీకి మొండి చేయే. అయినా సరే.. వాటిపై విరుచుకుపడాల్సిన విపక్ష తెలుగుదేశం నవరంధ్రాలూ మూసుకుంది. కనీసం కలలో కూడా వాటిని వ్యతిరేకించే సాహసం చేయలేదు. పైగా వాటికి కారణమైన మోదీ సర్కారును విమర్శకుండా, కేంద్రంపై పోరాడని వైసీపీ సర్కారుపై విరుచుకుడుతోంది.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడగకపోయినా, పరుగెత్తుకెళ్లి మరీ తనంతట తాను మద్దతునిచ్చింది. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా, జిందాబాదు కొట్టి మరీ టీడీపీ తన విశ్వసనీయ చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఉరికించాల్సిన చోట ఊడిగం చేస్తోంది. కమలం కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తోంది. మరి ఏపీలో బీజేపీలో ఎదగకపోవడానికి, టీడీపీ ఎలా కారణమన్నది భాజపేయుల ఆశ్చర్యం. కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు బీజేపీకి విడాకులిచ్చి, టీడీపీకి వెళ్లడం బాబు తప్పెలా అవుతుంది? కన్నా లాంటి మాస్ లీడర్‌ను, రావెల కిశోర్‌బాబు వంటి దళిత నేతనూ వదులుకోవడం, సీఎం రమేష్- సుజనా చౌదరి- టిజి వెంకటేష్ వంటి ప్రముఖులు స్తబ్దుగా ఉండటానికి.. వీర్రాజు నాయకత్వ వైఫల్యమే తప్ప, టీడీపీ కారణం కాదన్నది కమలదళాల వాదన. ‘ఆయనే ఉంటే మంగలాయనతో పని ఏమిట’న్నట్లు… కంతేరు వీర్రాజు తన నాయకత్వ వైఫల్యాన్ని, ఈ విధంగా ప్రతిసారీ ఎవరో ఒకరిపై రుద్దడం అలవాటేనన్నది తూగో జిల్లా బీజేపీ నేతల విశ్లేషణ.
వైసీపీ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని.. స్వయంగా ప్రధాని మోదీ ఆదేశించి నెలలు గడుస్తున్నా, ఇప్పటిదాకా దానిపై కార్యాచరణ లేదు. ఇటీవలే తెలంగాణలో అదే బీజేపీ… కేసీఆర్ సర్కారుపై వేసిన చార్జిషీట్‌ను, జనంలోకి తీసుకువెళుతోంది.
తెలంగాణలో బండి సంజయ్, బుల్లెట్ వేగంతో క్యాడర్‌ను నడిపిస్తున్నారు. కేసీఆర్ సర్కారు బీజేపీ దూకుడుకు బెంబేలెత్తుతోంది. మరి ఆంధ్రాలో ఆ దూకుడు ఏదీ? పార్టీ అదే అయినప్పుడు… ప్రత్యర్ధి పార్టీనే అధికారంలో ఉన్నప్పుడు.. రెండు రాష్ర్టాల్లో ఒకే పార్టీకి రణమేమిటి? రాజీ ఏమిటి? ఎందుకీ మొహమాటం? ఆయన లేస్తే మనిషికాదన్నట్లు… ఆంధ్రాలో పార్టీ లేచేదెప్పుడు? ఇదీ ఇప్పుడు సగటు బీజేపీ కార్యకర్త వేసే అమాయక ప్రశ్న.